హైదరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్

ఈ టెక్నాలజీని మొదటిగా రాయదుర్గ్ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కాచిగూడ - ఎయిర్‌పోర్టు మార్గాల్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు.;

Update: 2025-07-23 01:30 GMT

తెలంగాణ రాజధాని హైదరాబాద్ రోజు రోజుకీ జనాభా పెరుగుతూ, మౌలిక వసతులపై భారంగా మారుతోంది. ఐటీ, విద్య, వాణిజ్య రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మెట్రోపాలిటన్ నగరం ప్రపంచంలోని మహానగరాల్లో 41వ స్థానాన్ని దక్కించుకుంది. అయితే, ఇక్కడి ప్రజలకు నిత్యం ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్య ట్రాఫిక్. ట్రాఫిక్ జామ్‌లు, రద్దీతో ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే గడిపే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు సమాధానంగా హైదరాబాద్‌లో త్వరలోనే "పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్" (PRT) విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం.

పాడ్ ట్యాక్సీ పథకం ఎంత ప్రత్యేకం?

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) సంయుక్తంగా ఈ పాడ్ ట్యాక్సీల ప్రాజెక్టును చేపట్టనున్నాయి. పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ అనేది చిన్న, ఆటోమేటెడ్ కాప్స్యూల్ వాహనాల ద్వారా ప్రయాణించే ఒక సరికొత్త రవాణా విధానం. ఈ 'పాడ్స్' డ్రైవర్ లేకుండానే బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. ఒక్కో పాడ్‌లో 4-6 మంది ప్రయాణికులు తమ లగేజీతో సహా ప్రయాణించవచ్చు. పూర్తిగా ఆటోమేటెడ్‌ వ్యవస్థగా ఉండే ఈ రవాణా విధానం రోజుకు సుమారు 2 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చగలదు.

-ముఖ్యమైన మార్గాలు ఎక్కడెక్కడ?

ఈ టెక్నాలజీని మొదటిగా రాయదుర్గ్ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కాచిగూడ - ఎయిర్‌పోర్టు మార్గాల్లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. ఇవి ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ప్రాంతాలు కావడం, అలాగే రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మొదటి విడతలో ఈ మార్గాలను ఎంచుకున్నారు. దీనికి ప్రత్యేక భూసేకరణ అవసరంలేదు. ఈ పాడ్ ట్యాక్సీల ఏర్పాటుకు ప్రత్యేకంగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న రోడ్ల పక్కనే ఎత్తైన రైలు మార్గాల్లో వీటిని ఏర్పాటు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని వల్ల నగరంలో ట్రాఫిక్‌ను గణనీయంగా తగ్గించవచ్చు.

- ట్రాఫిక్, వర్షాలు.. డబుల్ కష్టాల నుంచి విముక్తి

హైదరాబాద్ నగర ప్రజలు ఇప్పటికే వర్షాలు పడితే ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడం వంటి సమస్యలతో తడిసి ముద్దవుతున్నారు. అలాంటి సమయంలో ఈ పాడ్ ట్యాక్సీలు ఓ మార్గదర్శక పరిష్కారంగా నిలవనున్నాయి. పాడ్ ట్యాక్సీలతో ప్రయాణికులు రద్దీ నుంచి తప్పించుకుని వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారు.

భవిష్యత్తులో హైదరాబాద్‌కు ఇదే మార్గం?

జనాభా ఏటా 2.5-3 శాతం పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఈ విధానం ఎంతో కీలకమవుతుంది. నగర అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ఈ పాడ్ ట్యాక్సీలు పర్యావరణ హితమైనవే కాక, ప్రజలకు భద్రతతో కూడిన ప్రయాణం అందించగలవు.

ట్రాఫిక్‌ మానేయాలి అంటే కొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సిందే. హైదరాబాద్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడుగు భాగ్యనగరానికి సాంకేతికతతో కూడిన స్మార్ట్ ప్రయాణ మార్గాన్ని తెరవనుంది. ట్రాఫిక్‌ రద్దీ నుంచి విముక్తి పొందాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే!

Tags:    

Similar News