పోలింగ్ ని రెండు కళ్ళతో నిఘా...తప్పు చేస్తే అంతే !
పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఈసారి డ్రోన్లు సీసీటీవీలను అన్ని చోట్లా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీడియో చిత్రీకరణ అన్నది నిరంతరం సాగుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తోంది. నవంబర్ 1న మునిసిపాలిటీలకు పోలింగ్ ఉంది. ఈ పోలింగ్ సాఫీగా సక్రమంగా జరిగేందుకు వీలుగా గట్టిగానే నిఘా పెట్టారు. అంతే కాదు ఆధునిక సదుపాయాలను ఉపయోగించుకుని ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
డ్రోన్లు, సీసీటీవీలతో నిఘా :
పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఈసారి డ్రోన్లు సీసీటీవీలను అన్ని చోట్లా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీడియో చిత్రీకరణ అన్నది నిరంతరం సాగుతుంది. ఆ నిఘా నీడలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలను స్వేచ్ఛా యుతంగా నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. 36 వేల మందికి పైగా పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో కానీ పోలింగ్ వేళ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నారు.
సెన్సెటివ్ ప్రాంతాలలో :
ఇక ఏపీలో సున్నితమైన అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి మీద ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెడుతోంది. ఇలాంటివి ఏపీ వ్యాప్తంగా నాలుగు వేల 372 దాకా ఉన్నాయని గుర్తించారు. దాంతో ఆయా పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మరింతగా కట్టుదిట్టం చేశారు. ఇక ఇందులో అతి సున్నితమైన 671 కేంద్రాలకు మూడు వేల 355 మంది సిబ్బందిని, సున్నితమైన ఒక వేయి ,233 కేంద్రాలకు 4 వేల 943 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు.
కఠినంగానే :
ఒక వైపు డ్రోన్లు, మరో వైపు సీసీ కెమెరాలు నిరంతరం వీడియో రికార్డింగ్ తో పోలింగ్ అత్యంత పటిష్టంగా జరగనుంది. అందువల్ల ఎవరైనా పోలింగ్ లో నిబంధనలను ఉల్లంఘిస్తే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా కావచ్చు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే అలాగే, లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.
నిర్భయంగా రావాలి :
ఓటర్లు అంతా నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లు ఎలాంటి భయం ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటేయాలని సూచించింది. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరింది. ప్రతి ఓటరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.