బ్యాలెట్ దిగింది ఎవరికి...మోడీ గెలిచారా ఓడారా ?

అయితే బ్యాలెట్ పోరులోనూ తమదే విజయం అని మోడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కామెంట్స్ చేశారు.

Update: 2026-10-29 17:30 GMT

బ్యాలెట్ విధానమే మళ్ళీ దేశంలో ప్రవేశపెట్టాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అది చాలా కాలంగా కోరుతున్నదే అయినప్పటికీ సర్ ప్రక్రియలో లోపాలు, ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఇటీవల కాలంలో విపక్షాల స్వరం మరింతగా పెంచాయి. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ బ్యాలెట్ విధానం ఉండాలని ఏకైక డిమాండ్ తో విపక్షం అంతా ఒక్కటిగా కదులుతోంది. అయితే ఈ దేశంలో ఇంకా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు బ్యాలెట్ విధానమే అమలులో ఉంది. ఈ ఎన్నికల్లో కూడా గెలుపోటములు వేరు వేరుగా ఉంటున్నాయి. అయితే తాజాగా దేశంలో వివిధ రాష్ట్రాలలో 28 ఎమ్మెల్సీ సీట్లకు పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. అందులో 16 ఎమ్మెల్సీ సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంది. అదే సమయంలో బీజేపీకి హార్డ్ కోర్ సీట్లే కోల్పోవాల్సి వచ్చింది.

బీజేపీ గెలిచింది కానీ :

ఇక దేశంలోని నాలుగు రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక జరిగిన 28 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానాల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏకంగా పదహారు సీట్లు గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు ఒకవైపు విజయాన్ని అందించినప్పటికీ మరో వైపు ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా తెచ్చాయని అంటున్నారు. బీజేపీ తన సంప్రదాయ అత్యంత ప్రతిష్టాత్మకమైన కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అందులో మోడీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని ఎమ్మెల్సీ సీటు ఉంటే, బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి పెట్టని కోటగా ఉన్న నాగపూర్ ఎమ్మెల్సీ సీటుని ఆ పార్టీ కోల్పోయింది.

భారీ షాక్ గానే :

ఈ రెండు సీట్లు ఎందుకు రాజకీయంగా ప్రాధాన్యత అంటే నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నగరం. అంతేకాకుండా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి అగ్రనేతలకు ఇది సొంత ఇలాకాగా ఉంది. ఇక చూస్తే దాదాపు ఐదు దశాబ్దాలుగా ఈ స్థానం బీజేపీ లేదా ఆ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థుల చేతిలోనే ఉంది. కానీ తాజాగా జరిగిన మహారాష్ట్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించి బీజేపీ కోటకు భారీ షాక్ ఇచ్చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ఎమ్మెల్సీ స్థానంలో ఎస్పీ అభ్యర్థి గెలిచారు. దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీకి ఉన్న పట్టును ఎస్పీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో గండి కొట్టేశారు.

మోడీ సమర్ధించుకున్నా :

అయితే బ్యాలెట్ పోరులోనూ తమదే విజయం అని మోడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కామెంట్స్ చేశారు. దేశంలోని నాలుగు పెద్ద రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి నిర్వహించారు. మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో అంటూ వ్యంగ్యంగా నరేంద్ర మోడీ ప్రశ్నించారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై తప్పుపడుతూ బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుంటుంది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను మోడీ ఈ విధంగా తిప్పికొట్టారు. అయితే మహారాష్ట్రలో నాగపూర్ సీటుని కాంగ్రెస్ గెలుచుకుంది. అది బీజేపీ కంచుకోట అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే వారణాసి ఫలితం కూడా షాక్ కాదా అంటున్నారు.

బ్యాలెట్ పెడతారా :

బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి ఇక మీదట సాధారణ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పేపర్ ని పెడతారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ పెడితే కచ్చితంగా బీజేపీ 2029 లో ఓడిపోతుందని ఆ పార్టీకి వంద ఎంపీ సీట్లు కూడా రావని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తాము ఎన్ని సీట్లు గెలిచామన్నది ప్రధానం కాదని ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండెకాయ లాంటి నాగపూర్ సీటు కాంగ్రెస్ దక్కించుకోవడం ఎంతో విలువైనది అని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ నైతికంగా ఓడిపోయింది అని ఆయన విమర్శిస్తున్నారు. ఇంతకీ మోడీ గెలిచారా లేక ఓడారా అంటే ఓడారు అని కాంగ్రెస్ బల్ల గుద్ది మరీ చెబుతోంది. నిజానికి బీజేపీలోనూ ఈ ఫలితాల మీద అంతర్మధనం జరుగుతోంది.

Tags:    

Similar News