కోమటిరెడ్డి కుండబద్ధలు కొట్టేశారా ?
ఆ ఎమ్మెల్యే వీలైనప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు. పార్టీకి సంబంధించిన విషయాలను ఆయన మీడియా వేదికగా మాట్లాడుతూ తన ఆవేదన ఆందోళన అలా తెలియచేస్తూంటారు. ఆయనే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఆ ఎమ్మెల్యే వీలైనప్పుడల్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు. పార్టీకి సంబంధించిన విషయాలను ఆయన మీడియా వేదికగా మాట్లాడుతూ తన ఆవేదన ఆందోళన అలా తెలియచేస్తూంటారు. ఆయనే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాలో బలమైన ఈ నాయకుడు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల విపక్షాల కంటే ఎక్కువగానే మాట్లాడుతూంటారు తాను రాహుల్ గాంధీకి వీర విధేయుడిని పార్టీకి కట్టుబడి ఉన్నాను అని ఒక వైపు చెబుతూనే మరో వైపు రేవంత్ రెడ్డి మీద పరోక్ష విమర్శలు ఘాటుగా చేస్తూంటారు. లేటెస్ట్ గా రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ తరహా హట్ కామెంట్స్ అయితే కాంగ్రెస్ పార్టీలోనే కాదు తెలంగాణా రాజకీయాల్లోనూ మంట పుట్టించాయి. సోషల్ మీడియాలోనూ అవి వైరల్ కావడంతో కాంగ్రెస్ పెద్దలు కూడా సీరియస్ గానే దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ రాజ గోపాల్ రెడ్డి ఏమన్నారు అంటే తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర నేతల చెప్పుచేతల్లో ఉండకూడదని హాట్ కామెంట్స్ చేశారు.
అది నిజమేనా :
ఏకంగా తన సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ను తప్పుపట్టలేదని అంటూనే ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర వారి చెప్పు చేతలలో పెట్టొద్దు అంటూ సూటిగానే గుచ్చేశారు. మరి ఆయన ఎవరి మీద అన్నారు ఈ మాటలు అన్నది పక్కన పెడితే ఇంకా చాలానే అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండొద్దని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో అసలైన కాంగ్రెస్ నేతలను అణచి వేసే చర్యలు జరుగుతున్నాయని ఆగ్రహ వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల ఆధిపత్యం పెరిగి, పాత కాంగ్రెస్ శ్రేణులు నిజమైన కార్యకర్తలు అణచివేతకు గురవుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కష్టపడే వారికి కాపాడాలి :
అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలకు ఆయన కీలక సూచన చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారిని కాపాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఒక విధనగ భారీ ఆరోపణలే చేశారు. అంతే కాదు దీనివల్ల దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న అసలు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోందని కూడా ఎత్తి చూపించారు. పాత శ్రేణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉన్నది ఉన్నట్లుగా కక్కేశారా :
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నది ఉన్నట్లుగా వెళ్ళగక్కేశారు అని అంటున్నారు. అయితే అది ఆయన ఒక్కడి మాటగా చూడాల్సినది లేదని తెలంగాణా కాంగ్రెస్ లో చాలా మంది ఇదే భావనతో ఉన్నారని అంటున్నారు. వారందరి మాటగా రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో తరచూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం వాటిని మించి ఉన్నాయని అంటున్నారు. పైగా సీమాంధ్ర నేతల చెప్పు చేతలలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన తీవ్రమైన విమర్శలే చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వారిని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉందని అంటున్నారు.
చర్యలు తప్పవంటూ :
అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ తరహా కామెంట్స్ కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంతే ఘాటుగా స్పందించారు. రాజ గోపాల్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అన్నారు. అయితే ఎవరికైనా పార్టీయే ఫస్ట్ అన్నారు. పార్టీ పరంగా అంతా క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని అన్నారు. అలా కాకుండా పార్టీలో ఎవరైనా హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీలో జరిగే అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడకుండా సంయమనం పాటించాలని నాయకులకు సూచించారు. మొత్తం మీద చూస్తూంటే రాజగోపాల్ తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశారు అని అంటున్నారు.