అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు షాక్.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త రూల్స్
అమెరికాలో శాశ్వత నివాసం పొంది స్థిరపడాలని భావిస్తున్న భారతీయులకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీఐఎస్) కీలక సమాచారం అందించింది
అమెరికాలో శాశ్వత నివాసం పొంది స్థిరపడాలని భావిస్తున్న భారతీయులకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీఐఎస్) కీలక సమాచారం అందించింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియలో సరికొత్త మార్పులను ప్రకటిస్తూ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా స్టేటస్ అడ్జస్ట్‌మెంట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారిపై ఈ నిబంధనలు నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఈ కొత్త రూల్స్ సెప్టెంబర్ 18 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
సవరించిన ఫారమ్‌లు తప్పనిసరి
సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే ఫారం ఐ-485 దరఖాస్తులకు ఈ నూతన నిబంధనలే వర్తిస్తాయి. నిర్దేశిత గడువు దాటిన తర్వాత పాత వెర్షన్ ఫారమ్‌లను అధికారులు ఎంతమాత్రమూ స్వీకరించరని యూఎస్.సీఐఎస్ స్పష్టం చేసింది. కాబట్టి దరఖాస్తుదారులు తాజా సూచనలకు అనుగుణంగా నూతన రూపంలో ఉన్న ఫారమ్‌లను పూర్తి చేసి సమర్పించడం అత్యంత కీలకం.
'పబ్లిక్ ఛార్జ్' నిబంధనల పునఃపరిశీలన
తాజా మార్గదర్శకాల్లో ప్రధానంగా 'పబ్లిక్ ఛార్జ్' అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గ్రీన్ కార్డ్ పొందే వ్యక్తి భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు మరింత లోతుగా విశ్లేషిస్తారు. దరఖాస్తుదారుడి నాణ్యతను అంచనా వేసేందుకు ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వయస్సు , ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక స్థితిగతులు.. విద్య, ఉద్యోగ నైపుణ్యాలు, పని అనుభవం పరిశీలిస్తారు. గతంలో కేవలం ప్రభుత్వ నగదు సహాయం, దీర్ఘకాలిక వైద్య సంరక్షణ పొందే వారిపైనే ప్రధానంగా దృష్టి సారించేవారు. అయితే నూతన నిబంధనల ప్రకారం ప్రభుత్వ హౌసింగ్ సహాయం, ఆహార సంబంధిత పథకాలు, విద్యకు సంబంధించిన కొన్ని ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారా లేదా అనే కోణంలోనూ దరఖాస్తులను పరిశీలించనున్నారు.
స్పాన్సర్లపై పెరగనున్న బాధ్యత
కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులలో స్పాన్సర్లు సమర్పించే అఫిడవిట్ ఆఫ్ సపోర్టు అత్యంత కీలక పాత్ర పోషించనుంది. గ్రీన్ కార్డ్ అభ్యర్థికి అవసరమైన పూర్తి ఆర్థిక బాధ్యతలను తాము మోయగలమని స్పాన్సర్లు గట్టిగా నిరూపించాల్సి ఉంటుంది. ఫలితంగా అమెరికాలో ఉంటూ స్వదేశంలోని కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయాలనుకునే భారతీయులు తమ ఆదాయ మార్గాలు, ఆస్తులు, పన్ను రిటర్నులు, ఇతర ఆర్థిక పత్రాలను ముందస్తుగానే సిద్ధం చేసుకోవడం శ్రేయస్కరం.
పబ్లిక్ ఛార్జ్ బాండ్ సౌలభ్యం
ఒకవేళ పబ్లిక్ ఛార్జ్ నిబంధనల కారణంగా దరఖాస్తుదారుడు అనర్హుడిగా మారే ప్రమాదం ఉంటే, అధికారుల విచక్షణ మేరకు ఫాం I-945 ద్వారా 'పబ్లిక్ ఛార్జ్ బాండ్' సమర్పించే అవకాశాన్ని కల్పిస్తారు. అయితే ఈ బాండ్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం జప్తు చేస్తుంది. ఇక శరణార్థులు, రాజకీయ ఆశ్రయం పొందినవారు.. మానవతా ప్రాతిపదికన దరఖాస్తు చేసే కొన్ని కేటగిరీల వారికి ఈ రూల్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
అమెరికా గ్రీన్ కార్డ్ కోరుకునే దరఖాస్తుదారులు, ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వారు సెప్టెంబర్ 18 నాటికి కొత్త మార్గదర్శకాలను సమగ్రంగా అర్థం చేసుకుని.. సరైన పత్రాలతో దరఖాస్తు చేయడం మంచిది.