మరో అతిపెద్ద భవనం కూల్చివేసిన హైడ్రా..
తెలంగాణ రాష్ట్ర రాజధాని పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. చూద్దామంటే భూమి కనిపించదు.. ఇక జలావాసాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.;
తెలంగాణ రాష్ట్ర రాజధాని పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది. చూద్దామంటే భూమి కనిపించదు.. ఇక జలావాసాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బఫర్ జోన్లు, ట్యాంక్ లెవల్ కబ్జా చేసి పూర్తి చెరువులు, కుంటలకు దిగుతున్నారు. రాజధాని కావడంతో ఇంచు స్థలం కూడా చాలా విలువ చేస్తుంది. దీంతో రియాల్ వ్యాపారులు విడిచిపెట్టడం లేదు. దీంతో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో హైడ్రా తెచ్చింది. ఇది ఇప్పుడు రాజధానిని కాపాడుతుంది. కుంటలు, చెరువులు, నాలాల ఆక్రమణ దారులపై ఉక్కుపాదం మోపుతుంది. నోటీసుల లాంటివి జాన్ తా నై అంటుంది.. కూల్చివేయడమే. ఆ తర్వాత ఆలోచిద్దాం అంటూ పని చేస్తుంది. ఇప్పటికీ హైదరాబాద్ లో వందలాది బడా బిల్డింగులకు కూల్చివేసింది.
మరో భవనం నేలమట్టం..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో మరో క్లాసిక్ కుంభకోణం వెలుగుచూసింది. మియాపూర్ సర్వే నంబర్ 100లో హైడ్రా ఒక భారీ భవనాన్ని కూల్చింది. సదరు యజమాని న్యాయపరమైన సరిహద్దులను మాయం చేసి.. సర్వే నంబర్లను మార్చి, ఫెన్సింగ్ తొలగించి ‘మేము ఇక్కడే సొంతదారులం’ అన్న అహంకారంతో నిర్మించిన భవనం భవనం నేలమట్టమైంది. సర్వే నంబర్ 100లో ఆక్రమణలు జరిగాయన్న ఫిర్యాదులు మొదట సాధారణంగా అనిపించాయి. కానీ ఫైల్‌లు తెరిచి చూస్తే మార్చిన సర్వే నెంబర్ల కుంభకోసం బయటపడింది. ఇది సాధారణ పొరపాటు కాదు.. పథకం ప్రకారం చేసిన కుట్రనే. హెచ్ఎండీఏ (HMDA) గతంలో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించి తమ స్థలమని చెప్పుకుంటూ, అంతస్తులపై అంతస్తులు నిర్మించారు. శనివారం (నవంబర్ 1) ఉదయం హైడ్రా బృందం భారీ యంత్రాలతో, సిబ్బందితో, పకడ్బందీ పోలీస్ బందోబస్తుతో రంగంలోకి దిగింది. ఫ్లాట్ యజమానులు, కాంట్రాక్టర్లు, స్థానికులు నిశ్శబ్దంగా చూస్తుండగా.. కాంక్రీటు కలలు కూలిపోతున్న శబ్దం వినిపించింది. క్రేన్‌లు, బుల్డోజర్లు గోడలను పూర్తిగా తొలగించాయి.
రియల్ ఎస్టేట్ కు ప్రతి సారి హెచ్చరిక..
ఇది నగరంలోని ఒక భాగంలో కూల్చివేత మాత్రమే కాదు.. మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యవస్థకు ఒక హెచ్చరిక. సర్వే నంబర్లతో ఆడుకోవడం, ఫేక్ పత్రాలు సృష్టించడం, అధికారం లేకుండా నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ గతంలో అయితే ‘పరిష్కారం కనుగొంటాం’ అనే వ్యాఖ్యతో సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది చట్టం తన కఠిన రూపాన్ని చూపిస్తోంది.
పెన్సింగ్ తొలగించి మరీ నిర్మాణం..
ఈ ఘటనలో కీలకమైన అంశం ఏంటంటే హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణం చేపట్టడం. అంటే.. ప్రభుత్వ స్థలమని తెలిసినా కూడా ఆక్రమించుకోవడం హక్కుగా భావిస్తు్న్నారు. స్థానికులు ఫిర్యాదులు చేయకపోతే ఈ నిర్మాణం ‘అధికారికంగానే’ ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేది. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఈసారి మాత్రం ఎలాంటి కనికరం చూపలేదు. ఎలాంటి ‘రాజకీయ ఫోన్ కాల్స్’కీ లొంగకుండా, పూర్తి స్థాయిలో ఆ భవనాన్ని కూల్చేశారు. అక్రమ నిర్మాణం వెనుక ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నా.. హైడ్రా పట్టించుకోలేదు.
ప్రతిసారీ ఇలాంటి ఘటనల తర్వాత వినిపించే మాట ఒకటే ‘ఇకనైనా పాఠం నేర్చుకుంటామా?’ కానీ వాస్తవం ఏంటంటే, అక్రమ నిర్మాణాల వ్యవహారం హైదరాబాద్‌కు నిత్య పాఠంగా మారిపోయింది. సర్వే నంబర్లు మారతాయి, భవనాలు పెరుగుతాయి, కానీ బాధ్యత మాత్రం మధ్యలో మాయమవుతుంది.