నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తున్న శత్రువు.. మన ఇంట్లోనే ఉందా?

మనం అలవాటు పడ్డ ఆధునిక జీవనశైలి, తినే జంక్ ఫుడ్, నిరంతర ఒత్తిడి.. చివరికి మన ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి.

Update: 2026-05-28 20:20 GMT

కళ్ల ముందే నవ్వుతూ తిరిగిన మనిషి.. అంతలోనే గుండె ఆగి అనంత లోకాలకు వెళ్లిపోతే ఆ కుటుంబం అనుభవించే నరకం వర్ణనాతీతం. "నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా హఠాత్తుగా ఏమైంది?" అని గుండెలు పగిలేలా ఏడ్చే గుండెల వెనుక.. నిశ్శబ్దంగా దాక్కున్న ఒక రాక్షసుడు ఉన్నాడు. అదే హైబీపీ తెలుగులో అధిక రక్తపోటు. ఎలాంటి హెచ్చరికలు చేయకుండా పైకి ఎలాంటి లక్షణాలు చూపించకుండా, లోలోపలే ప్రాణాధారమైన అవయవాలను నమిలేసే ఈ 'సైలెంట్ కిల్లర్' దేశంలో ప్రతి ఏటా దాదాపు 16 లక్షల మందిని మనకు దూరం చేస్తోంది. అంటే ఎన్నో కుటుంబాల నవ్వులను, ఆశలను బూడిద చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో 30 కోట్ల మంది ఈ మృత్యుపాశంలో చిక్కుకుని ఉన్నారనేది ఊహించడానికే భయమేసే నిజం.

మనం అలవాటు పడ్డ ఆధునిక జీవనశైలి, తినే జంక్ ఫుడ్, నిరంతర ఒత్తిడి.. చివరికి మన ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. నిన్నటివరకు వృద్ధులకే పరిమితం అనుకున్న ఈ మహమ్మారి, ఇప్పుడు ఇంటికి దీపాల్లాంటి యువతను కూడా బలితీసుకుంటోంది.

భారతదేశంలో అధిక రక్తపోటు ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు పెద్దగా లక్షణాలు కనిపించకపోయినా, లోపల శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీసే కారణంగా దీనిని ‘సైలెంట్ కిల్లర్’గా పిలుస్తున్నారు. న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ అంబుజ్ రాయ్ వెల్లడించిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయన ప్రకారం భారతదేశంలో ప్రతి ఏడాది దాదాపు 16 లక్షల మంది హైబీపీ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో అత్యధిక మరణాలకు హైబీపీనే ప్రధాన కారణంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది ప్రజలు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత వేగంగా విస్తరిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. పట్టణాల్లో సుమారు 33 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మంది హైబీపీ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అసమయ భోజనం, జంక్ ఫుడ్ వినియోగం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ఈ సమస్య పెరగడానికి ప్రధాన కారణాలుగా గుర్తిస్తున్నారు.

హైబీపీ వల్ల గుండెజబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చాలామందికి తమకు హైబీపీ ఉందనే విషయం చాలా ఆలస్యంగా తెలుస్తోంది. అప్పటికే శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి తరచూ బీపీ చెక్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా హైబీపీని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించడం అత్యంత అవసరం. అధిక నూనె, మసాలాలు, నిల్వ పచ్చళ్లు, బేకరీ పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

అలాగే శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవడం కూడా కీలకం. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లను పూర్తిగా మానేస్తే హైబీపీ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం హైబీపీ సమస్య యువతలో కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News