రెండేళ్లలో 300 ఫ్యామిలీల మేజిక్.. ఆ నాలుగు ధనిక దేశాలను దాటేసింది!
తొలుత మల్టీ జనరేషన్ కు చెందిన టాప్ 5 వర్సెస్ ఫస్ట్ జనరేషన్ టాప్ 5 వ్యాపార కుటుంబాలను పోల్చి చూస్తే.. వీరి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా కనిపిస్తుంది.
ఆసక్తికర ఆర్థిక విశ్లేషణతో పాటు.. వావ్ అనే ఒక జాబితాను విడుదల చేసింది బార్ క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా రిపోర్టు. ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెసెస్ లిస్ట్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టును సింఫుల్ గా చెప్పేస్తే.. కేవలం రెండేళ్ల వ్యవధిలో మన దేశానికి చెందిన 300 పారిశ్రామిక కుటుంబాలు సృష్టించిన సంపద నాలుగు సంపన్న దేశాల జీడీపీని దాటేయటం. ఇక్కడే మరో ఆసక్తికర అంశం ఏమంటే.. గడిచిన రెండేళ్లలో స్టాక్ మార్కెట్ సూచీలైన నిఫ్టీ 50, సెన్సెక్స్ లు నష్టపోయినా వీరి కుటుంబాల సంపద మాత్రం 27.5 శాతం పెరగటం గమనార్హం. ఈ రిపోర్టును తరచి చూస్తే బోలెడన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
ఈ రిపోర్టు ప్రకారం మన దేశానికి చెందిన 300 వ్యాపార కుటుంబాలు క్రియేట్ చేసిన సంపద ఏకంగా రూ.138 లక్షల కోట్లకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోని పద్దెనిమిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థతో సమానంగా పోల్చింది. అంతేకాదు.. నెదర్లాండ్స్.. సౌదీ అరేబియా.. స్విట్జర్లాండ్.. పోలాండ్ లాంటి సంపన్న దేశాల జీడీపీతో సమానంగా లెక్క కట్టింది. ముందే చెప్పినట్లు గడిచిన రెండేళ్లలో నిఫ్టీ 1.1 శాతం.. సెన్సెక్స్ 3.7 శాతం క్షీణించింది. కానీ.. ఈ సంపన్నుల కుటుంబాల సంపద మాత్రం దూసుకెళ్లటం.. అది కూడా రెండెంకలతో ఉండటం విశేషం.
మరో అంశం ఏమంటే.. ఈ మూడు వందల కుటుంబాల రోజువారీ సగటున ఎంత సంపదను క్రియేట్ చేశారంటే.. రూ.4076 కోట్లుగా లెక్కేశారు. ఈ 300 వ్యాపార కుటుంబాల్లోనూ టాప్ 10 కుటుంబాల సంపద విలువ మొత్తం జాబితాలోని సంపదలో 51 శాతం కావటం మరో విశేషంగా చెప్పాలి. అంటే.. 300 వ్యాపార కుటుంబాలు రెండేళ్లలో రూ.138 లక్షల కోట్ల సంపదను సృష్టిస్తే.. అందులో 51 శాతం, అంటే..70 లక్షల కోట్లు జాబితాలోని టాప్ 10 కుటుంబాలే క్రియేట్ చేసినట్లుగా తేల్చారు.
ఈ రిపోర్టు మరింత బాగా అర్థం అయ్యేందుకు ఒక పోలిక చెబితే ఇట్టే అర్థమవుతుంది. మొత్తం 300 వ్యాపార కుటుంబాల్లో టాప్ 50 కుటుంబాల జాబితాలో చేరాలంటే వారి కనీస సంపద రూ.52,100 కోట్లు. అదే టాప్ 200 జాబితాలో ఉండాలంటే కనీసం రూ.5వేల కోట్ల సంపద ఉన్నోళ్లనే చేర్చారు. ఇక.. జాబితాలోని 300 మందిలో కనీసం రూ.1300 కోట్ల సంపద కలిగినోళ్లకు మాత్రమే చోటు దక్కింది.
