జగన్ కి క్రేజ్ అంత ఎందుకు ?

అయితే అదే ఏడాది సెప్టెంబర్ లో తండ్రి ఆకస్మిక మృతితోనే జగన్ లోని నాయకుడు బయటకు వచ్చారు. సవాళ్ళను వరసగా ఎదుర్కొంటూ అదే క్రమంలో వైఎస్సార్ ఇమేజ్ ని తనకు బలంగా మార్చుకుని ఆ మీదట పాదయాత్రలతో జనాలకు చేరువ అయి తనకంటూ సొంతంగా పొలిటికల్ ఇమేజ్ ని జగన్ క్రియేట్ చేసుకున్నారు.

Update: 2026-08-14 16:46 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ గా సొంతంగా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. తండ్రి వైఎస్సార్ చాటు బిడ్డగా 2009లో తొలిసారి కడప లోక్ సభ సీటు నుంచి ఎంపీగా పోటీ చేసే నాటికి జగన్ ఎవరో తెలియదు. మా వాడు రాజకీయాల్లోకి వస్తున్నాడు ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి హోదాలో కడప ఎన్నికల ప్రచారంలో అప్పట్లో వైఎస్సార్ జగన్ గురించి మాట్లాడిన మాటలు వీడియోలు చూస్తే జగన్ రాజకీయంగా తండ్రి నీడలో ఎంతగా ఉన్నారో అర్థం అవుతుంది. అయితే అదే ఏడాది సెప్టెంబర్ లో తండ్రి ఆకస్మిక మృతితోనే జగన్ లోని నాయకుడు బయటకు వచ్చారు. సవాళ్ళను వరసగా ఎదుర్కొంటూ అదే క్రమంలో వైఎస్సార్ ఇమేజ్ ని తనకు బలంగా మార్చుకుని ఆ మీదట పాదయాత్రలతో జనాలకు చేరువ అయి తనకంటూ సొంతంగా పొలిటికల్ ఇమేజ్ ని జగన్ క్రియేట్ చేసుకున్నారు.

ప్రజా నేతగానే :

ఇక జగన్ ఓటమికి ఆయనకు జనంలో వస్తున్న ఆదరణకు ఎక్కడా పొంతన లేదు. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఇక ఈ పార్టీ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. అయితే 40 శాతం ఓటు బ్యాంక్ కూడా వైసీపీ వెన్నంటే ఉండడం జగన్ రాజకీయ గ్లామర్ పార్టీకి పెట్టని కోటగా మారాయి. ఇక బలమైన కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నా జగన్ ఎక్కడికి వెళ్ళిన జనాలు అయితే తండోపతండాలుగా రావడం ఆయన జనాదరణకు అద్దం పడుతోంది.

పది శాతం ఓటు షేర్ తో :

ఇక ఏపీలో అధికారం ఎపుడూ జస్ట్ పది శాతం ఒటు షేర్ అటూ ఇటుగా మారుతుంది. 2014 నుంచి ఇదే తీరున ఉంది. ఓడిన పార్టీ టీడీపీ అయినా వైసీపీ అయినా 40 శాతం ఓటు షేర్ మాత్రం వారికి ఉంటోంది. ఇక అయిదేళ్ల కాలంలో ఆ పది శాతం ఓటు షేర్ ని తమ వైపునకు తిప్పుకుంటే పోయిన అధికారం తిరిగి దక్కుతోంది. 2019లో వైసీపీకి అదే జరిగింది. 2024లో టీడీపీ కూటమికి అదే అయింది. అందుకే 2029 ఎన్నికల మీద ధీమా వ్యక్తం చేస్తూ వైసీపీ జోరు చేస్తోంది. పది శాతం ఓటు షేర్ కోసమే జనం వద్దకు జగన్ వివిధ రూపాలలో పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ఉన్న నలభైకి పదిని కలపడం అయితే అయిదేళ్ళ కాలంలో కష్టం కాదని ఏపీ గత రాజకీయ చరిత్ర నిరూపించింది. దాంతోనే వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

బ్రహ్మరథం పడుతున్నారు :

ఇక ఎన్నికలు గెలుపు ఓటములు పక్కన పెడితే జగన్ ప్రస్తుతం ఏపీలో ఎక్కడికి వెళ్ళినా జనాలు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్క సీటూ రాని ఉత్తరాంధ్రా గోదావరి జిల్లాలు కోస్తా జిల్లాలలో కూడా జగన్ కి ఈ మాదిరి ఆదరణ దక్కడం అయితే రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా నంద్యాల జిల్లా పర్యటనలో జగన్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విరూపాక్ష జైలులో ఉండడంతో ములాఖత్ ద్వారా పరామర్శినారు. అయితే జగన్ ఈ పరామర్శకు వచ్చినపుడు ఆయన కర్నూల్ ఎయిర్ పోర్టు నుంచి జైలు దాకా ఉనన్ 38 కిలోమీటర్ల దూరానికి ఏకంగా అయిదు గంటలు పట్టింది అంటే ఎంత మంది జనాలు జగన్ కి స్వాగతం పలికి ఉంటారో అర్ధం చేసుకోవాల్సిందే అని అంటున్నారు.

