ఒక్క బాంబుతో సిటీ ఖతం.. అయినా వేల టన్నుల అణ్వాయుధాలు ఎందుకు ?
భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో ఉన్నాయి.ఈ రెండు దేశాల వద్ద అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల అనేక క్షిపణులు ఉన్నాయి.;
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని కూడా కొందరు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి భారత్ మీద అణుదాడి చేస్తామంటూ బెదిరిస్తోంది. ఒకవేళ భారత్ దాడి చేస్తే తాము అణుబాంబులు ఉపయోగిస్తామని పదే పదే హెచ్చరిస్తోంది. ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే దాని ఫలితాలు ఊహించలేనంత భయంకరంగా ఉండనున్నాయి.
భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో ఉన్నాయి.ఈ రెండు దేశాల వద్ద అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల అనేక క్షిపణులు ఉన్నాయి. ఈ క్షిపణులు రెండు దేశాలలోని అనేక నగరాలను టార్గెట్ చేయగలవు. ఒకవేళ భారత్, పాకిస్తాన్ ఈ క్షిపణులను ఉపయోగిస్తే భారీ విధ్వంసం జరుగుతుంది.
కేవలం 9 దేశాల వద్దే అణుబాంబులు
భారత్ , పాకిస్తాన్‌తో సహా ప్రపంచంలో కేవలం తొమ్మిది దేశాల వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. అవి..రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్. ఈ దేశాల వద్ద మొత్తం 12,121 అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిలో రష్యా వద్ద అత్యధికంగా 5580 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికా రెండో స్థానంలో ఉంది. దాని వద్ద 5044 అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో 90 శాతం రష్యా, అమెరికా వద్దనే ఉన్నాయి.
ఒక్క బాంబుతో నగరం బూడిద
అణుబాంబులను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలుగా చెబుతారు. చివరిసారిగా ఈ బాంబును రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌పై ఉపయోగించింది. ఆ దాడిలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పూర్తిగా నాశనమయ్యాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నేడు ప్రపంచంలోని ఈ తొమ్మిది దేశాల వద్ద రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన అణుబాంబుల కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయి. ఇవి ఒక్క క్షణంలో ఒక పెద్ద నగరాన్ని కూడా బూడిద చేయగలవు.
వేల సంఖ్యలో అణుబాంబులు ఎందుకు?
ఒక్క బాంబుతోనే ఒక నగరం నాశనమైపోతే ప్రపంచంలోని కొన్ని దేశాలు వేల సంఖ్యలో అణుబాంబులు ఎందుకు తయారు చేశాయి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ప్రస్తుతం అమెరికా, రష్యా వద్ద మాత్రమే 5000 కంటే ఎక్కువ బాంబులు ఉన్నాయి. తర్వాత చైనా వస్తుంది. దాని వద్ద 500 అణ్వాయుధాలు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో అణుబాంబులు తయారు చేయడానికి ప్రధాన కారణం అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య చాలా కాలంగా కొనసాగిన ఆధిపత్య పోరు. ఈ రెండు దేశాలు ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పెద్ద మొత్తంలో అణ్వాయుధాలను తయారు చేశాయి. అయితే, ఈ బాంబుల వల్ల జరిగే విధ్వంసాన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏ ఇతర దేశానికి కూడా అణుబాంబులు తయారు చేయడానికి అనుమతి లేదు.