మళ్లీ ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం... ఆంక్షలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పన్నెండు రోజుల పాటు పశ్చిమాసియాను రగిలించేసిన ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే.;
పన్నెండు రోజుల పాటు పశ్చిమాసియాను రగిలించేసిన ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో వాతావారణం చల్లబడింది. దీంతో యుద్ధం ముగిసిందంటూ డొనాల్డ్ ట్రంప్ పలు పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి స్పందించిన ఆయన.. మళ్లీ యుద్ధం రావొచ్చేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ముగిసి రెండు రోజులు కావొస్తుంది. పశ్చిమాసియా ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంత వాతావరణంలోకి అడుగుపెడుతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్ తో తాను చర్చలు జరిపానని.. అవి రెండూ ప్రస్తుతానికి అలిసిపోయాయని.. అయితే మళ్లీ యుద్ధ బహుశా ఏదో ఒకరోజు రావొచ్చని.. త్వరలోనే యుద్ధం మళ్లీ ప్రారంభం కావొచ్చని ట్రంప్ అన్నారు.
దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ అయితే ట్రంప్ కు చెప్పకుండా ఏ పనీ చేయకపోవచ్చు. అయితే.. ఇరాన్ ఎప్పుడు ఏమి చేస్తుందో ట్రంప్ గిల్లుడును బట్టి, ఆంక్షలను బట్టి ఉంటుందని.. ఆ ఉద్దేశ్యంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. పైగా.. ఇరాన్ తో చర్చలవేళ ఇది ఓ బెదిరింపు హింట్ అయ్యికూడా ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఇరాన్ తో అణు చర్చల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు ట్రంప్. ఇందులో భాగంగా... వచ్చే వారం టెహ్రాన్ తో అణు చర్చలు జరుపుతామని.. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్ తో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో.. ఇరాన్ పై అమెరికా దాడుల వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి త్వరగా ముగింపు పడిందని ఆయన అన్నారు.
పైగా... తన నిర్ణయంతో అందరికీ విజయం లభించిందని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను సడలించే అవకాశాలున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం ఇరాన్ పునర్నిర్మాణానికి ఆర్థిక వనరులు కావాలని.. ఈ సమయంలో ఆ దేశం కోలుకునేలా మద్దతు ఇవ్వడం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్ నష్టంపై సీఐఏ క్లారిటీ!:
ఇరాన్ లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడివల్ల పెద్ద నష్టం ఏమీ జరగలేదని ఒకరంటే.. రెండు మూడు నెలల్లో ఇరాన్ మళ్లీ పని మొదలుపెడుతుందని మరొకరు అన్నారు. అయితే... ఇప్పట్లో ఇరాన్ తేరుకోలేదని అమెరికా, ఇజ్రాయెల్ లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీ.ఐ.ఏ) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా... ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమం తీవ్రంగా దెబ్బతిన్నట్లు నమ్మకమైన ఇంటెలిజెన్స్ విభాగం ఒకటి వెల్లడించిందని.. మరిన్ని వివరాలను తాము సేకరించి పాలకులకు అందిస్తామని.. అమెరికా ప్రజలకూ తెలియజేస్తామని.. జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశం కావడంతో పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తామని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
మరోసారి క్లారిటీ ఇచ్చిన ట్రంప్:
ఇదే విషయంపై ట్రంప్ నాటో సదస్సు వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ మనుషులు అక్కడికి వెళ్లి పరిశీలించి పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపారని.. ఇప్పుడు ఇజ్రాయెల్ దానిపై ఓ నివేదిక తయారుచేస్తోందని.. పూర్తిగా ధ్వంసమైందని వారు చెప్పడంతోపాటు.. తాను కూడా నమ్ముతున్నానని.. అక్కడ (ఇరాన్ అణు కేంద్రాల్లో) ఏదీ మిగిలే అవకాశం లేదని ట్రంప్ పేర్కొన్నారు.