'ఆకస్మిక మరణాలు కోవిడ్ వ్యాక్సిన్ వల్లేనా?'.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
అవును... కోవిడ్ తర్వాత దేశంలో ఆకస్మిక మరణాలు.. ప్రధానంగ 40 ఏళ్ల లోపు వారు కూడా కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్న ఘటనాలు పెరిగిన సంగతి తెలిసిందే!;
కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతుండటం.. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఆడుతూ, పాడుతూ ఉండగానే కుప్పకూలిపోవడం జరుగుతుండంటంతో.. ఈ ఆకస్మిక మరణాలకు కారణం కోవిడ్ వ్యాక్సిన్ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని చాలా మంది బలంగా నమ్మారని అంటారు. ఈ సమయంలో కేంద్రం నుంచి క్లారిటీ వచ్చింది.
అవును... కోవిడ్ తర్వాత దేశంలో ఆకస్మిక మరణాలు.. ప్రధానంగ 40 ఏళ్ల లోపు వారు కూడా కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతున్న ఘటనాలు పెరిగిన సంగతి తెలిసిందే! దీనికంతటికే కరోనా వ్యాక్సినే కారణమనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఎయిమ్స్ వంటి సంస్థలు పరిశోధనలు చేపట్టాయి. ఈ సందర్భంగా.. పలు కీలక విషయాలు వెల్లడించాయి.
ఇందులో భాగంగా... ఈ ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లు కారణం కాదని.. ఆ మరణాలకూ, ఈ వ్యాక్సిన్ కూ ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనాల్లో తేలినట్లు స్పష్టం చేశాయి. ఆయా వ్యక్తుల ఆకస్మిక మరణాల్లో మునుపటి అనారోగ్య సమస్యల ప్రభావమే కీలక అంశమని పేర్కొన్నాయి. ఈమేరకు అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది.
ఈ సందర్భంగా... భారత్ లో కొవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమైనవని.. సమర్థవంతమైనవని.. వీటివల్ల దుష్ప్రభావాలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కన్పించాయని.. గుండె సంబంధిత ఆకస్మిక మరణాలకు అనేక కారణాలు ఉన్నాయని.. ఇందులో జన్యుపరమైన సమస్యలు, మునపటి అనారోగ్యాలు, ఆహారపు అలవాట్లు, జీవన శైలి.. ఇలా ఏవైనా కావొచ్చని అధ్యయనాలు తెలిపాయి!
కాగా... 18 - 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్.సీ.డీ.సీ), ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి. దీనికోసం 2023 మే - ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో సర్వేలు చేశాయి. ఆరోగ్యంగా కన్పించినప్పటికీ ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి.
ఈ నేపథ్యంలోనే... అధ్యయనం తర్వాత ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు వెల్లడించాయి. ఇదే సమయంలో... ఆధారాల్లేకుండా చేసే ఇలాంటి ప్రచారాలు వ్యాక్సిన్లపై విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తంచేశాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ వ్యాక్సిన్ల వల్లే ఎంతోమంది ప్రాణాలు నిలిచాయని గుర్తుచేశాయి.