ఇండియా అంటే మోడీ... ఇదే నిజం

ఈ మాట వింటే ఐరన్ లేడీ స్లోగన్ గుర్తొస్తోందా. అవును ఈ దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలినవారు కాంగ్రెస్ అధినేత్రి, దివంగత ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరా గాంధీ.;

Update: 2025-04-28 04:16 GMT

ఈ మాట వింటే ఐరన్ లేడీ స్లోగన్ గుర్తొస్తోందా. అవును ఈ దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలినవారు కాంగ్రెస్ అధినేత్రి, దివంగత ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరా గాంధీ. ఆమె ఏకంగా పదహారేళ్ళ పాటు పాలించింది. ఆమె మాటే శాసనంగా చెల్లుబాటు అవుతున్న రోజులలో ఆమె భక్తులు అంతా కలసి ఇందిర అంటే ఇండియా అని ఒక పవర్ ఫుల్ స్లోగన్ ఇచ్చారు.

ఇందిరా గాంధీ తప్ప మరో పేరు లేదని ఆమె తప్ప మరో నాయకుడు లేడని వారు అనేవారు. ఆమె కూడా అలాగే పాలించింది. ఆనాడు విపక్షాలు అన్నీ కలసి ఒకసారి ఓడించినా మళ్ళీ ఆమె గెలుచుకుంది అలా ఇందిర రాజకీయంగా దేశాన్ని శాసించింది.

ఇపుడు అదే వరసలో ఇండియా అంటే మోడీ అంటున్నారు బీజేపీ నేతలు. ఇండియా మోడీ కంట్రీ అని ఇతర దేశాల వారు అంటున్నారని వారు చెబుతున్నారు. వరసగా మూడు సార్లు అధికారంలోకి రావడం ద్వారా పండిట్ నెహ్రూ రికార్డుని సమం చేసిన నరేంద్ర మోడీ ఈ టెర్మ్ పూర్తిగా పాలిస్తే ఇందిరాగాంధీ రికార్డుకి అతి సమీపంలోకి వస్తారు.

మరి కాంగ్రేసేతర కుటుంబం నుంచి ప్రధాని అయి ఇన్ని సార్లు గెలిచి ఇంత బలంగా పాతుకుపోయిన నాయకుడు మరొకరు అయితే లేరు. ఇక ముందు రారు అన్న మాట కూడా ఉంది. దాంతో ఇండియాలోనే కాదు మోడీ ఇతర దేశాల్లోనూ పవర్ ఫుల్ లీడర్ గా ఆవిర్భవించారు అని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు.

ఈ నేపధ్యంలో ఇండియాను మోడీ దేశంగా అంతా చూస్తున్నారు అన్న మాట బీజేపీ నేతల నోట వస్తోంది. భారత్ కేరాఫ్ మోడీ అన్న మాట. మోడీతోనే భారత్ ఉంది, భారత్ అంటే మోడీనే అన్నది ఇపుడు బీజేపీ నేతల నయా నినాదంగా ఉంది. తాజాగా ఏపీలో జరిగిన మేధావుల సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ కీర్తి విశ్వవ్యాప్తం అని ఆకాశానికి ఎత్తేశారు.

భారత దేశం అనగానే ప్రపంచ దేశాలకు ఠక్కున మోడీయే గుర్తుకు వస్తున్నారు అంటే అంతర్జాతీయంగా మోడీ ఎంతలా పాపులర్ అయ్యరో అర్థం చేసుకోవాలని అన్నారు. అంతే కాదు మోడీ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు అని చెప్పారు. ఇక దక్షిణాదిన బీజేపీ ప్రభంజనం వీస్తోందని ఎపుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో బీజేపీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

అలాగే కర్ణాటకలో సైతం బీజేపీ గెలుస్తుందని వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లోనూ బీజేపీ జెండా రెపరెపలాడుతుందని చెప్పారు. మొత్తం మీద చూస్తే మోడీ చరిష్మా అంతర్జాతీయం అని కిషన్ రెడ్డి అంటున్నారు. అలాగే మోడీ అంటే ఇండియా ఇండియా అంటే మోడీ అన్న కొత్త స్లోగన్ ని కూడా బీజేపీ తరఫున ఆయన జనాలకు పరిచయం చేశారు. మరి ఇందిరమ్మ నాడు శాసించారు. మోడీ నేడు శాసిస్తున్నారు. సో ఇండియా అంటే మోడీయేనా అంటే విపక్షాలు ఏమంటాయో.

Tags:    

Similar News