లోకేశ్ ‘స్మార్ట్’ ఐడియాకు నీతి అయోగ్ ప్రశంసలు! ఇంట్రెస్టింగ్
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా, మానవవనుల మంత్రి నారా లోకేశ్ ను కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ అభినందించింది.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా, మానవవనుల మంత్రి నారా లోకేశ్ ను కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ అభినందించింది. లోకేశ్ స్మార్టు ఆలోచనతో కడప జిల్లాలో తీసుకువచ్చిన స్మార్ట్ కిచెన్ నమూనా బాగుందని కితాబునిచ్చింది. ప్రస్తుతం కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ఆలోచనను ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ప్రోత్సాహమిచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో మధ్యాహ్న భోజన పథకంలో తీసుకువచ్చిన వినూత్న విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై ప్రభుత్వ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచడం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో స్మార్టు కిచెన్ లను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారని చెబుతున్నారు. ముందుగా రాష్ట్రంలో ఒక జిల్లాలో అమలు చేసిన తర్వాత మంచిచెడ్డలను గుర్తించి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకురావాలని మంత్రి లోకేశ్ భావించారని చెబుతున్నారు. దీంతో కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా స్మార్టు కిచెన్ ఏర్పాటు చేశారు.
దేశంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్‌గా రూపొందించిన మొదటి స్మార్ట్ కిచెన్‌ను గత ఏడాది జూలైలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ జిల్లాలోని సీకే దిన్నె హైస్కూల్‌లో అధునాతన హంగులతో కూడిన ప్రధాన స్మార్ట్ కిచెన్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. దీనికి అనుబంధంగా మరికొన్ని కిచెన్‌లను ఏర్పాటు చేశారు. కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో తొలి విడతగా కొన్ని కేంద్రాలను ప్రారంభించి సుమారు 136 పాఠశాలల్లోని 10 వేలకు పైగా విద్యార్థులకు భోజనాన్ని అందించడం ప్రారంభించారు.
సాంకేతికత, సమర్థత కలయికతో కడపలో అమలు చేసిన ఈ స్మార్ట్ కిచెన్ విధానంలో ఆధునిక మౌలిక వసతులు, అధునాతన సాంకేతికతను అనుసంధానించారు. దీంతో విద్యార్థులకు న్యాయమైన భోజనంతోపాటు పౌష్టికాహారం లభిస్తుందని నీతి అయోగ్ గుర్తించింది. సాంకేతికతను జోడించి ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహార పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తున్న తీరును కొనియాడింది. మానవ ప్రమేయం పెద్దగా లేకుండానే పెద్ద ఎత్తున యంత్రాల ద్వారా అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారీ చేయడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. కఠినమైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అభిప్రాయపడింది.
ఇక ఈ విధానంలో భోజనం సరఫరాను రియల్ టైమ్ లో ట్రాక్ చేస్తారు. వండిన ఆహారాన్ని పాఠశాలలకు చేరవేసే వాహనాలకు జీపీఎస్ అమర్చి, ఆహార సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భోజనం నాణ్యతపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇదే సమయంలో స్మార్ట్ కిచెన్ల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు భాగస్వామ్యం కల్పించారు.
కాగా, నీతి ఆయోగ్ నుంచి లభించిన ప్రశంసలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి బిడ్డకు నాణ్యమైన, పౌష్టిక ఆహారం అందించడం కనీస బాధ్యతగా పేర్కొన్నారు. కడపలో విజయవంతమైన ఈ 'స్మార్ట్ కిచెన్' మోడల్‌ను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి గుర్తింపుతో విద్యాశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిలో మరింత ఉత్సాహం వచ్చిందని వ్యాఖ్యానించారు.