హైదరాబాద్ కిటకిట.. ఢిల్లీని దాటేసిందట
వాళ్లు వీళ్లు అన్న తేడా లేదు. సౌత్..నార్త్ అన్న సమస్య రాదు. ఎవరి భాష మాట్లాడినా.. ఎవరో ఒకరు సమాధానం ఇస్తుంటారు.;
వాళ్లు వీళ్లు అన్న తేడా లేదు. సౌత్..నార్త్ అన్న సమస్య రాదు. ఎవరి భాష మాట్లాడినా.. ఎవరో ఒకరు సమాధానం ఇస్తుంటారు. ఫుడ్ కోసం ఇబ్బందులు అసలే రావు. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్న మహానగరం మన దేశంలో హైదరాబాద్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. అందుకే.. ఇప్పుడు అందరి చూపు భాగ్యనగరం మీదనే. గడిచిన కొన్నేళ్లుగా భాగ్యనగరికి అన్ని రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. ఉపాధి అవకాశాల కోసం.. ఉద్యోగాల కోసం.. చదువుకోవటానికి.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి అంశానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. ఈ కారణంతోనే జనసాంద్రత విషయంలో దేశ రాజధాని ఢిల్లీని దాటిపోయింది భాగ్యనగరం. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన తెలంగాణ రాష్ట్ర గణాంకాల శాఖ విడుదల చేసిన రిపోర్టులో వెల్లడయ్యాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ మహానగరంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 11,313 మంది నివసిస్తుండగా.. హైదరాబాద్ జనసాంద్రత 18,161గా నమోదైంది. అంటే.. హైదరాబాద్ మహానగరంలోని ప్రతి చదరపు కిలోమీటర్ లో 18వేలకు పైగా ప్రజలు నివసిస్తున్న పరిస్థితి. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాను చెబుతారు. అక్కడ ప్రతి చదరపు కిలోమీటర్ కు 43,079 మంది నివసిస్తుంటారు.
మన దేశానికి వస్తే అత్యధిక జనసాంద్రత కలిగిన మహానగరంగా ముంబయి నిలుస్తుంది. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్ కు 28,508 మంది ఉంటున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. హైదరాబాద్ మహానగరంలో జనసాంద్రత అంతకంతకూ పెరిగిపోతుంటే.. ఈ మహానగరి ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు జనసాంద్రత తక్కువగా ఉండటం గమనార్హం.
బిహార్.. పశ్చిమ బెంగాల్ తో పోల్చినా కూడా తెలంగాణలో జనసాంద్రత తక్కువగా నమోదు అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. సగటున చదరపు కిలోమీటర్ కు 312 మంది మాత్రమే నివసిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో చదరపు కిలోమీటర్ కు నివసిస్తున్న వారు 18,161తో పోల్చినప్పుడు జనాభా ఎంత ఎక్కువగా ఉన్నారన్న విషయం అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 2036 నాటికి యువ జనాభా తగ్గి పెద్దవయస్కుల జనాభా పెరుగుతుందన్న ఆందోళనకర అంశం వెల్లడైంది. 2011తో పోలిస్తే 2036 నాటికి తెలంగాణలో 34 ఏళ్ల లోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో పెద్ద వయస్కుల జనాభా పెరగనుంది. జనాభా నియంత్రణ విధానాల్ని పాటించటంతో జననాల రేటు తగ్గిపోవటమే కారణంగా చెబుతున్నారు. 2011లో తెలంగాణలో రాష్ట్రంలో ఏడాది అంతకంటే తక్కువ వయసున్న చిన్నారులు 5.79 లక్షల మంది.2036 నాటికి చిన్నారుల సంఖ్య 3.94 లక్షలకు తగ్గిపోతారని చెబుతున్నారు. ఇదే విధంగా మిగిలిన వయస్కుల విషయంలోనూ ఉంటుందని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న మాట ఇప్పుడు ప్రభుత్వాథినేతల నోటి నుంచి తరచూ వస్తోంది.