ఏబీవీ ఎఫెక్ట్ ఎంత? : సోషల్ మీడియాలోనే కనిపిస్తున్న హడావుడి

స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ స్థానానికి పోటీ చేస్తున్న ఏబీవీ తొలి నుంచి సోషల్ మీడియా ప్రచారంలో ముందంజలో ఉన్నారని విశ్లేషిస్తున్నారు.

Update: 2026-10-29 12:30 GMT

రాష్ట్రంలో అత్యంత రాజకీయ ప్రాధాన్యం ఉన్న విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇండిపెండెంటుగా పోటీలోకి దిగడంతో నగర రాజకీయమే మారిపోయిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయనకు మద్దతుగా విద్యావంతులు, రిటైర్డ్ ఐఏఎస్, పోలీసు అధికారులు గళం వినిపిస్తున్నారు. ఇదే సమయంలో ఏబీవీ సైతం సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో నగరంలో కూటమి వర్సెస్ ఏబీవీ అన్నట్లు రాజకీయం మారిపోయిందని విశ్లేషిస్తున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియా సృష్టి మాత్రమేనని, క్షేత్రస్థాయిలో కూటమి, విపక్షం వైసీపీ మధ్య ముఖాముఖి పోరు మాత్రమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనికి కారణంగా డిజిటల్ ప్రచారంలో ఏబీవీ పైచేయి సాధిస్తున్నప్పటికీ, డివిజన్ పర్యటనల్లో జోరు చూపలేకపోవడమే అంటున్నారు.

అంతా డిజిటల్ ప్రచారమే..

స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ స్థానానికి పోటీ చేస్తున్న ఏబీవీ తొలి నుంచి సోషల్ మీడియా ప్రచారంలో ముందంజలో ఉన్నారని విశ్లేషిస్తున్నారు. రిటైర్ అయిన నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్న ఏబీవీకి ఈ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం డిజిటల్ మీడియా బాగా పనికొచ్చిందని విశ్లేషిస్తున్నారు. అయితే డిజిటల్ మీడియా విస్తృతి ఎక్కువగా ఉండటం, అందులో ఆయన ప్రచారం, అభ్యర్థన విజయవాడ నగర వాసులకు ఎంతవరకు చేరుతుందనే అంశమై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడి వారు అయినా డిజిటల్ ప్రచారంపై స్పందించవచ్చునని, కానీ వారు ఓటు వేసే అవకాశం ఉండదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో నేరుగా ప్రచారం చేయడం వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు.

సమయమే అసలు సమస్య

డిజిటల్ మాధ్యమంలో జోరుగా ప్రచారం చేసుకుంటున్న ఏబీవీ.. ఓటర్లను చేరువయ్యే క్షేత్రస్థాయి పర్యటనల్లో వెనకబడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నగరం పరిధిలో ఆయన తీరిక లేకుండా పర్యటిస్తున్నా, సమయం తక్కువగా ఉండటం వల్ల ముక్తసరిగా సరిపెట్టాల్సివస్తోందని, అదే సమయంలో తీరిక లేని నగర జనం ఆయన మాటలను వినేందుకు కూడా సరిగా సమయం కేటాయించలేకపోతున్నారని అంటున్నారు. దీనివల్ల ఏబీవీ ప్రచారం ప్రజలకు ఎంతవరకు చేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీ ఎంతవరకు ప్రభావం చూపగలరనేది హాట్ టాపిక్ అవుతోంది. మేయర్ రేసులో దిగుతున్నట్లు ఏబీవీ ప్రకటించిన వెంటనే ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టాయని అంటున్నారు. అయితే ప్రచార తీరు చూసిన తర్వాత తమకు ఏం నష్టం లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయని చెబుతున్నారు.

అసలు వ్యూహం వేరే..

ఇక ఏబీవీ పోటీపై పరిశీలకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. మేయర్ గా పోటీ చేయాలన్న ఏబీవీ అనూహ్య నిర్ణయం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. రిటైర్ అయిన తర్వాత తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్న ఏబీవీ.. తన సామర్థ్యం ఏంటో నిరూపించుకోవడమే కాకుండా, ఆ మేరకు ప్రభుత్వ పెద్దలకు స్పష్టమైన సంకేతం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ఎన్నికల రంగంలోకి దిగినట్లుగా అనుమానిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా తనకు వచ్చే ఓట్లే ప్రాతిపదికగా భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే ఆలోచనతో ఏబీవీ రంగంలోకి దిగారని విశ్లేషిస్తున్నారు. ప్రధాన పార్టీలకు దీటుగా ఓట్లు సాధిస్తే విద్యావంతులు, ఉద్యోగుల్లో తన వాదన సరైనదిగా భావించి మరింత దూకుడుగా పనిచేయొచ్చని ఆయన ఆలోచనగా ఉందని, లేనిపక్షంలో తన వైఖరిని పునఃసమీక్షించుకునేలా అడుగులు వేయొచ్చని అంటున్నారు. ఏదిఏమైనా విజయవాడ కార్పొరేషన్ రేసును వ్యూహాత్మకంగా వాడుకోవాలనే ఆలోచనతోనే ఏబీవీ ఉన్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News