సంపద పరంగా అంబానీ ఫ్యామిలీనే తొలి స్థానంలో నిలిచారు. గడిచిన ఏడాదిలో రిలయన్స్ విలువ 8.5 శాతం తగ్గినా.. రూ.35.8 లక్షల కోట్లతో తొలి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో కుమార్ మంగళం బిర్లా ఫ్యామిలీ నిలిచింది. మొదటి.. రెండు స్థానాల మధ్య అంతరం భారీగా ఉండటం మరో ఆసక్తికర అంశం. కుమార్ మంగళం బిర్లా ఫ్యామిలీ రూ.81.4 లక్షల కోట్ల సంపదతో పోలిస్తే అంబానీ ఫ్యామిలీ సంపద మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు లెక్క కట్టారు. కుమార మంగళం బిర్లా కుటుంబ వ్యాపారాల విలువ ఏడాది కాలంలో 26 శాతం పెరగటం ఒక ఎత్తు అయితే.. మూడో స్థానంలో నిలిచిన జిందాల్ ఫ్యామిలీ వ్యాపార విలువ ఏడాదిలో 40 శాతం వృద్ధిని నమోదు చేయటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
రెండో స్థానంలో ఉన్న కుమార మంగళం బిర్లా (రూ.8.14 లక్షల కోట్లు)తో పోలిస్తే జిందాల ఫ్యామిలీ సంపదకు (రూ.8.02 లక్షల కోట్లు) మధ్య తేడా చాలా తక్కువగా ఉంది. నాలుగో స్థానంలో బజాజ్ కుటుంబం (రూ.7.7లక్షల కోట్లు).. ఐదో స్థానంలో మహీంద్రా కుటుంబం (రూ.5.5 లక్షల కోట్లు) నిలిచింది. ఇదంతా చదువుతున్నప్పుడు ఒక సందేహం రావటం ఖాయం. అంబానీల తర్వాత అదానీ ఫ్యామిలీ ఉండాలి కదా? కుమార మంగళం బిర్లా ఎందుకు నిలిచారు? టాప్ 5లో అదానీ ఫ్యామిలీ ఎందుకు లేదన్న అంశంలోకి వెళితే.. ఈ రిపోర్టును రెండు రకాలుగా వర్గీకరణ చేయటమే దీనికి కారణం.
ఈ రిపోర్టును రెండు రకాలుగా విభజించారు. మల్టీ జనరేషన్ వ్యాపార కుటుంబం.. ఫస్ట్ జనరేషన్ (మొదటి తరం) వ్యాపార కుటుంబాలుగా వర్గీకరించారు. తొలి జాబితాలోని టాప్ 5 వ్యాపార కుటుంబాల్ని చూస్తే అంబానీ.. బిర్లా.. జిందాల్.. బజాజ్.. మహీంద్రా కుటుంబాలు నిలుస్తాయి. మొదటి తరం వ్యాపార కుటుంబాల జాబితాలో గౌతమ్ అదానీ కుటుంబం నిలుస్తుంది. గౌతమ్ అదానీ తన స్వయంకృషితో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో మొదటి జాబితాలోని సాంప్రదాయ మల్టీ జనరేషన్ జాబితాకు భిన్నంగా.. స్వశక్తితో ఎదిగిన వ్యాపార కుటుంబాల జాబితాను వేరుగా తయారు చేశారు.
తొలి తరం వ్యాపార కుటుంబాల జాబితాను చూస్తే.. ఇందులో మొదటి స్థానం అదానీ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.19.6 లక్షల కోట్లుగా ఉండగా.. రెండో స్థానంలో భారతీ ఎయిర్ టెల్ కు చెందిన సునీల్ భారతీ మిట్టల్ ఫ్యామిలీ (రూ.12.1 లక్షల కోట్లు).. మూడో స్థానంలో సన్ ఫార్మా సంస్థకు చెందిన దిలీప్ సంఘ్వీ కుటుంబం (రూ.4.55 లక్షల కోట్లు).. నాలుగో స్థానంలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సైరస్ పూనావాలా ఫ్యామిలీ (రూ.2.98 లక్షల కోట్లు).. ఐదో స్థానంలో డిమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ ఫ్యామిలీ (రూ.2.86 లక్షల కోట్లు) నిలిచింది.
