ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్
| పాకిస్థాన్ గూఢచారిగా అనుమానిస్తున్న వ్యక్తి హనీట్రాప్‌లో భారత వాయుసేన వింగ్ కమాండర్ చిక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. అశ్లీల ఫొటోలకు బదులుగా రహస్య యుద్ధ ప్రణాళిక పేజీలను పంపినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. డ్రోన్ యూనిట్లు, యుద్ధ విమానాలకు సంబంధించిన వివరాలనూ చేరవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మే 30న ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
వలపు వల.. పాకిస్తాన్ అమలు చేసిన ఈ గూఢచార కుట్రలో భారత వాయుసేన అధికారి ఒకరు చిక్కారు. మన రహస్యాలను శత్రువుల చేతికి అందజేశారు. తన వ్యక్తిగత బలహీనతల కారణంగా దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్నే ప్రత్యర్థికి చేరవేశాడు. ప్రస్తుతం భారత వైమానిక దళానికి ఐఏఎఫ్ వింగ్ కమాండర్‌పై వెలుగులోకి వచ్చిన ఆరోపణలు దేశ భద్రతా వ్యవస్థలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాకిస్థాన్ గూఢచారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఈ వింగ్ కమాండర్‌ను హనీట్రాప్‌లోకి దించినట్లు ఆరోపణలున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన ఈ పరిచయం క్రమంగా దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే కుట్రగా మారినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసుల ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు చెబుతున్న అంశం అత్యంత విస్మయానికి గురిచేస్తోంది. అవతలి వ్యక్తి పంపిన ఓ అశ్లీల ఫొటోకు ప్రతిగా వింగ్ కమాండర్ రహస్య యుద్ధ ప్రణాళికకు సంబంధించిన ఓ పేజీని పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ప్రతి నూడ్ ఫొటోకు బదులుగా యుద్ధ ప్రణాళికలోని ఒక్కో పేజీని పంపుతానని అతడు పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దేశ రక్షణకు సంబంధించిన అత్యున్నత పత్రాలను ఒక వ్యక్తిగత ఆకర్షణకు బేరం పెట్టినట్లుగా ఈ ఉదంతం కనిపిస్తోంది.
ఈ వ్యవహారం కేవలం ఒక పేజీతో ముగియలేదని తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా డ్రోన్ యూనిట్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు, కీలక సైనిక స్థావరాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సైతం ఇతడు చేరవేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యుద్ధ సమయంలో ఇలాంటి వివరాలు శత్రుదేశం చేతుల్లోకి వెళితే.. అది మన సైనిక బలగాల వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
నిజానికి ఈ అధికారి నిర్వాకం మే నెలలోనే బయటపడింది. ఓసారి ఆఫీసుకు స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన అతడిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అప్పుడే అనుమానం వచ్చిన ఎయిర్ ఫోర్స్ అధికారులు అతడిపై ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. దీంతో మే 30న ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీహాడ్ జైలకు తరలించారు. తాజా చార్జ్ షీట్ లో ఈ సంచలన విషయాలు వెలుగుచూశాయి.
సైనిక, రక్షణ రంగ అధికారుల నుంచి రహస్యాలను రాబట్టేందుకు శత్రు దేశాలు తరచూ అవలంబించే ఈ హనీట్రాప్ అత్యంత డేంజర్ గా చెప్పొచ్చు. నకిలీ ప్రొఫైల్స్.. ఆకర్షణీయమైన మాటలు.. భావోద్వేగ బంధాలతో ప్రారంభమయ్యే ఈ ఉచ్చులు క్రమంగా బ్లాక్‌మెయిల్‌కు దారితీస్తుంటాయి. సోషల్ మీడియా విస్తరణ తర్వాత ఈ ముప్పు మరింత హెచ్చిందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ రంగంలో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.