అమెరికా కన్ను ఎర్రబడింది.. 'మేడిన్ చైనా' స్టిక్కర్ పీకేసి 'మేకిన్ ఇండియా' వేస్తే ట్రంప్ తాత ఊరుకుంటాడా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారికి టారిఫ్‌లు అంటే ఎంతిష్టమో మనందరికీ తెలిసిందే. చైనా వస్తువులపై భారీగా పన్నులు వేసి.. ఒక పెద్ద వాణిజ్య గోడ కట్టేశామని మురిసిపోతున్న అమెరికా వైట్‌హౌస్‌కి సడెన్‌గా ఓ డౌట్ వచ్చింది.

Update: 2026-08-14 16:45 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారికి టారిఫ్‌లు అంటే ఎంతిష్టమో మనందరికీ తెలిసిందే. చైనా వస్తువులపై భారీగా పన్నులు వేసి.. ఒక పెద్ద వాణిజ్య గోడ కట్టేశామని మురిసిపోతున్న అమెరికా వైట్‌హౌస్‌కి సడెన్‌గా ఓ డౌట్ వచ్చింది. "అదేంటి చైనా నుంచి దిగుమతులు తగ్గాయంటున్నాం.. కానీ ఈ పంపులు, కంప్రెషర్లు అన్నీ అచ్చం చైనా వాటిలాగే ఉన్నాయేంటి?" అని తీరా ఆరా తీస్తే తెలిసిన అసలు నిజం చూసి అమెరికా అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. మనవాళ్ల 'జుగాడ్' తెలివితేటల గురించి అమెరికాకు ఇప్పుడిప్పుడే మెల్లగా అర్థమవుతున్నట్టుంది. దీనికి వైట్‌హౌస్‌ వారు ముద్దుగా ‘ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్’ అని ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ పేరు కూడా పెట్టేశారు.

వయా ఇతర దేశాలు.. డెస్టినేషన్ అమెరికా

చైనా వస్తువులపై అమెరికా టారిఫ్‌లు వేస్తే ఆ వస్తువులు నేరుగా కాకుండా ఇతర దేశాల ద్వారా పరోక్షంగా అమెరికాకు చేరుకుంటున్నాయట. ఈ రూట్‌లో మన అఖండ భారతావని కూడా ఉందని అమెరికా ఓ ‘వాచ్‌లిస్ట్’ తయారు చేసి అందులో మన పేరు కూడా చేర్చింది. మనతో పాటు కెనడా, మెక్సికో, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్.. ఇలా మరో 40 దేశాలు ఈ "స్టిక్కర్ మార్పిడి" వ్యాపారంలో ఉన్నాయని అమెరికా అనుమానం.

ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో నేతృత్వంలో వచ్చిన నివేదిక ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులోని కొందరు ఘనులు చైనా నుంచి సరుకు దిగుమతి చేసుకుని.. పాత స్టిక్కర్ పీకేసి, కొత్త లేబుల్ వేసి, ఇన్వాయిస్‌లు మార్చేసి "ఇదిగో మా స్వదేశీ ఉత్పత్తి" అంటూ అమెరికాకు ఎగుమతి చేస్తున్నారట. ఏటా ఇలా సుమారు 34.2 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 303 బిలియన్ డాలర్ల విలువైన సరుకు మాయమవుతోందని.. దీనివల్ల తమకు ఏటా 19-26 బిలియన్ డాలర్ల టారిఫ్ ఆదాయం గండి పడుతోందని అమెరికా గగ్గోలు పెడుతోంది.

రంగంలోకి ఏఐ 'డిటెక్టివ్ బోర్డర్'

మనుషులు పాత స్టిక్కర్ల ఆనవాళ్ళను కనిపెట్టలేకపోతున్నారని ఏకంగా ‘డిటెక్టివ్‌ బోర్డర్‌’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ రంగంలోకి దించుతోంది. మనవాళ్ల టాలెంట్ ముందు ఈ అమెరికా ఏఐ ఎంతవరకు నెగ్గుకొస్తుందో చూడాలి. ఈ టెక్నాలజీ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? అందులో వాడిన స్క్రూలు ఏ దేశానివి? కంప్రెషర్ అరుపు చైనీస్ భాషలో ఉందా లేక లోకల్ భాషలో ఉందా? అని అల్గారిథమ్స్ ద్వారా అణువణువూ స్కాన్ చేస్తుందట.

ఒకవేళ దొరికిపోయారో ఇక అంతే సంగతులు. వెనకటి తారీఖులతో సహా పన్నులు వడ్డిస్తారు.. భారీ జరిమానాలు వేస్తారు.. ఆ వస్తువుల ఛాయలు కూడా అమెరికా బోర్డర్ దరిదాపుల్లోకి రాకుండా నిషేధం విధిస్తారు.

మనకు ‘టియర్‌-1’ ప్రమోషన్!

ఈ వ్యవహారంలో మన దేశానికి అమెరికా ఏకంగా ‘టియర్‌-1’ హోదా ఇచ్చేసింది. అంటే ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ అనుమానితుల జాబితాలో మనల్ని మొదటి వరుసలో కూర్చోబెట్టిందన్నమాట.. అద్భుతం కదూ.. అయితే దేశం మొత్తం ఇలాగే చేస్తోందని నిర్ధారించకపోయినా ఈ "స్మార్ట్ వ్యాపారం" వల్ల అసలైన ఎగుమతిదారులకు ఇక ముందు ముందు కష్టాలు తప్పవు. చైనా నుంచి వచ్చే ముడిసరుకుతో ఇక్కడ వస్తువులు తయారు చేసి పంపినా కూడా వాటి మూలాలను అమెరికా కస్టమ్స్ అధికారులు భూతద్దం పెట్టి వెతుకుతారు.

మొత్తానికి చైనా ఎగుమతులను ఆపాలని అమెరికా వేసిన ఎత్తుగడ, ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ లో ఒక పెద్ద ‘హైడ్ అండ్ సీక్’ ఆటకు తెరతీసింది. టారిఫ్‌లు తప్పించుకునే ఎత్తుగడలు ఒకవైపు.. వాళ్లని పట్టుకునేందుకు ఏఐ డిటెక్టివ్‌లు మరోవైపు. ఏదేమైనా చైనా వస్తువులకు మన దగ్గర రీప్యాకింగ్ చేసి అమెరికాకు పంపే "క్రియేటివిటీ"పై కాస్త నిఘా పెరగనుందన్నమాట. జాగ్రత్త సుమీ..

Tags:    

Similar News