ఐక్యరాజ్యసమితిలో దాయాదిని ఉతికేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తిన భారత ప్రతినిధి.. ఈ సందర్భంగా పాక్ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యను ఉటంకించారు.;
చేయాల్సిన దుర్మార్గాల్ని చేసుకుంటూ పోవటం.. ఏమీ తెలియని నంగనాచి మాదిరి అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడే తీరు దాయాది దేశానికి ఎక్కువే. నిత్యం విద్వేషాన్ని కక్కుతూ.. భారతదేశాన్ని ఏదో ఒక కష్టాన్ని తెచ్చి పెట్టటమే ఎజెండాగా కుట్ర పన్నే పాకిస్థాన్ కు సరైన రీతిలో షాకిచ్చింది భారత్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తమ దేశంలో హింసకు పాల్పడుతున్న పాక్ తీరును మరోసారి అంతర్జాతీయ వేదిక మీద భారత్ ఎండగట్టింది. పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తిన భారత ప్రతినిధి.. ఈ సందర్భంగా పాక్ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యను ఉటంకించారు.
ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని పాక్ మంత్రే స్వయంగా వెల్లడించిన వైనాన్ని ప్రస్తావిస్తూ పాక్ మీద మండిపడిన భారత ప్రతినిధి.. ఇకపై ప్రపంచం కళ్లు మూసుకొని ఉండిపోదని హెచ్చరించింది. న్యూయార్క్ లో జరిగిన ఉగ్రవాద అనుబంధ నెట్ వర్కు బాధితుల ప్రోగ్రాంలో ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న యోజన పటేల్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పాక్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
సీమాంతర ఉగ్రవాదానికి తాము బాధితులమని.. ఉగ్ర చర్యలతో బాధితులమని పేర్కొన్న ఆమె.. ‘ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని.. ఉగ్ర సంస్థలకు నిధులు సమీకరిస్తున్నట్లు ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ చెప్పిన మాటల్ని యావత్ ప్రపంచం వింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని వారు బహిరంగంగా అంగీకరించినా ఎవరూ ఆశ్చర్యపోలేదు. పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో దీన్ని బట్టి మరోసారి స్పష్టమైంది. ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని కూర్చోదు’ అంటూ హెచ్చరించారు. భారత్ పై నిరాధార ఆరోపణలు చేయటానికి ఈ అంతర్జాతీయ వేదికను పాకిస్థాన్ దుర్వినియోగం చేస్తుందని ఆమె నిప్పులు చెరిగారు.