యుద్ధం పేరుతో భారీ నష్టం.. తగ్గేదేలే అంటున్న అమెరికా!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల ధాటికి అమెరికా రక్షణ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా ఇబ్బందుల పాలవుతోంది.;

Update: 2026-03-23 10:30 GMT

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల ధాటికి అమెరికా రక్షణ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా ఇబ్బందుల పాలవుతోంది. యుద్ధం మొదలైన కేవలం రెండు వారాల్లోనే అగ్రరాజ్యమైన అమెరికాకి సుమారుగా 7, 525 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యుద్ధంలో అమెరికాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే అమెరికాకి తగిలిన ఆ అతిపెద్ద దెబ్బ బూర్డాన్ లోని అత్యంత శక్తివంతమైన థార్ రాడార్ వ్యవస్థ ధ్వంసం కావడమే.

శత్రు దేశాల క్షిపణులను గాలిలోనే గుర్తించి అడ్డుకునే ఈ అత్యాధునిక వ్యవస్థను ఇరాన్ డ్రోన్లు చాలా తెలివిగా ఛేదించాయి. ఈ ఒక్క రాడార్ వ్యవస్థ నష్టమే సుమారుగా 4వేల కోట్ల రూపాయలపై మాటే.. అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే ఈ డిఫెన్స్ షీల్డ్ ను ఇరాన్ క్షిపణులు చిత్తు చేయడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవైపు యుద్ధక్షేత్రంలో ఆయుధాలు, ఆస్తులు ధ్వంసం అవుతుంటే.. మరొకవైపు దౌత్యపరంగా కూడా అమెరికాకు ఒంటరితనం ఎదురవుతోంది అని చెప్పాలి.

అటు తటస్థ దేశంగా గుర్తింపు పొందిన ఐరోపా దేశం స్విట్జర్లాండ్ కూడా అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇరాన్ తో యుద్ధం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాకు ఎటువంటి ఆయుధాలను ఎగుమతి చేయబోము అని స్పష్టం చేసింది. యుద్ధంలో పాల్గొంటున్న ఏ దేశానికైనా సరే ఆయుధాల ఎగుమతి లైసెన్సులను జారీ చేయలేమని స్విట్జర్లాండ్ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఇలా యుద్ధ నియమాలను సాకుగా చూపిస్తూ ఆయుధా ఎగుమతిని నిషేధించడం అటు అమెరికా రక్షణ వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారిందనే చెప్పాలి.. ఇప్పటికే ఆయుధ నిల్వలు కరిగిపోతున్న తరుణంలో.. మరొకవైపు కీలక మిత్ర దేశాల నుంచి ఎటువంటి సహాయం లభించకపోవడంతో అమెరికా ఇప్పుడు ఆత్మరక్షణ కోసం పాకు లాడుతోంది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇక అలా అమెరికా భారీ నష్టంలో మునిగిపోతోంది అంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటుంటే.. ఇక్కడ అమెరికా మాత్రం తగ్గేదేలే అన్నట్టు కామెంట్లు చేస్తోంది. ఇరాన్ పై యుద్ధాన్ని కొనసాగించడానికి అమెరికా వద్ద కావలసిన అంత డబ్బు ఉందని.. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ట్రంప్ తన అధికార పరిధిలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని వారు సమర్థించారు. ముఖ్యంగా యుద్ధం కోసం తాజాగా కేటాయిస్తున్న ఈ నిధులు కేవలం ఎక్స్ట్రా గా ఉన్నవి మాత్రమేనని.. అసలు పోరాటానికి సరిపడ డబ్బు ఇప్పటికే దాచి ఉంచామని తెలిపారు. ఇక ఇరాన్ విషయంలో ప్రస్తుతానికి అన్ని ఆప్షన్లు రెడీగా ఉన్నాయని.. ఇక ఎంత నష్టం వచ్చినా తగ్గేదెలే అంటూ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఈ విషయాలు ఇప్పుడు మళ్లీ సరికొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మరి దీనిపై ఇరాన్ కూడా స్పందిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News