ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా.. ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు
అయితే ప్రతిపక్షం మాత్రం ఐపీఎస్ ఉద్యోగానికి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేయడం వెనుక ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తోంది.;

ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వ వేధింపు విధానాలకు వత్తూసు పలకలేకే ఆయన రాజీనామా చేశారంటూ ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. తన రాజీనామాకు కారణాలను వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్ గా ప్రస్తుతం పనిచేస్తున్న సిద్ధార్థ్ కౌశల్ నెల రోజుల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంగా తాజాగా వెలుగు చూడటంతో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించింది. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారంటూ వైసీపీ అనుబంధ సాక్షి పత్రికలో కథనం వెలువరించింది.
అయితే తన రాజీనామాకు వ్యక్తిగత అంశాలే కారణమంటూ ఐపీఎస్ అధికారి సిద్దార్థ్ కౌశల్ బుధవారం స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల తాను రాజీనామా చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇన్నేళ్లు ఏపీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు అన్నివిధాల సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
అయితే ప్రతిపక్షం మాత్రం ఐపీఎస్ ఉద్యోగానికి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేయడం వెనుక ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ వేధింపులు, అవమానాలు ఎదుర్కోలేక విసిగిపోయిన సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారంటూ సాక్షి పత్రిక కథనం ప్రచురించింది. సిద్ధార్థ్ కౌశల్ గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు. ఐపీఎస్ కు వీఆర్ఎస్ సమర్పించిన అనంతరం ఆయన ఢిల్లీలో ఓ కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల సమయంలో ఈసీ వేటు పడ్డ ఇద్దరు ఐపీఎస్ అధికారులపై చర్యలను వెనక్కి తీసుకుంటున్న ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వార్తలు పెను సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకుంది. ప్రధానంగా 23 మంది ఐపీఎస్ అధికారులను వీఆర్ లో పెట్టడం చర్చనీయాంశమైంది. ఇందులో డీజీ స్థాయి అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్, సంజయ్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు కేసుల్లో పీఎస్సార్ ను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వార్తలు సంచలనం సృష్టించాయి.