దేశంలోని 5 పెద్ద ఎయిర్ పోర్టుల్లో నష్టజాతకుడిగా హైదరాబాద్?

జెట్ స్పీడ్ వృద్ధిరేటుతో దూసుకెళుతున్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అంతర్జాతీయ పరిణామాల బ్రేకులు పడ్డాయి. గడిచి ఐదారేళ్లలో దేశంలో టాప్ 5 విమానాశ్రయాల్లో ఒకటిగా నమోదైనప్పటికి ఏడాది కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడీ ఎయిర్ పోర్టును నష్టజాతకుడిగా మార్చాయి.

Update: 2026-08-14 23:30 GMT

జెట్ స్పీడ్ వృద్ధిరేటుతో దూసుకెళుతున్న హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అంతర్జాతీయ పరిణామాల బ్రేకులు పడ్డాయి. గడిచి ఐదారేళ్లలో దేశంలో టాప్ 5 విమానాశ్రయాల్లో ఒకటిగా నమోదైనప్పటికి ఏడాది కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడీ ఎయిర్ పోర్టును నష్టజాతకుడిగా మార్చాయి. గత ఏడాది రెండు అంకెల వృద్ధిరేటుతో దూసుకెళ్లిన ఈ ఎయిర్ పోర్టు ఈసారి మాత్రం మైనస్ లోకి వెళ్లింది. అదే సమయంలో దేశంలోని మిగిలిన ప్రధాన ఎయిర్ పోర్టులతో పోలిస్తే.. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకే ఎక్కువ దెబ్బలు తగిలిన పరిస్థితి. ఉరుము ఉరిమి మంగలం మీద పడిన చందంగా.. అక్కడెక్కడో ఉన్న ట్రంప్ మామ.. మనకు దగ్గర్లో ఉన్న ఇరాన్ మీద యుద్ధం చేయటం.. ఈ కారణంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ప్రయాణికులు రాలేకపోవటం ఒక ఎత్తు అయితే.. తన ప్రభుత్వ విధానాల పుణ్యమా అని అమెరికా నుంచి రావాల్సిన మనోళ్లు రాని దుస్థితి.

కారణాలు ఏమైనా.. మొత్తంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు వృద్ధిరేటు మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇక్కడో సందేహం కలుగుతుంది. దేశంలోని మిగిలిన విమానాశ్రయాలకు తగలని దెబ్బలు మనకే ఎక్కువగా తగులుతున్నాయి? అన్నది ఒకటైతే.. హైదరాబాద్ మహానగరానికి ఉన్న కొన్ని పరిమితులు కూడా తాజా పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు. దేశంలోని టాప్ 5 విమానాశ్రయాల జాబితాను చూస్తే.. మొదటి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుంది. రెండో స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ముంబయి), మూడో స్థానంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు), నాలుగో స్థానంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్), ఐదో స్థానంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చెప్పొచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేశంలోని టాప్ 5 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మూడు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే ఉండటం.

దేశంలోని మొత్తం అంతర్జాతీయ ప్రయాణాల్లో టాప్ 5 స్థానాల్లోని విమానాశ్రయాల నుంచి రాకపోకలు 55-70 శాతం వరకు ఉంటాయి. అత్యధికంగా రోజుకు 140-150 విమానాలు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు పయనిస్తుంటాయి. ముంబయి నుంచి 110-120 విమానాలు, బెంగళూరు నుంచి 45-55 , హైదరాబాద్ నుంచి 35-42, చెన్నై నుంచి 40-46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిజానికి చెన్నైతో పోలిస్తే హైదరాబాద్ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే విమానాలు తక్కువే అయినప్పటికి.. వృద్ధిరేటులో మాత్రం ముందు ఉండటమే హైదరాబాద్ టాప్ 4 స్థానంలో నిలవటానికి కారణం.

కరోనా ముందు వరకు మాంచి జోరు మీద ఉన్న విమానయానం.. మహమ్మారి పుణ్యమా అని ఒక్కసారిగా చతికిలపడింది. కరోనా తర్వాత చాలా వేగంగా కోలుకున్న ఎయిర్ పోర్టుల్లో హైదరాబాద్ ఒకటి. 2022-23లో 34.2 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణాలు చేశారు. ఆ తర్వాతి ఏడాది అంటే 2023-24లో ఏకంగా 41.5 లక్షల మంది ప్రయాణికులు రికార్డు స్థాయిలో రాకపోకలు సాగించారు. 2024-25లో 44.8 లక్షల మంది ప్రయాణించారు. 2022-23తో పోలిస్తే 2023-24లో నమోదైన వృద్ధిరేటుతో పోలిస్తే 2024-25లో తగ్గిన పరిస్థితి.

