టీడీపీలో సైలెంట్ రెవల్యూషన్ : లాబీయింగ్‌కు నో ఛాన్స్, కష్టానికి ఫుల్ రెస్పెక్ట్
తెలుగుదేశం పార్టీలో సైద్ధాంతిక నిబద్ధతకు, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని మరోసారి రుజువైంది.
తెలుగుదేశం పార్టీలో సైద్ధాంతిక నిబద్ధతకు, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని మరోసారి రుజువైంది. అనంతపురం జిల్లాకు చెందిన క్షేత్రస్థాయి బీసీ మహిళా నాయకురాలు దళవాయి రామదేవిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం ద్వారా పార్టీ అధినాయకత్వం సరికొత్త చర్చకు తెరలేపింది. పదవుల కోసం పైరవీలు, లాబీయింగ్ అవసరం లేదనే విషయాన్ని కార్యకర్తలకు స్పష్టం చేసిందని అంటున్నారు. కష్టపడి పనిచేస్తే పదవులు ఆటోమెటిక్ గా వస్తాయని చెప్పేందుకు ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి ఎంపిక ఒక ఉదాహరణగా చూపుతున్నారు.
క్షేత్రస్థాయి నాయకత్వానికి పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే సాధారణ కార్యకర్తలను కూడా అత్యున్నత స్థానాలకు చేర్చవచ్చని దళవాయి రామదేవి ఎంపిక నిరూపిస్తోందని అంటున్నారు. డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా, టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె అందించిన సేవలు పార్టీలో ఆమె స్థాయిని పెంచాయని చెబుతున్నారు. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే మహిళా నాయకులకు ఇటువంటి పదవులు దక్కడం ద్వారా భవిష్యత్తులో మరింత ఎక్కువగా కొత్తవారు రాజకీయాల్లోకి వచ్చేందుకు చక్కటి ప్రేరణ లభించిందని అంటున్నారు. మరోవైపు బీసీ కోటాలో దళవాయి రామదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించగా, అదేరోజు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సామాజిక సమీకరణాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీసీల్లోని వడ్డెర సామాజికవర్గానికి ఇప్పటివరకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదని అంటున్నారు. కానీ, కూటమి ప్రభుత్వంలో ఆ వర్గాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. వడ్డెరకు క్వారీల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడంతోపాటు వారికి శాసనమండలి ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా గౌరవించినట్లైందని అంటున్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతంగా వ్యాఖ్యానిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ల కల్పన ద్వారా అణగారిన వర్గాల రాజకీయ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని అంటున్నారు. మాటల కంటే చేతలే ముఖ్యమని నిరూపిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు బీసీ వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక న్యాయం కేవలం నినాదం కాదని, అది అమలులో చూపిస్తామని టీడీపీ మరోసారి నిరూపించిందని చెబుతున్నారు. దళవాయి రామదేవితో పాటు సీనియర్ టీడీపీ నేత, ప్రముఖ దళిత నాయకుడు వర్ల రామయ్యకు కూడా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా దళిత, బహుజన నాయకత్వానికి సముచిత స్థానం దక్కిందని అభినందిస్తున్నారు. మొత్తంగా చూస్తే, దళవాయి రామదేవి, వర్ల రామయ్యల ఎంపికలు కేవలం రాజకీయం మాత్రమే కావని, కష్టపడే ప్రతి కార్యకర్తకూ దక్కిన గౌరవంగా చూడాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లాబీయింగ్‌లకు అతీతంగా ప్రతిభ, అంకితభావానికి విలువనిచ్చే ఈ విధానం తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు.