చైనా, టర్కీలకు షాకిచ్చిన భారత్!

గత కొన్ని సంవత్సరాలుగా భారత్-చైనా సంబంధాలు సరిహద్దు వివాదాల కారణంగా ఉద్రిక్తంగా మారాయి.;

Update: 2025-07-06 17:34 GMT
చైనా, టర్కీలకు షాకిచ్చిన భారత్!

భారత ప్రభుత్వం కేవలం మాటలతో కాకుండా వ్యూహాత్మక చర్యలతో స్పందిస్తోంది. పొరుగు దేశమైన చైనాతో పాటు సుదూర దేశమైన టర్కీ కూడా భారత్‌కు వ్యతిరేకంగా పలు ప్రకటనలు, చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు దేశాలకు చెందిన ప్రముఖ ప్రభుత్వ మాధ్యమాల ఎక్స్ అకౌంట్లను భారతదేశంలో నిషేధించింది.

చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

గత కొన్ని సంవత్సరాలుగా భారత్-చైనా సంబంధాలు సరిహద్దు వివాదాల కారణంగా ఉద్రిక్తంగా మారాయి. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చైనా సైన్యం తరచుగా చొరబడే ప్రయత్నాలు చేస్తోంది, ఇది ద్వైపాక్షిక వాతావరణాన్ని శాంతియుతంగా ఉండనివ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే చైనా అధికారిక వార్తా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్ న్యూస్’ ఎక్స్ అకౌంట్‌ను భారతదేశంలో 'విత్‌హెల్డ్' చేసినట్లు తెలుస్తోంది.

టర్కీ ప్రతికూల వైఖరి

టర్కీ కూడా పాకిస్థాన్‌తో కలిసి భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం టర్కీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిందని, డ్రోన్ల ద్వారా సహాయం అందించిందని వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా టర్కీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న టీఆర్‌టీ వరల్డ్ మాధ్యమ సంస్థ కూడా భారత్ వ్యతిరేక కంటెంట్‌ను ప్రచురిస్తోంది.

కేంద్రం ప్రతిష్టాత్మక నిర్ణయం

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ టైమ్స్ న్యూస్ (చైనా) , టీఆర్‌టీ వరల్డ్ (టర్కీ) ఎక్స్ అకౌంట్లను భారతదేశంలో 'అన్‌అవైలబుల్'గా మార్చింది. ప్రస్తుతం ఎక్స్‌లో ఈ అకౌంట్లను తెరిస్తే ‘Account Withheld in India’ అని కనిపిస్తోంది. దీనికి గల కారణాలు ఎక్స్ విధానాలు లేదా కోర్టు ఆదేశాలు అయి ఉండవచ్చు అని సమాచారం.

రాయిటర్స్‌తో తలెత్తిన సమస్యకు పరిష్కారం

గతంలో రాయిటర్స్ కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంది. అయితే కేంద్రానికి వారి వివరణ అనంతరం ఆ అకౌంట్లపై ఉన్న అడ్డంకులను తొలగించారు. ప్రస్తుతం రాయిటర్స్‌కు చెందిన టెక్ న్యూస్, ఫ్యాక్ట్ చెక్, పిక్చర్స్, ఆసియా, చైనా వంటి అన్ని అకౌంట్లు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి.

ఈ చర్యలు భారత్ తన అంతర్గత భద్రతను పెంపొందించడంలో మాత్రమే కాకుండా, భారత్ వ్యతిరేక ప్రచారాన్ని నిరోధించడంలో కూడా కీలకమైన భాగంగా పరిగణించబడుతున్నాయి. సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించబోమన్న సందేశాన్ని ఈ నిర్ణయం ద్వారా కేంద్రం బలంగా ఇచ్చింది.

Tags:    

Similar News