ఇజ్రాయెల్-అమెరికా వ‌ర్సెస్ ఇరాన్.. ముదిరితే మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే!

అస‌లే అమెరికా.. ఆపై డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడు. ఇంకా ఆ దేశం ఏం చేసినా చెల్లుతోంది. నాలుగేళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధంలో మునిపోయిన ర‌ష్యాకు ఇప్ప‌టికే త‌ల బొప్పి క‌ట్టింది.;

Update: 2026-03-02 09:39 GMT

ప‌శ్చిమాసియా... పేరులో ప‌శ్చిమం ఉన్నా.. వాస్త‌వంలో ‘క‌చ్చి’మాసియా. ఒక‌వైపు ఇజ్రాయెల్ మ‌రోవైపు ఇరాన్ తో పాటు అర‌బ్ దేశాలు, ఒక‌వైపు మిలిటెంట్ సంస్థ‌లు.. మ‌రొక‌వైపు అస్ధిర‌మైన ప్ర‌భుత్వాలు..! ఒక‌వైపు అమెరికా ప్ర‌భావంతో దూకుడుగా దాడిచేసే ఇజ్రాయెల్.. మ‌రొక‌వైపు అమెరికా పేరు చెబితేనే నిప్పులు క‌క్కే దేశాలు..! నిత్యం క‌క్ష‌లు. ప‌గ‌లు-ప్ర‌తీకారాలు...! ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లుగా ఇజ్రాయెల్-హ‌మాస్ యుద్ధం సాగుతోంది. ఎన్ని శాంతి ఒప్పందాలు జ‌రిగినా అవి కేవ‌లం కాగితాల మీద‌నే అన్న‌ట్లుంది. ఇలాంటి స‌మ‌యంలో.. ఇరాన్ మీద దాడికి దిగాయి ఇజ్రాయెల్-అమెరికా. చాలా తెలివిగా, ఇజ్రాయెల్ చేతుల‌తో ఇరాన్ క‌ళ్లు పొడిచింది. ఎలాగూ ఇజ్రాయెల్ అంటే ముస్లి స‌మాజంలో వ్య‌తిరేక ఉంది కాబ‌ట్టి త‌న ప‌ని (ఖ‌మేనీ హ‌త్య‌)ని ఆ దేశంతోనే చేయించింది. అయితే, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చెప్పిన‌ట్లు... ఈ యుద్ధం నాలుగు లేదు ఐదు వారాలు జ‌రిగినా అది పెద్ద విధ్వంస‌మే. మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే..!

ట్రంప్ అమెరికాకు అడ్డుందా?

అస‌లే అమెరికా.. ఆపై డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడు. ఇంకా ఆ దేశం ఏం చేసినా చెల్లుతోంది. నాలుగేళ్లుగా ఉక్రెయిన్ తో యుద్ధంలో మునిపోయిన ర‌ష్యాకు ఇప్ప‌టికే త‌ల బొప్పి క‌ట్టింది. అమెరికాను ప్ర‌తిఘ‌టించాలంటే.. అందులో ర‌ష్యా ఉండాలి. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఇక చైనా అంటే త‌న స్వార్థం చూసుకుంటుంది. పొరుగు దేశాల ఆక్ర‌మ‌ణ‌ల‌కు దిగుతుంది కానీ.. త‌న మిత్ర దేశాలు యుద్ధ సంక్షోభంలో ఉంటే మాత్రం క‌ల్పించుకోదు. అందుకే ట్రంప్ దూకుడుకు అడ్డు ఏమిటి? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

ఇది అక్క‌డితో ఆగ‌దు..

ఇజ్రాయెల్-అమెరికాలు ఇరాన్ ను ఇంత‌టితో వ‌దులుతాయి అని భావించ‌లేం. పాకిస్థాన్ త‌ర్వాత‌ ప్ర‌పంచంలో అణ్వ‌స్త్ర దేశం ఉన్న రెండో ఇస్లామిక్ దేశం కావాల‌న్న ఇరాన్ ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌స్తుతానికి ధ్వంసం చేసినా, ఇంకా ఇరాన్ లో తమ కీలుబొమ్మ ప్ర‌భుత్వాన్ని నెల‌కొల్పేదాక అమెరికా శాంతించ‌దు. ఇజ్రాయెల్ కూడా.. హ‌మాస్, హెజ్బొల్లా, హూతీ త‌దిత‌ర మిలిటెంట్ సంస్థ‌ల‌కు ఇరాన్ సాయం ఆగిపోతుంద‌ని భావించాకే యుద్ధం ఆపుతుంది.

అలాగైతేనే ముప్పే..!

ఇరాన్ కు మ‌ద్ద‌తుగా ముస్లిం దేశాలు, ర‌ష్యా, చైనా, ఉత్త‌ర కొరియా రంగంలోకి దిగితే మాత్రం మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే. అటువైపు అమెరికా, ఇజ్రాయెల్ దానికి మ‌ద్ద‌తు ప‌లికే దేశాలు ఇటువైపు ఇరాన్, ర‌ష్యా, ఉత్త‌ర‌కొరియా, చైనాలు..! చైనా పూర్తిగా క‌ల్పించుకోకున్నా, ఇరాన్ కు ప‌రోక్షంగా అయినా మ‌ద్ద‌తు ఇస్తుంద‌నేది విదేశాంగ నిపుణుల మాట‌. ర‌ష్యా అయితే నేరుగానే క‌ల్పించుకోవ‌చ్చు. అమెరికా పాల‌కుల‌కు ఎప్ప‌టినుంచో ఉత్త‌ర కొరియా పాల‌కుడు కిమ్ పై తీవ్ర విద్వేషం ఉంది. ఈ ప‌రిణామాలు మున్ముందు త‌మ‌వైపు మ‌ళ్లితే ఇబ్బందిక‌రం అని భావించి ఉత్త‌ర కొరియా క‌ల్పించుకుంటే.. అది మూడో ప్ర‌పంచ యుద్ధంగా మారినా ఆశ్చ‌ర్యం లేదు.

Tags:    

Similar News