స్థానికంలో తగ్గేదేలే.. వైసీపీ చీఫ్ జగన్ కీలక ప్రకటన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని, ఈ కారణంగా స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓటేస్తారని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Update: 2026-08-19 14:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రంగంలోకి దిగారు. రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీచేయాలని, ఏ ఒక్క స్థానం ఏకగ్రీవం కాకూడదని ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జులకు ఆదేశాలిచ్చిన జగన్ రెడ్డి తాజాగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల్లో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో విజయం కోసం వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పోలీసులను ప్రయోగిస్తారని, వారిని ఎదుర్కొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాజా వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న ఆయన పార్టీ కేడర్ యుద్ధానికి సిద్దంగా ఉండాలని పిలుపునివ్వడం ద్వారా ఎన్నికల్లో రాజీ లేని పోరాటం చేస్తామని సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని, ఈ కారణంగా స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓటేస్తారని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. "పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలి. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి" అని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి, యుద్ధప్రాతిపదికన ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఏడాదిలో పాదయాత్ర

రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరోసారి తన పాదయాత్రపై ప్రకటన చేశారు. ఏడాది తర్వాత తాను పాదయాత్ర చేస్తానని, ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత వైసీపీనే అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయితే స్థానిక ఎన్నికల్లో అది కనిపించకుండా ఉండేందుకు పోలీసులను వాడుకుంటారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News