ఇక్కడో ఆసక్తికర పోలిక పోలిస్తే.. మొత్తం 300 వ్యాపార కుటుంబాల్లో రెండు జాబితాల్లోని టాప్ 5 కుటుంబాలు.. టాప్ 10 కుటుంబాల సంపద ఎంత భారీ అన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. మల్టీ జనరేషన్ (బహుళ తరాల) వ్యాపార కుటుంబాల్లో టాప్ 5, ఫస్ట్ జనరేషన్ వ్యాపార కుటుంబాల్లోని టాప్ 5 సంపద కలిపితే.. మొత్తంలో 70.8 శాతం ఉండటం కనిపిస్తుంది. అదే సమయంలో రెండు జాబితాల్లో టాప్ 10 వ్యాపార కుటుంబాలు (అంటే మొత్తం 300 వ్యాపార కుటుంబాల్లో 20 వ్యాపార కుటుంబాల) సంపదను లెక్కిస్తే.. మొత్తం సంపదలో 87.38 శాతం ఇరవై కుటుంబాల చేతుల్లో ఉండటం కనిపిస్తుంది. పేరుకు 300 వ్యాపార కుటుంబాలతో (రూ.138 లక్షల కోట్లు) జాబితాను సిద్ధం చేసినా.. 20 వ్యాపార కుటుంబాల సంపద రూ.120.59 లక్షల కోట్లు (అంటే సుమారు 88 శాతం) ఉండటం విశేషం.
రెండు జాబితాల్లోనూ టాప్ 5 వ్యాపార కుటుంబాల లెక్కలు చూశాం. మరి.. టాప్ 6 నుంచి 10స్థానాల్లో చోటు దక్కించుకున్న వ్యాపార కుటుంబాల లెక్కల్ని చూస్తే.. మరింత వివరంగా విషయాలు తెలుసుకున్నట్లు అవుతుందని చెప్పాలి. బహుళ తరాల వ్యాపార కుటుంబాల టాప్ 6-10జాబితాను చూస్తే..
టాప్ 6లో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కు చెందిన నాడార్ ఫ్యామిలీ (రూ.4.68 లక్షల కోట్లు).. టాప్ 7లో చోళమండలం ఇన్వెస్ట్ మెంట్ అలియాస్ మురుగప్ప గ్రూప్ కు చెందిన మురుగప్ప ఫ్యామిలీ (రూ.2.92 లక్షల కోట్లు) నిలిస్తుంది. టాప్ 8లో విప్రో అధినేత ప్రేమ్ జీ ఫ్యామిలీ (రూ.2.78 లక్షల కోట్లు) నిలవగా.. టాప్ 9లో వేదాంత, హిందుస్తాన్ జింక్ కు చెందిన అనిల్ అగర్వాల్ కుటుంబం (రూ.2.55 లక్షల కోట్ల) నిలుస్తాయి. టాప్ 10 స్థానంలో ఎషియన్ పెయింట్స్ అధినేత దానీ, చోక్సీ అండ్ వకీల్ కుటుంబం (మూడు కుటుంబాలు) సంయుక్తంగా (రూ.2.20 లక్షల కోట్లు) నిలుస్తాయి.
ఇక.. తొలి తరం వ్యాపార కుటుంబాలకు చెందిన టాప్ 6-10 స్థానాల్లో ఎవరు నిలిచారంటే.. ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ లో దూసుకెళుతున్న థర్మాక్స్ సంస్థ అధినేత మెహర్ పుదుంజీ కుటుంబం (రూ.61,500 కోట్లు) టాప్ 6 స్థానంలో నిలిస్తే.. టాప్ 7 స్థానంలో గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు నేతృత్వం వహిస్తున్న బీనా మోదీ ఫ్యామిలీ (రూ.38,900 కోట్లు) నిలుస్తుంది. జాబితాలో టాప్ 8వ స్థానంలో భారతదేశ అతి పెద్ద దుస్తుల ఎగుమతి సంస్థ షాహీ ఎక్స్ పోర్ట్స్ అధినేత అహుజా ఫ్యామిలీ (రూ.37,500 కోట్లు), టాప్ 9 స్థానంలో ఫార్మా రంగంలో పేరున్న యూఎస్ వీ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న లీనా గాంధీ తివారీ ఫ్యామిలీ (రూ.32,500 కోట్లు), టాప్ 10 స్థానంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్, బయో ఫార్మాస్యూటికల్స్ తయారీ సంస్థ బయోలాజికల్ ఇ అధినేత్రి మహిమా దాట్ల కుటుంబం (రూ.22వేల కోట్లు) నిలుస్తుంది.
