సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. 43 ఏళ్ల తర్వాత దొరికిన సైనికుడి మృతదేహం
దాదాపు 43 సంవత్సరాల క్రితం లెబనాన్‌లోని బెకా లోయలో IDF ,సిరియన్ సైన్యాల మధ్య ఈ భీకర యుద్ధం జరిగింది.;
ఇజ్రాయెల్ సైన్యం, మొసాద్ సిరియాలో అద్భుతమైన విజయం సాధించాయి. 1982లో లెబనాన్ యుద్ధంలో అదృశ్యమైన తమ సైనికుడి అవశేషాలను కొన్ని దశాబ్దాల తర్వాత గుర్తించాయి. ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాధ్యమైంది.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ సైన్యం (IDF), గూఢచారి సంస్థ మొసాద్ సంయుక్తంగా సిరియాలో ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 43ఏళ్ల కిందట అదృశ్యమైన తమ సైనికుడి మృతదేహాన్ని కనుగొన్నాయి. 1982లో మొదటి లెబనాన్ యుద్ధంలో సుల్తాన్ యాకూబ్ యుద్ధంలో కనిపించకుండా పోయిన ఫస్ట్ క్లాస్ సార్జెంట్ జవీ ఫెల్డ్‌మాన్ అవశేషాలను వారు గుర్తించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
దాదాపు 43 సంవత్సరాల క్రితం లెబనాన్‌లోని బెకా లోయలో IDF ,సిరియన్ సైన్యాల మధ్య ఈ భీకర యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ట్యాంక్ సైనికుడైన ఫెల్డ్‌మాన్‌తో పాటు ఫస్ట్ క్లాస్ సార్జెంట్ యెహుదా కాట్జ్, ఫస్ట్ క్లాస్ సార్జెంట్ జాచరీ బౌమెల్ కూడా ఆ యుద్ధంలో అదృశ్యమయ్యారు. అయితే, బౌమెల్ అవశేషాలు గతంలోనే కనుగొనబడి 2019లో ఇజ్రాయెల్‌కు తిరిగి అప్పగించారు.
ఆదివారం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో మొసాద్, IDF ఫెల్డ్‌మాన్ మృతదేహాన్ని ఒక ప్రత్యేక ఆపరేషన్‌లో సిరియా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. అయితే ఈ ఆపరేషన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించనప్పటికీ, మృతదేహాన్ని కనుగొనే ప్రయత్నాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది. గుర్తింపు కోసం మృతదేహాన్ని ఇజ్రాయెల్‌కు తరలించారు. ఆపై ఫెల్డ్‌మాన్ కుటుంబానికి సమాచారం అందించారు.
ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "దశాబ్దాలుగా జవీ కనిపించకుండా పోయాడు. అదే యుద్ధంలో తప్పిపోయిన ఇతర సైనికులతో పాటు అతనిని కనుగొనే ప్రయత్నాలు ఒక్క క్షణం కూడా ఆగలేదు" అని అన్నారు.
రక్షణ మంత్రి మాట్లాడుతూ.. "మేము జాచరీ బౌమెల్‌ను,ఈరోజు జవీ ఫెల్డ్‌మాన్‌ను తిరిగి తీసుకువచ్చినట్లే. ఫస్ట్ క్లాస్ సార్జెంట్ యెహుదా కాట్జ్‌ను కూడా తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము" అని అన్నారు.
బౌమెల్ మృతదేహాన్ని సిరియాలోని అతిపెద్ద పాలస్తీనా సమాజాలలో ఒకటైన యార్మౌక్ శరణార్థి శిబిరం నుంచి రష్యా సాయంతో కనుగొన్నారు. 2016లో యుద్ధంలో కోల్పోయిన ఒక ఇజ్రాయెల్ ట్యాంక్‌ను బషర్ అల్-అస్సాద్ పాలన పతనం తర్వాత రష్యా ఇజ్రాయెల్‌కు తిరిగి ఇచ్చింది. ఐడీఎఫ్ దక్షిణ సిరియాలో తొమ్మిది అవుట్‌పోస్టులలో మోహరించారు. వాటిలో చాలా వరకు దేశాల మధ్య సరిహద్దులో ఐక్యరాజ్యసమితి గస్తీ నిర్వహించే బఫర్ జోన్‌లో ఉన్నాయి. సైనికులు సిరియాలో దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ఇజ్రాయెల్ "శత్రు శక్తుల" చేతిలో పడితే దేశానికి ముప్పు కలిగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడమే వారి లక్ష్యం.