'ఒప్పందం రద్దు' కాదు.. పాక్ లో నదులు ఎండిపోవాలంటే..?
ఇందులో ప్రధానంగా.. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంశంపై కీలక చర్చలు నడుస్తున్నాయి.;
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ దౌత్యపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా.. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంశంపై కీలక చర్చలు నడుస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ తాగు నీటి సమస్యను ఎదుర్కోంటుందని, సాగు నీరు సమస్యతో ఎడారిగా మారుతుందనే ప్రచారం భారత్ లో నడుస్తుంది.
మరోపక్క... భారత్ నీటిని దాచి దాచి ఒకేసారిగా వదులుతుందని, ఫలితంగా వరదలకు కారణమవుతుందని పాక్ నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. నిజంగానే పాక్ నదులు ఎండిపోతున్నాయా.. అక్కడ వరదలు సృష్టించే స్థాయిలో భారత్ నీటిని వదిలే స్థాయిలో నిల్వలు చేస్తుందా.. అనేదానికి సంబంధించి వాస్తవాలు తెరపైకి వచ్చాయి.
అవును... జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు, పలు విశ్లేషణల ప్రకారం.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిన ఏప్రిల్ 24 కి - 30 నాటి పరిస్థితులకు తేడా ఎంత ఉంది.. పాక్ నదుల ప్రవాహాల్లో తేడా ఏ మేరకు కనిపిస్తుంది. పాక్ ఆరోపణల్లోనూ, భారతీయుల ఆలోచనల్లోనూ ప్రస్తుతం ఎంత వాస్తవిక కనిపిస్తుందనేది ఇప్పుడు చూద్దామ్..!
పాకిస్థాన్ సింధు నదీ వ్యవస్థ అథారిటీ ప్రచురించిన డేటా ప్రకారం.. భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేసినట్లు ప్రకటించిన ఏప్రిల్ 24న.. భారత్ నుంచి పాక్ లోకి ప్రవేశించిన తర్వాత మరాలా ఆనకట్ట వద్ద చీనాబ్ నది 22,800 క్యూసెక్కుల చొప్పున ప్రవహిస్తుండగా.. ఏప్రిల్ 30న దీని ప్రవాహం పెరిగి 26,268 క్యూసెక్కులుగా ఉంది.
ఇదే సమయంలో... పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని మంగ్లా ఆనకట్ట వద్ద జీలం నదీ ప్రవాహం ఏప్రిల్ 24న 44,822 క్యూసెక్కులుగా ఉండగా.. ఏప్రిల్ 30న ఆ ప్రవాహం స్వల్పంగా తగ్గి 43,486 క్యూసెక్కులుగా ఉంది. ఇలా చీనాబ్, జీలం నదీ ప్రవాహాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. ఆప్ స్ట్రీమ్ జలవిదుత్ ప్రాజెక్టులో మాత్రం ఎలాంటి మార్పూలేదని అంటున్నారు.
అదేవిధంగా.. పాకిస్థాన్ లోని పంజాబ్ లో గల మరాలా, మంగళ, జిన్నా బ్యారేజీల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్నారు. దానికి కారణం... నదులను నియంత్రించడం అంత తేలికైన పని కాదని.. నదీ జలాలను నిల్వ చేసి మళ్లించగల భారీ ప్రాజెక్టులు లేనప్పుడు ఇది ఆల్ మోస్ట్ అసాధ్యం అని నిపుణులు చెబుతున్నారు.
అదే జరగాలంటే... భారత భూభాగంలోని ఇతర ప్రాంతాలకు నీటిపారుదల కోసం నీటిని మళ్లించడానికి పెద్ద ఆనకట్టలు, కాలువలను నిర్మించాలని చెబుతున్నారు. ఈ క్రమంలో.. పాక్ కు వెళ్లే మూడు నదులలో ఒక ఏడాదిలో ప్రవహించే నీటిని నిల్వ చేయాలంటే.. భాక్రా నంగల్ కు సమానమైన కనీసం 20 నుంచి 22 ఆనకట్టలను భారత్ నిర్మించాల్సి ఉంటుందనేది నిపుణుల మాటగా ఉంది!
కాగా... సింధు నదితో ముడిపడి సుమారు 15.2 కోట్లకు పైగా పాకిస్తానీయుల జీవనోపాధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ముడిపడి ఉంది. ఇది ఆహారం, విద్యుత్ ఉత్పత్తులతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన వనరు.