సోషల్ మీడియా బ్యాన్ ఉద్యమం మొదలుకాబోతోందా?

ఆస్ట్రేలియా దేశం ఒక గొప్ప పనిచేసింది. సోషల్ మీడియాకు బానిసైన ఒక 14 ఏళ్ల బాలుడు అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు.;

Update: 2025-12-11 19:30 GMT

ఆస్ట్రేలియా దేశం ఒక గొప్ప పనిచేసింది. సోషల్ మీడియాకు బానిసైన ఒక 14 ఏళ్ల బాలుడు అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కలతచెందిన ఆ బాలుడి తల్లి ఏకంగా ప్రధానికి లేఖ రాసి సోషల్ మీడియాను అరికట్టాలని కోరింది. దీనికి ఎంతో హృద్యంగా స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని ఏకంగా ఆ దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసి ప్రపంచానికి, ఆ దేశవాసులకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న ఆందోళనల మధ్య, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న పిల్లల కోసం భారతదేశంలో సోషల్ మీడియా నిషేధం ఉద్యమం మొదలు కాబోతోందా? అనే చర్చ ఊపందుకుంటోంది. ఆస్ట్రేలియా తరహాలోనే భారతదేశంలో కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ప్రజల నుంచి.. నిపుణుల నుంచి అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనలకు తాజాగా నటుడు, సామాజిక కార్యకర్త అయిన సోనూసూద్ తన వాయిస్ ను బలంగా జోడించడంతో దీనిపై చర్చ ప్రారంభమైంది.

నిజమైన బాల్యాన్ని కాపాడాలంటున్న సోనూసూద్

ప్రముఖ నటుడు, సేవావాది అయిన సోనూసూద్ ఈ ఉద్యమాన్ని పైకి తీసుకొస్తున్నాడు. తన ట్విట్టర్ ఖాతలో పోస్ట్ చేస్తూ ఈ డిమాండ్ కు మరింత బలాన్ని చేకూర్చారు. ‘పిల్లలు స్క్రీన్ అడిక్షన్ కు దూరమై, ఆరుబయట ఆటలు ఆడడం , మానిసిక వికాసం, భావోద్వేగ అనుబంధాలు వంటి నిజమైన బాల్యాన్ని గడపాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంభాషణ, బంధాలు మరింత బలపడుతాయని అభిప్రాయపడ్డారు.

సోనూసూద్ ప్రకటనకు నెటిజన్ల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. చాలా మంది తల్లిదండ్రులు , పౌరులు తమ పిల్లల మానసిక ఆరోగ్యం, చదువులపై దృష్టిపెట్టడానికి ఈ నిషేధం చాలా అవసరమని భావిస్తున్నారు. సోషల్ మీడియా నిషేధం పై మద్దతు ఉన్నప్పటికీ దీని అమలు, ఆచరణపై కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తల్లిదండ్రులే తమ ఫోన్లకు స్క్రీన్ లకు నిరంతరం అతుక్కుపోతుంటే పిల్లలు ఎలా మారాలని మనం ఆశించగలం? పిల్లలు తమ పేరెంట్స్ ను చూసి నేర్చుకుంటారు కదా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. కేవలం పిల్లలను బ్యాన్ చేస్తే సరిపోదు.. పెద్దలు కూడా రోల్ మోడల్ గా మారాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడుతున్నారు.

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం అనేది వారి భద్రత, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక వినూత్న ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం చట్టపరమైన నిర్ణయం కాకుండా తల్లిదండ్రులు, మొత్తం సమాజం తమ జీవన విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతోంది. ఆస్ట్రేలియా తరహాలోనే భారతదేశంలో ఈ నిషేధాన్ని అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై భారత ప్రభుత్వం త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సోనూసూద్ లాంటి వారినుంచి కూడా డిమాండ్ మొదలు కావడంతో ఈ ఉద్యమం ఉప్పెనలా సాగే అవకాశం ఉంది.

Tags:    

Similar News