జనగణన 2027: దేశవ్యాప్తంగా 40 ప్రశ్నలు.. మీ నుంచి ఏ వివరాలు సేకరిస్తారంటే?

వ్యక్తి పేరు, కుటుంబంలో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, వైవాహిక స్థితి వంటి ప్రాథమిక వివరాలతో ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Update: 2026-08-16 12:30 GMT

భారత్‌లో జనగణన 2027కు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈసారి జనగణనలో ప్రజల జనాభా వివరాలతో పాటు విద్య, ఉపాధి, వలసలు, బ్యాంకు ఖాతాలు, డిజిటల్‌ అక్షరాస్యత వంటి అంశాలపై కూడా సమాచారం సేకరించనున్నారు. మొత్తం 40 ప్రశ్నల ద్వారా ప్రతి వ్యక్తికి సంబంధించిన వివిధ వివరాలను నమోదు చేయనున్నారు.

వ్యక్తి పేరు, కుటుంబంలో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, వైవాహిక స్థితి వంటి ప్రాథమిక వివరాలతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివాహితుల విషయంలో వివాహ వయసు, జీవిత భాగస్వామి పేరు వంటి వివరాలను కూడా నమోదు చేస్తారు. అలాగే వ్యక్తి ప్రకటించిన జాతీయత, మతం, ఎస్సీ/ఎస్టీ/కుల వివరాలు, తల్లిదండ్రుల వివరాలను కూడా సేకరిస్తారు.

విద్య, ఉద్యోగంపై ప్రత్యేక వివరాలు

జనగణనలో విద్యకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యక్తి అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, విద్యాసంస్థకు హాజరవుతున్నారా లేదా ఇప్పటివరకు సాధించిన అత్యున్నత విద్యార్హత, చదివిన కోర్సు లేదా విభాగం వంటి వివరాలు అడుగుతారు.

ఉపాధి విషయంలో గత ఏడాదిలో ఎప్పుడైనా పని చేశారా, ఆర్థిక కార్యకలాపాల వర్గం, వృత్తి, పరిశ్రమ/వ్యాపారం/సేవ రంగం, కార్మికుల వర్గం వంటి అంశాలను నమోదు చేస్తారు. పని చేయని లేదా పరిమితంగా పనిచేసే వ్యక్తుల విషయంలో వారు చేస్తున్న ఆర్థికేతర కార్యకలాపాలు, ఉద్యోగం కోసం చూస్తున్నారా లేదా అందుబాటులో ఉన్నారా అనే వివరాలను కూడా తెలుసుకుంటారు.

వలసలు, నివాస వివరాలు

వ్యక్తి పుట్టిన ప్రదేశం, చివరిగా నివసించిన ప్రాంతం, వలస రావడానికి కారణం, ప్రస్తుత గ్రామం లేదా పట్టణంలో ఎంతకాలంగా ఉంటున్నారు, శాశ్వత నివాస చిరునామా వంటి వివరాలను కూడా సేకరిస్తారు. పని చేసే ప్రదేశానికి ఎలా ప్రయాణిస్తున్నారనే అంశం కూడా ప్రశ్నల్లో ఉంటుంది.

కుటుంబం, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు

ప్రస్తుతం వివాహితులు, వితంతువులు, విడాకులు పొందిన వారు లేదా విడిపోయిన మహిళల విషయంలో ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య, ఇప్పటివరకు జన్మించిన పిల్లల సంఖ్య వంటి వివరాలను నమోదు చేస్తారు. ప్రస్తుతం వివాహిత మహిళలకు గత ఏడాది జన్మించిన పిల్లల సంఖ్యను కూడా అడుగుతారు. దివ్యాంగులకు సంబంధించిన వివరాలతో పాటు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ఎక్కడ పొందారనే సమాచారాన్ని కూడా సేకరించనున్నారు.

బ్యాంకు ఖాతాల నుంచి గుర్తింపు పత్రాల వరకు..

ఈసారి జనగణనలో ఆర్థిక, డిజిటల్‌ వివరాలకు కూడా చోటు కల్పించారు. వ్యక్తికి ఉన్న మొత్తం బ్యాంకు ఖాతాల సంఖ్య, అందుబాటులో ఉంటే మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయనున్నారు.

అలాగే ఆధార్ నంబర్, ఓటర్‌ ఐడీ, భారతీయ పాస్‌పోర్ట్‌ నంబర్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందుబాటులో ఉన్నాయా? అనే వివరాలను కూడా సేకరించే ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులో ఉంటేనే నమోదు చేసే విధంగా ప్రశ్నలను రూపొందించారు.

మొత్తంగా జనగణన 2027లో కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాకుండా.. దేశ ప్రజల సామాజిక, విద్యా, ఆర్థిక, ఉపాధి, వలస, డిజిటల్‌ , గుర్తింపు సంబంధిత వివరాలపై విస్తృత సమాచారాన్ని సేకరించేందుకు 40 ప్రశ్నలను ఉపయోగించనున్నారు.

Tags:    

Similar News