యుద్ధం మధ్యలో భారత్ కు ఇరాన్ అధ్యక్షుడు.. కీలక పరిణామం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేచింది. అమెరికా, ఇజ్రాయెల్ తో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్ నైతిక మద్దతు కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేచింది. అమెరికా, ఇజ్రాయెల్ తో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్ నైతిక మద్దతు కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తోంది. రష్యా, చైనా వంటి దేశాలు ఇరాన్ కు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తుండగా, మన దేశం తటస్థ వైఖరి అనుసరిస్తోంది. ఇదే సమయంలో యుద్ధాన్ని ముగించాలని అటు అమెరికాను, ఇటు ఇరాన్ ను భారత్ కోరుతుంది. అయినప్పటికీ ఇరు దేశాలు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు శాంతి స్థాపనకు ఆ రెండు దేశాల మధ్య దాయాది దేశం పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మనదేశంలో పర్యటనకు వస్తున్నారు.
యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే, అమెరికాకు దీటుగా జవాబు చెబుతున్న ఇరాన్ అంతర్జాతీయంగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇటువంటి సమయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారత పర్యటన మరింత ఆకర్షణీయంగా మారిందని చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు భారత్ రానున్నారని చెబుతున్నారు.
భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు స్వయంగా పాల్గొనడం వెనుక బలమైన వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దడంలో శాంతి స్థాపనలో భారత్ పోషించగల దౌత్యపరమైన పాత్రపై ఇరాన్ గట్టి నమ్మకంతో ఉందని అంటున్నారు. అమెరికాతో భారత్ కు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా, ఈ చర్చలు కీలకం కానున్నాయని భావిస్తున్నారు.
ఈ విడత బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా, "బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ" అనే ప్రధానాంశంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, అమెరికా-ఇజ్రాయెల్ వైఖరిని ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. సంక్షోభ నివారణ కోసం భారత్ తీసుకునే ఏ రకమైన నిర్మాణాత్మక శాంతి చొరవనైనా తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తామని ఇరాన్ విదేశాంగ వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి.
గత జూన్‌లో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల భేటీకి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హాజరైన నేపథ్యంలో, ఇప్పుడు దేశాధినేత స్వయంగా వస్తుండటం ఈ దౌత్య బంధం మరింత బలపడటానికి సంకేతంగా కనిపిస్తోందని అంటున్నారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే దిశగా ఈ పర్యటన ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్ తీసుకునే నిర్ణయాలు, చర్చల ఫలితాలు రానున్న రోజుల్లో ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ఆశిస్తున్నారు.