మరో 114 రఫేల్స్ కోసం ఆర్డర్ ప్లేస్ చేసిన భారత్.. ‘రఫేలే ఎందుకు?’

ఇప్పటికే సేవలో ఉన్న రఫేల్ యుద్ధవిమానాల పనితీరుతో సంతృప్తి చెందిన భారత్, మరిన్ని రఫేల్ కొనుగోలుపై దృష్టి సారించింది.;

Update: 2026-02-17 08:06 GMT

భారత వైమానిక దళం ఆధునికీకరణ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉంది. ఇప్పటికే సేవలో ఉన్న రఫేల్ యుద్ధవిమానాల పనితీరుతో సంతృప్తి చెందిన భారత్, మరిన్ని రఫేల్ కొనుగోలుపై దృష్టి సారించింది. ఈ నిర్ణయం కేవలం కొనుగోలు ఒప్పందం మాత్రమే కాదు.. భారత రక్షణ వ్యూహంలో దీర్ఘకాలిక మార్పునకు సంకేతంగా చెప్పవచ్చు..

భారత వాయుసేన (IAF) కు అవసరమైన 42 స్క్వాడ్రన్‌ల లక్ష్యం ప్రస్తుతం 30కి తగ్గిపోయిన నేపథ్యంలో, తక్షణమే శక్తి పెంపు అవసరమైంది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న భద్రతా సవాళ్ల మధ్య ఆధునిక, మల్టీ-రోల్ ఫైటర్ జెట్‌ల అవసరం మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన డిసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన డిసాల్ట్ రఫేల్ విమానాలే భారత్‌కు అనుకూలమని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే మరో 114 విమానాల కోసం భారత్ ఆర్డర్ ప్లేస్ చేసింది.

రష్యా, అమెరికా ఆఫర్లను పక్కనపెట్టి..

ఈ పోటీలో రష్యాకు చెందిన సుఖోయ్ Su-57, అమెరికా F-35 లెటినింగ్ II విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ భారత్ వ్యూహాత్మకంగా రఫేల్ వైపే మొగ్గు చూపింది. F-35 కొనుగోలు చేస్తే అమెరికా నుంచి కఠినమైన ఎండ్-యూజ్ మానిటరింగ్, సాఫ్ట్‌వేర్ పరిమితులు వంటివి ఎదుర్కోవాలి. భారత్ కు నమ్మకమైన డిఫైన్ పార్ట్నర్ రష్యాకు చెందిన SU-57 విషయంలో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఇంజిన్ విశ్వసనీయత వంటి సందేహాలు ఇంకా పూర్తిగా నివృత్తి కాలేదు. ఈ రెండింటి కంటే రఫేల్ ఇప్పటికే భారత అవసరాలకు సరిపోయేలా నిరూపితమైందన్న భావన బలపడింది.

డైరెక్ట్ డేటా ఎక్స్‌చేంజ్.. వ్యూహాత్మక ఆధిక్యం

రఫేల్‌లో ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, థర్డ్ పార్టీ అనుమతులు లేకుండానే డైరెక్ట్ డేటా ఎక్స్‌చేంజ్ చేయగల సామర్థ్యం. భారతీయ కమ్యూనికేషన్ సిస్టమ్స్, స్వదేశీ ఆయుధ వ్యవస్థలతో సమన్వయం సులభంగా ఉంటుంది. ఇది యుద్ధ సమయంలో తక్షణ స్పందనకు దోహదపడుతుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆయుధ సమీకరణలో కూడా స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది.

మెయింటెనెన్స్ విషయంలో కూడా రఫేల్ సులభతరం. ఇప్పటికే 36 రఫేల్ విమానాలు IAFలో సేవలందిస్తున్నందున లాజిస్టిక్స్, ట్రైనింగ్, స్పేర్ పార్ట్స్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగా మరో మోడల్ తీసుకుంటే వేర్వేరు సరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు, సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటే రఫేల్ కొనసాగింపు వ్యూహం సౌకర్యవంతంగా కనిపిస్తోంది.

లోకల్ తయారీపై ఫోకస్

ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం. రఫేల్ విమానాల లోకల్ అసెంబ్లీ, భాగాల తయారీపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది దేశీయ రక్షణ పరిశ్రమకు ఊతమివ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచుతుంది. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ ద్వారా భారతీయ కంపెనీలు భవిష్యత్తులో స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్టులకు బలమైన పునాది వేసుకునే అవకాశం ఉంటుంది.

రాజకీయ పరమైన సవాళ్లు తక్కువ

రఫేల్ కొనుగోలు విషయంలో గతంలో దేశీయ రాజకీయ చర్చలు జరిగినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాజకీయ అవరోధాలు ఎదురవలేదు. ఫ్రాన్స్‌తో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా కొనసాగుతోంది. అమెరికా లేదా రష్యాతో పోలిస్తే ఇక్కడ జియోపాలిటికల్ ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయని రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీర్ఘకాలిక వ్యూహం

114 రఫేల్ విమానాల కొనుగోలు జరిగితే, అది కేవలం సంఖ్యా పెంపు మాత్రమే కాదు. భారత వైమానిక దళానికి ఒక సమగ్ర, సమన్వయమైన యుద్ధ సామర్థ్యం ఏర్పడుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకునే సామర్థ్యం, అణు నిరోధక వ్యూహం, సముద్ర భద్రత అన్నీ ఒక ప్యాకేజీగా రఫేల్ పనిచేయగలదు.

భారత్ ముందున్న ఎంపికల్లో రఫేల్‌ను ప్రాధాన్యంగా తీసుకోవడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. దేశ భద్రతను బలోపేతం చేస్తూనే, స్వదేశీ తయారీకి ఊతమివ్వడం.. ఈ రెండింటినీ సమతుల్యం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వచ్చే కొన్నేళ్లలో ఈ నిర్ణయం భారత రక్షణ వ్యవస్థను ఎంతగా మార్చుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News