ఇంతవరకు బాగానే ఉన్నా.. 2025 ద్వితీయార్థం నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతున్న పరిస్థితి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అమెరికా నుంచి వచ్చే మనోళ్లు వీలైనంత వరకు ప్రయాణాల్ని తగ్గించుకున్న పరిస్థితి. అక్కడితో అయిపోలేదు. ఈ ఏడాది మొదలైన అమెరికా - ఇరాన్ యుద్దం హైదరాబాద్ ఎయిర్ పోర్టు రాకపోకల మీద పిడుగు మాదిరి పడిందని చెప్పాలి. ఒక పోలికతో ఎంత ప్రభావాన్ని చూపిందో ఇట్టే అర్థమవుతుంది. చాలామంది అమెరికా నుంచి మనోళ్లు రాకపోవటం వల్లే శంషాబాద్ కు ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లు చెప్పినా.. వాస్తవం మాత్రం మరోలా ఉంది.

గత ఏడాది (2025) జనవరి -జూన్ మధ్య కాలంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి దాదాపు 21 లక్షలమంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. అంటే.. నెలకు సగటున 3.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ప్రయాణికుల రద్దీ నెలకొంది. అందుకు భిన్నంగా ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య సుమారు 19.5 లక్షల నుంచి 20 లక్షల మధ్యకు పరిమితమైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో కేవలం 3.4 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగించారు.

గత ఏడాదితో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు కనిపించినా.. లోతుల్లోకి వెళితే అసలు విషయం అర్థమవుతుంది. అదేమంటే.. ఏడాదికి ఏడాదికి పెరిగే ప్రయాణికుల సంఖ్య లేకపోగా.. కనీసం రావాల్సిన వారు రాకపోవటం చూస్తే.. డబుల్ షాక్ గా చెప్పాలి. అదే సమయంలో దేశంలోని టాప్ 5 విమానాశ్రయాల్లో వృద్ధిరేటు ఒక మోస్తరుగా అయినా నమోదు అవుతుంది కదా (చెన్నైను మినహాయిస్తే) అన్నది చూసినప్పుడు.. హైదరాబాద్ విమానాశ్రయం నష్టజాతకుడిగా ఎందుకు మారిందో అర్థమవుతుంది.

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఎఈ)..బ్రిటన్.. అమెరికా.. థాయిలాండ్.. సౌదీలకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు ఎక్కువ. అదే సమయంలో బెంగళూరు..చెన్నై విమానాశ్రయాల నుంచి యూఎఈ, సింగపూర్, మలేషియా, బ్రిటన్, ఖతార్, శ్రీలంక దేశాలకు వెళ్లే విమానాలు ఎక్కువ. కానీ.. హైదరాబాద్ విషయానికి వస్తే యూఎఈ, సౌదీ, ఖతార్, ఒమన్, సింగపూర్ దేశాలకు మాత్రమే నేరుగా వెళ్లే సర్వీసులు ఉన్నాయి. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గల్ఫ్ ప్రాంతం మీదా ప్రభావం చూపటంతో పాటు.. పెద్ద ఎత్తున సర్వీసులు నిలిచిపోవటం.. ప్రయాణాలు వాయిదా వేసుకోవటం లాంటి కారణాలతో హైదరాబాద్ ఎయిర్ పోర్టు ప్రయాణికుల్ని తరలించే రేసులో వెనుకబడింది. హైదరాబాద్ నుంచి వెళ్లే మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల్లో 70 శాతం యూఎఈ, ఖతార్, సౌదీ లాంటి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లేవారే. ఇరాన్ యుద్దం పుణ్యమా అని ఆయా దేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గటంతో హైదరాబాద్ ఎయిర్ పోర్టు మీద ప్రభావం పడింది. దేశంలోని మిగిలిన టాప్ ఎయిర్ పోర్టులలో పరిస్థితి అందుకు భిన్నం. యుద్ధ పరిణామాల కారణంగా రెండు అంకెల స్థాయిలో ప్రయాణికుల్ని హైదరాబాద్ ఎయిర్ పోర్టు కోల్పోయింది. ఇక్కడి నుంచి 70 శాతం ట్రాఫిక్ కేవలం పశ్చిమాసియా మార్గాల మీదనే ఆధారపడి ఉండటం ఒక ప్రధాన కారణంగా చెప్పాలి.

అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. కానీ.. ప్రభావం మాత్రం మిడిల్ ఈస్ట్ దేశాల్లోని పరిస్థితులే హైదరాబాద్ ఎయిర్ పోర్టు వెనుకబడటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అదే సమయంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికా.. ఐరోపా దేశాలకు డైరెక్టు ఫ్లైట్లు లేకపోవటం కూడా ఒక ప్రధాన కారణం.విమానాల కొరతతో పాటు.. అంతర్జాతీయ గమ్యస్థానాలకు చేర్చే విమానాల సామర్థ్యం ఎయిరిండియాకు ఉండటం.. ఆ సంస్థ హైదరాబాద్ కు ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి. భారతదేశానికి వచ్చే విదేశీయుల్లో ఎక్కువమంది తొలుత ఢిల్లీ.. ముంబయిలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకు తగ్గట్లే విమానయాన సంస్థలతో పాటు.. అంతర్జాతీయ విమానయాన సర్వీసులు కూడా వాటి ప్రాధాన్యత ఢిల్లీ.. ముంబయిలకే ఇస్తుంటారు.

ఇలా కర్ణుడి చావుకు సవాలచ్చ కారణాలు అన్నట్లుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రాకపోకల తగ్గుదలకు అంతర్జాతీయ అంశాలతో పాటు.. లాజిస్టిక్ ఇష్యూలు కూడా కీలకంగా మారాయి. అయితే.. రానున్న ఐదు-పదేళ్ల కాలంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టు పరిస్థితిలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పకతప్పదు. రానున్న కొద్ది నెలల్లో ఎయిరిండియా, ఇండిగో సంస్థలు కొత్తగా కొనుగోలు చేసే పెద్ద విమానాలు భారత్ కు రానున్నాయి. వీటిల్లో కొన్నింటిని హైదరాబాద్ నుంచి సర్వీసులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. అప్పటివరకు కాస్తంత వెయిట్ చేయకతప్పని పరిస్థితి.

అమెరికా - ఇరాన్ మధ్య జరుగుతున్నయుద్ధం, అగ్రరాజ్యంలో ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న విదేశాంగ విధానాలు కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్టు మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. యూఎస్ జారీ చేసే హెచ్1బీ వీసాల పొడిగింపు, దాని స్టేటస్ మార్పు కోసం అప్లికేషన్ పెట్టుకున్న ఐటీ ఉద్యోగులు ఇప్పుడు భారతదేశానికి రావటానికి వెనకడుగువేస్తున్నారు. దేశానికి వచ్చిన తర్వాత వీసా స్టాంపింగ్ ఇష్యూలు తలెత్తితే ప్రమాదం పొంచి ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా దేశానికి రాని పరిస్థితి. వీసా రూల్స్ కఠినంగా మారుతున్న వేళ..చాలామంది ఎన్ఆర్ఐలు గతంలో మాదిరి ఏడాదికి ఒకసారి దేశానికి వచ్చే అలవాటును తగ్గించుకున్నారు. ఇది కూడా హైదరాబాద్ ఎయిర్ పోర్టు ట్రాఫిక్ మీద పడింది.

హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. అక్కడి విద్యా విధానంలో వచ్చిన మార్పుల కారణంగా తెలుగు విద్యార్థులు ఎంతో అవసరమైతే తప్పించి అమెరికాను ఎంపిక చేసుకోవటం లేదు. ఈ కారణంగానే ఈ ఏడాది జూన్, జులై అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకునే వారి సంఖ్య మీద ప్రభావం పడింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మారటం.. ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో బిజినెస్ ట్రావెల్ ను బాగా తగ్గించింది. ఇది కూడా హైదరాబాద్ విమానాశ్రయ ట్రాఫిక్ మీద ప్రభావాన్ని చూపిన పరిస్థితి. ఇలా ఎన్నో కారణాలు హైదరాబాద్ ఎయిర్ పోర్టును నష్టజాతకుడిగా మార్చాయి. అయితే.. ఇదేమీ దీర్ఘకాలం కొనసాగదని చెప్పాలి. కాలం పెట్టే పరీక్షలో హైదరాబాద్ నెగ్గటం ఖాయం. కాకుంటే.. అందుకు కొంత సమయం తీసుకుంటుందంతే.

Tags:    

Similar News