కష్టపడ్డ నేతకు హ్యాండ్.. నెల్లూరు వైసీపీలో రచ్చ.!
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో తీవ్ర అశాంతికి, కొత్త వివాదాలకు కారణమవుతున్నాయి. ఒక సమస్యను పరిష్కరించాలని హైకమాండ్ తీసుకుంటున్న ప్రతి చర్య, అనుబంధంగా మరో కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుండటం సింహపురి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇందులో భాగంగానే గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళి తీరుపై రెడ్డి సామాజిక వర్గ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వారి డిమాండ్ మేరకు మురళిని ఆ పదవి నుంచి తప్పించిన అధిష్టానం.. ఆయన స్థానంలో గురవయ్యకు బాధ్యతలు అప్పగించింది. అయితే గురవయ్య నియామకాన్ని కొందరు వ్యతిరేకించడంతో పాటు, ఎమ్మెల్సీ మురళితో జతకట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న మురళిని శాంతింపజేసేందుకు హైకమాండ్ ఆయన కుమారుడికి ఏదైనా పదవి ఇవ్వాలని భావించింది. అనుకున్నదే తడవుగా పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మురళి కుమారుడు డాక్టర్ రేవంత్ చక్రవర్తిని నియమించింది. కానీ ఈ ఒక్క నిర్ణయం నెల్లూరు వైసీపీలో పెను తుఫాను సృష్టించింది.
ఒకరిని బుజ్జగించడానికి మరొకరిని బలి చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన ఊటుకూరు నాగార్జున జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం ఎముకలు అరిగేలా పనిచేసిన నాయకుడిని, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస కారణం చెప్పకుండా ఉన్నఫళంగా ఆ పదవి నుంచి తొలగించడంపై పార్టీలోనే తీవ్ర ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్సీ కుమారుడికి పదవి కట్టబెట్టడం కోసం, అత్యంత చురుగ్గా పనిచేస్తున్న నాగార్జునకు పార్టీ వెన్నుపోటు పొడిచిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాను రాజకీయ ఊడిగం చేయలేదన్న కోపంతోనే కొందరు తెరవెనుక కుట్రలు చేసి తన పదవికి ఎసరు పెట్టారని నాగార్జున ఇన్‌డైరెక్ట్‌గా సిటీ ఇన్‌చార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ను ఉద్దేశించి వాపోతున్నట్లు సమాచారం. తాను మాజీ మంత్రి అనిల్ వర్గానికి చెందిన వాడవ్వడం వల్లే ఈ వివక్ష ఎదుర్కొనాల్సి వచ్చిందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కాగా, ఒకరిని బుజ్జగించేందుకు మరొకరిని బలి చేసే ఈ రకమైన తొందరపాటు నిర్ణయాలు రాంగ్ ఇండికేషన్స్ పంపుతున్నాయని, దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని జిల్లా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.