స్వచ్ఛందంగానే :

ఇక జగన్ కి వస్తున్న జనాల విషయంలో టీడీపీ అయితే విమర్శలు చేస్తోంది. అంతా తోలుకు వచ్చిన జనాలే తప్ప స్వచ్ఛందంగా వచ్చింది ఎవరు అని కామెంట్స్ చేస్తోంది. అయితే పార్టీ అన్నాక జనాలను తరలించడం మామూలే అయినా పోటెత్తేలా జనాలు వస్తున్నారు అంటే అందులో వాలంటరీగా వచ్చిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారనే విశ్లేషణలు వాస్తవంగా ఉన్నాయి. ఇక్కడ మరో రీజన్ కూడా ఉంది. వైసీపీకి చెందిన నియోజకవర్గం ఇంచార్జిలు అయితే డబ్బులు ఖర్చు చేయడం లేదు, అలాంటివి వారు జనాలను పెద్ద ఎత్తున తోలుకుని వస్తారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. అలా అయినా జనాలు వస్తున్నారు అంటే జగన్ కి ఉన్న క్రేజ్ అది అని అంటున్నారు. కేవలం ఒక్క ప్రాంతం అని కాదు రాష్ట్రంలో ఏ రీజియన్ కి జగన్ వెళ్ళినా ఇదే మాదిరిగా జనాలు తరలి రావడం జరుగుతోంది అని గుర్తు చేస్తున్నారు.

ఎందుకిలా జరుగుతోంది :

జగన్ ఉత్తరాంధ్రా టూర్ కి ఈ మధ్య వచ్చారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి శ్రీకాకుళం దాకా ఏకంగా వంద కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో వెళ్ళారు. దానికి ఏకంగా ఆరేడు గంటలు పట్టింది. దారి పొడవునా జనాల జాతర కనిపించింది. అలాగే గోదావరి జిల్లాల పర్యటనకు జగన్ వెళ్ళినపుడు అది భీమవరం ఆక్వా రైతుల సమస్య అయినా తాజాగా తూర్పు గోదావరి జిల్లా పొగాకు రైతుల ఇష్యూ అయినా జగన్ కి జనాలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం కనిపిస్తోంది. ఇవన్నీ చూసినపుడు ఈ ప్రాంతాలలో ఒక్క సీటూ గెలుచుకోని వైసీపీకి ఇంతలా జనాలు తండోపతండాలుగా రావడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

మాస్ పల్స్ పట్టుకున్నారా :

జగన్ రాజకీయ జీవితం పదిహేడేళ్ళు కావచ్చు. కానీ ఆయన నిరంతరం జనంలో ఉంటూ మాస్ పల్స్ పట్టుకున్నారు అనిపిస్తుంది. అందుకే ఆయన జనం కోణం నుంచే మాట్లాడుతూంటారు. ఇక జగన్ చెప్పిన మాటలనే ప్రభుత్వం కూడా ఆలస్యంగా అయినా సరే అనాల్సి వస్తోంది అని గుర్తు చేస్తున్నారు. ఆ మధ్యన జగన్ మావిగన్ అంటే అంతా నవ్వుకున్నారు. ఏప్రిల్ ఫూల్ లాంటి జోక్ అన్నారు. అయితే ఇపుడు చంద్రబాబు కూడా గుంటూరు విజయవాడ అన్నీ కలుపుకునే రాజధాని అని చెప్పడం బట్టి చూస్తూంటే జగన్ ముందు చూపుతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అంతే కాదు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను ఆయన బాగానే ఒడిసి పట్టుకున్నారని అంటున్నారు. అంతే కాదు మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ జగన్ తన ఎన్నికల మేనిఫేస్టోలో పెడతాను అని చాలెంజ్ చేసిన తీరుతోనే ఏపీలో చాలా మంది ఆలోచనలు కూడా మారాయని అంటున్నారు

కొత్త ఆశలను పెంచుతోంది :

దేనికి భయపడని నైజం, తాను అన్న మాటకు కట్టుబడి ఉంటారన్న పేరు, బలమైన ప్రజా నేతగా ఇమేజ్ ఇవన్నీ జగన్ ని ముందుకు నడిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఏపీ కాదు దేశంలో ఎక్కడ చూసినా పార్టీ గుర్తుని చూసే ఓట్లు వేస్తున్నారు. వన్ మ్యాన్ షోగానే పార్టీలు ఉన్నాయి. అందుకే ఎంతటి సీనియర్ నేత అయినా బీ ఫారం పార్టీ ఇస్తేనే గెలుస్తున్నారు. అందుకే వైసీపీలో జగన్ ని నమ్ముకుని ఎంత పెద్ద నేత అయినా కొనసాగుతున్నారు. అలా పార్టీ జనం జగన్ వైపు చూసూంటే సగటు ప్రజానీకంలో ఆదరణ పెరగడం కూడా వైసీపీలో కొత్త ఆశలను పెంచుతోంది. మరి జగన్ కోసం తరలివచ్చిన జన ప్రభంజనం ఓటుగా మారుతుందా లేదా అన్నది ముందు తెలుస్తుంది కానీ ఇప్పటికి అయితే ఏపీలో స్ట్రాంగ్ మాస్ లీడర్ ఎవరు అంటే జగన్ అనే అంటున్నారు. 11 సీట్లతో కునారిల్లిన వైసీపీకి ఇపుడు అదే అసలైన ఆక్సిజన్ అంటే అందులోనే నిజం ఉంది.

Tags:    

Similar News