పాక్ తో యుద్ధం మొదలైనట్లే.. నీటిని ఆపడం అంటే యుద్ధం కిందే లెక్కంట!

శత్రుదేశం పాకిస్థాన్ తో యుద్ధం మొదలైందా? నేడో రేపో తమపై భారత్ దాడి చేస్తోందని పాకిస్థాన్ ప్రచారం చేస్తోంది.;

Update: 2025-05-07 00:30 GMT

శత్రుదేశం పాకిస్థాన్ తో యుద్ధం మొదలైందా? నేడో రేపో తమపై భారత్ దాడి చేస్తోందని పాకిస్థాన్ ప్రచారం చేస్తోంది. మరోవైపు మన దేశంలో ఇంకా యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే యుద్ధమంటే కేవలం తుపాకులతో కాల్చడం, ఫిరంగులు, క్షిపణులతో దాడులు చేయడం ఒక్కటే కాదని, నీటిని ఆపడం కూడా యుద్ధం కిందకే వస్తుందని పాక్ రక్షణ మంత్రి కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఈ లెక్కన చూస్తే కాశ్మీర్ లోని బగ్లిహర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఆపేయడంతో మన దేశం పాకిస్థాన్ తో ప్రత్యక్ష యుద్ధాన్ని ఇప్పటికే ప్రారంభించినట్లేనా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

పహల్గామ్ లో ఉగ్ర దాడుల తర్వాత కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని కంకణం కట్టుకున్న మోదీ ప్రభుత్వం, అంతర్జాతీయంగా పాక్ ను ఒంటరి చేయడంతోపాటు ఆ దేశంతో అన్నిరకాల సంబంధాలను తెంచుకుంది. ఇక మనదేశం గుండా ప్రవహించే నదుల నుంచి ఒక్క చుక్కనీరు కూడా పాక్ కు అందకుండా నీటి ప్రవాహాలను నిలిపేస్తామని హెచ్చరించింది. ప్రధానంగా సింధు నదీ జలాలపై ఆధారపడిన పాక్ వ్యవసాయ రంగం.. ఆ నదీ జలాలను ఆపితే తీవ్రంగా నష్టపోనుంది. అందుకే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు మనదేశం ఇప్పటికే స్పష్టం చేసింది.

సింధు నదీ జలాల విషయంలో హెచ్చరికలు చేసిన ప్రభుత్వం అందులో భాగంగా కాశ్మీర్ లోని కొన్ని ప్రాజెక్టుల నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేసింది. మరోవైపు హిమాలయాల నుంచి వస్తున్న జలాన్ని ఒడిసిపట్టుకునేందుకు ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికను ఆఘమేఘాలపై తొలగిస్తోంది. దీంతో పాకిస్థాన్ నదీ జలాలు నిలిచిపోయి అల్లాడుతోంది. సింధు నదీజలాలను ఆపేస్తామన్న కేంద్ర ప్రభుత్వం అంతకు ముందే జమ్మూలోని రాంబన్ లో చీనాబ్ నదిపై నిర్మించిన బగ్లిహార్ ఆనకట్ట గేట్లు మూసి పాకిస్థాన్ కు గట్టి హెచ్చరికలు పంపింది.

రాంబన్ లోని చీనాబ్ నది నీటికి అడ్డుకట్ట వేసిన కేంద్ర ప్రభుత్వం ఉత్తర కాశ్మీర్ లోని జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా ప్రాజెక్టు గేట్లను కూడా మూసివేయనుందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. దీంతో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. భారత దేశం నుంచి తమ దేశానికి ప్రవహిస్తున్న నీటిని అడ్డుకున్నా, దారి మళ్లించేందుకు ప్రయత్నించినా, యుద్ధంగా పరిగణిస్తామని పాక్ రక్షణ మంత్రి కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ పరిస్థితుల్లో యుద్ధం మొదలైనట్లే? అని భావించాలా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బగ్లిహర్ రిజర్వాయర్ గేట్లు మూసివేయడంతో పాక్ వైపు వెళ్లాల్సిన 90 శాతం నీరు నిలిచిపోయిందని ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టు చేసింది. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అధికారిని ఉటంకిస్తూ కిషన్ గంగ ఆనకట్టకు కూడా ఇలాంటి ప్రణాళికే అమలు చేస్తామని ఆ అధికారి చెప్పినట్లు ప్రచురించింది. దీంతో పాక్ తో పరోక్ష యుద్ధం మొదలైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News