మొత్తం 300 వ్యాపార కుటుంబాల్లో 20 వ్యాపార కుటుంబాల సంపదే సుమారు 88 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడే మరో లెక్క వేస్తే.. అదిరే అంశాలు కనిపిస్తాయి. అదేమంటే.. మల్టీ జనరేషన్ లోని టాప్ 5 వర్సెస్ ఫస్ట్ జనరేషణ్ టాప్ వ్యాపార కుటుంబాలు. అదే విధంగా మల్టీ జనరేషన్ లోని టాప్ 6-10 వ్యాపార కుటుంబాలు వర్సెస్ ఫస్ట్ జనరేషన్ టాప్ 6-10 వ్యాపార కుటుంబాలను పోల్చి చూస్తే ఆసక్తికర ఆర్థిక అంశాలు కనిపిస్తాయి.
తొలుత మల్టీ జనరేషన్ కు చెందిన టాప్ 5 వర్సెస్ ఫస్ట్ జనరేషన్ టాప్ 5 వ్యాపార కుటుంబాలను పోల్చి చూస్తే.. వీరి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా కనిపిస్తుంది. మల్టీ జనరేషన్ టాప్ 5 కుటుంబాల మొత్తం సంపద రూ.55.66 లక్షల కోట్లు కాగా.. ఫస్ట్ జనరేషన్ టాప్ 5 వ్యాపార కుటుంబాల మొత్తం సంపద రూ.42.09 లక్షల కోట్లు. అంటే.. వీరి మధ్య సంపద వ్యత్యాసం రూ.13.5 లక్షల కోట్లు. అంటే.. సంప్రదాయ వ్యాపార కుటుంబాలకు మొదటి తరం వ్యాపార కుటుంబాలు గట్టి పోటీ ఇస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. దీనికి కారణం ఫస్ట్ జనరేషన్ లోని అదానీ.. సునీల్ భారతీ మిట్టల్ ఫ్యామిలీ క్రియేట్ చేసిన భారీ సంపదే.
మరి.. మల్టీ జనరేషన్ లోని టాప్ 6-10 వ్యాపార కుటుంబాలు వర్సెస్ ఫస్ట్ జనరేషన్ కు చెందిన టాప్ 6-10 వ్యాపార కుటుంబాల సంపదను పోలిస్తే.. ఇక్కడ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మల్టీ జనరేషన్ లోని టాప్ 6-10 కుటుంబాల మొత్తం సంపద రూ.15.13 లక్షల కోట్లు అయితే.. జాబితాలోని టాప్ 6-10 స్థానాల్లో నిలిచిన ఫస్ట్ జనరేషన్ వ్యాపార కుటుంబాల మొత్తం సంపద రూ.1.92 లక్షల కోట్లు మాత్రమే. అంటే.. మల్టీ జనరేషన్ లోని సంప్రదాయ వ్యాపార కుటుంబాల సంపద.. మొదటి తరం వ్యాపార కుటుంబాల కంటే ఏకంగా 8 రెట్లు ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే టాప్ 5 స్థానాల్లో నిలిచిన మొదటి తరం వ్యాపార కుటుంబాలు, పాత తరం వ్యాపార కుటుంబాలకు సమానంగా నిలిస్తే.. 6-10 స్థానాల విషయానికి వస్తే మాత్రం పాతతరం వ్యాపార కుటుంబాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అదే సమయంలో మొదటి తరం వ్యాపారాలు ఇంకా ఎదుగుతున్న దశలో ఉన్న అంశం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇదంతా చూస్తే రాబోయే పది - పదిహేనేళ్లలో మొదటి తరం వ్యాపార కుటుంబాలే తర్వాతి కాలపు మల్టీ జనరేషన్ దిగ్గజాలుగా మారే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.