పిండం ముట్టేందుకు కాకిని కొన్న కుటుంబం.. ఆలోచింప చేస్తున్న ఘటన..!

హైదరాబాద్ వంటి మహానగరాలలో ఇప్పుడు కాకులు కనిపించడం గగనమైపోతోంది. పురానాపూల్‌లో కర్మకాండలు నిర్వహిస్తున్న ఆ కుటుంబం, శాస్త్రోక్తంగా పిండాన్ని సిద్ధం చేసి కాకి కోసం గంటల తరబడి ఎదురుచూసింది.;

Update: 2026-04-20 06:49 GMT

పాతబస్తీలోని పురానాపూల్ శ్మశానవాటికలో జరిగిన ఈ ఘటన వినడానికి వింతగా ఉన్నా, మన సమాజంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నమ్మకానికి, ప్రకృతిలోని మార్పులకు మధ్య సామాన్యుడు ఎంతలా సతమతమవుతున్నాడో ఈ ఘటన నిరూపిస్తోంది.

కాకి కోసం వేట.. కలికాలం వింత

భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో అంత్యక్రియల తర్వాత నిర్వహించే పితృకార్యాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. చనిపోయిన వారు కాకి రూపంలో వచ్చి మనం పెట్టే ‘పిండాన్ని’ స్వీకరిస్తారని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని మన పెద్దలు నమ్ముతారు. అయితే, మారుతున్న కాలంతో పాటు ప్రకృతిలో వస్తున్న మార్పులు ఇప్పుడు ఈ ఆచారాలకు పెను సవాలుగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని పురానాపూల్ శ్మశానవాటికలో ఒక కుటుంబం కాకి కోసం పడ్డ తపన, చివరకు మార్కెట్ నుంచి కాకిని కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆచారానికి అడ్డొచ్చిన ప్రకృతి వైపరీత్యం!

హైదరాబాద్ వంటి మహానగరాలలో ఇప్పుడు కాకులు కనిపించడం గగనమైపోతోంది. పురానాపూల్‌లో కర్మకాండలు నిర్వహిస్తున్న ఆ కుటుంబం, శాస్త్రోక్తంగా పిండాన్ని సిద్ధం చేసి కాకి కోసం గంటల తరబడి ఎదురుచూసింది. కానీ ఒక్క కాకి కూడా రాలేదు. సాధారణంగా కాకి పిండాన్ని ముట్టకపోతే పితృదేవతలు కోపంగా ఉన్నారని లేదంటే వారి ఆత్మకు శాంతి కలగలేదని భావిస్తారు. ఈ భయం ఆ కుటుంబంలో తీవ్ర ఆవేదనను నింపింది.

వినూత్న పరిష్కారం!

మరో దారి లేక, ఆ కుటుంబ సభ్యులు పాతబస్తీలోని ప్రసిద్ధ పక్షుల మార్కెట్ ‘ముర్గీ చౌక్’కు వెళ్లారు. అక్కడ విక్రయానికి ఉన్న ఒక కాకిని కొనుగోలు చేసి శ్మశానవాటికకు తీసుకువచ్చారు. ఆ కాకితో పిండాన్ని ముట్టించి, తమ పితృకార్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘కలికాలం అంటే ఇదేనేమో.. నమ్మకం కోసం కాకులను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

నగరాల్లో తగ్గుతున్న కాకులు..

ఈ ఘటన సోషల్ మీడియాలో నవ్వుకునేందుకు కాదు.. ఇది పర్యావరణ హెచ్చరిక. పట్టణాల్లో విపరీతంగా పెరిగిన సెల్ టవర్ల రేడియేషన్ పక్షుల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. విపరీతమైన ఎండలు, పట్టణీకరణ వల్ల చెట్లు తగ్గిపోవడం, ఆహారం దొరకకపోవడం వల్ల కాకులు నగరాలకు దూరం అవుతున్నాయి. పక్షులు గూడు కట్టుకోవడానికి చెట్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్తున్నాయి.

నమ్మకం వర్సెస్ వాస్తవం

శాస్త్రం ప్రకారం పితృదేవతలు కాకి రూపంలో వస్తారని నమ్ముతాం. కానీ, శాస్త్రీయంగా చూస్తే కాకి అనేది ఒక పారిశుధ్య కార్మికుడు. అది ప్రకృతిని శుభ్రం చేస్తుంది. మనుషులు పెట్టే ఆహారంపై ఆధారపడే పక్షుల్లో కాకి ప్రధానమైనది. నేడు ఆ పక్షులే కనిపించకుండా పోవడం వల్ల మన ఆచారాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. భవిష్యత్తులో పిండం ముట్టడానికి కాకులకు బదులు కృత్రిమ పద్ధతులు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందా..? అనే సందేహం కలుగుతోంది.

పురానాపూల్ ఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. మన ఆచారాలు, సంప్రదాయాలు నిలబడాలన్నా.. మనతో పాటు ప్రకృతిలోని జీవజాలం సురక్షితంగా ఉండాలి. పక్షులకు దాహార్తిని తీర్చడానికి ఇంటిపై నీటి గిన్నెలు పెట్టడం, చెట్లను పెంచడం వంటివి చేయకపోతే.. రేపు కేవలం కాకులే కాదు.. మన సంప్రదాయాలు కూడా కేవలం పుస్తకాలకే పరిమితం అవుతాయి. నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పక్షులను కొనుగోలు చేయాల్సిన దుస్థితి రావడం నిజంగా కలికాలం వైపరీత్యమే.


Tags:    

Similar News