ఒకవేళ ఇండిగో విమానం గనుక పాక్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లుంటే ఏమయ్యేది ?

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం మే 21న ఒక పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.;

Update: 2025-05-23 18:51 GMT

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం మే 21న ఒక పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. విమానం గాల్లో ఉండగా భారీ వడగండ్ల వాన వల్ల తీవ్రమైన కుదుపులకు లోనైంది. దీంతో పైలట్ వెంటనే లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించి, అత్యవసరంగా ల్యాండింగ్ అవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, పాకిస్తాన్ ఇండిగో విమానానికి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో విమానాన్ని శ్రీనగర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 227 మంది ఉన్నారు.

పాకిస్తాన్ ఎందుకు అనుమతి ఇవ్వలేదు?

పాకిస్తాన్ ఇండిగో విమానానికి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదనే వార్త బయటకు వచ్చిన తర్వాత, దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వాస్తవానికి ఆ ఘటన జరిగిన సమయంలో విమానం ముందు భాగం దెబ్బతింది. కాబట్టి,పెద్ద ప్రమాదం జరిగి ఉండవచ్చు. ఒకవేళ అనుమతి లేకపోయినా విమానం పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి వెళ్లి ఉంటే ఏం జరిగేది? పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేది? అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయవచ్చా? లాంటి ప్రశ్నలు చాలా మంది మదిలో మెదలుతున్నాయి.

పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత

పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతిచర్యగా చర్యలు తీసుకున్నప్పుడు, పాకిస్తాన్ భారత విమానయాన సంస్థల కోసం తన ఎయిర్‌స్పేస్‌ను పూర్తిగా మూసివేసింది. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం కూడా పాకిస్తానీ విమానాల కోసం తమ ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. పాకిస్తాన్ ఈ నిర్ణయం తర్వాత భారత విమానయాన సంస్థల విమానాలు యూరప్, గల్ఫ్ దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణిస్తున్నాయి.

అనుమతి లేకుండా ఎయిర్‌స్పేస్‌లోకి వెళ్తే?

డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇండిగో విమానం అత్యవసర పరిస్థితుల్లో లాహోర్ ATCని సంప్రదించింది. కానీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. ఏ విమానం గాల్లో ఉన్నా అది ఎయిర్‌స్పేస్ నిబంధనలను పాటించాలి. అత్యవసర ల్యాండింగ్ సమయంలో కూడా సమీపంలోని ATC నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ల్యాండింగ్ చేస్తారు.

ఇక భారతదేశం, పాకిస్తాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. రెండు దేశాలు తమ ఎయిర్‌స్పేస్‌లను కూడా మూసివేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా విమానం అనుమతి లేకుండా పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించి ఉంటే, అది ఎయిర్‌స్పేస్ ఉల్లంఘనగా పరిగణిస్తారు. పాకిస్తాన్ దానిని శత్రు విమానంగా భావించి, విమానాన్ని టార్గెట్ చేసి కూల్చే అవకాశం ఉంది. అయితే, ప్రయాణికుల విమానంపై అలా చేస్తే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది.

అత్యవసర ల్యాండింగ్‌లో నిబంధనలు ఏం చెబుతాయి?

ఒక దేశం ఎయిర్‌స్పేస్ మూసివేసినా పరిస్థితి అత్యవసరమైతే మానవతా దృక్పథానికి ప్రాధాన్యత ఇస్తారు. కొన్నిసార్లు శత్రు దేశాలు కూడా అలాంటి అత్యవసర పరిస్థితుల్లో తమ ఎయిర్‌స్పేస్‌ను ఉపయోగించుకోవడానికి.. అత్యవసర ల్యాండింగ్ చేయడానికి అనుమతి ఇస్తాయి. అయితే, ఇది పూర్తిగా ఆ దేశం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇండీగో విమానం విషయంలో 227 మంది ప్రయాణికులు ఉన్నందున ఈ చర్చ ఎక్కువగా జరిగింది. పాకిస్తాన్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ప్రమాదం కూడా జరిగి ఉండేది.

Tags:    

Similar News