పార్ల‌మెంటులో కూడా వైసీపీని వ‌ద‌ల్లేదు.. !

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ముగిశాయి. సుమారు 20 రోజుల పాటు సాగిన స‌మావేశాల తీరు వాయిదాల పర్వంగా ముగిసింది.

Update: 2026-08-14 17:30 GMT

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ముగిశాయి. సుమారు 20 రోజుల పాటు సాగిన స‌మావేశాల తీరు వాయిదాల పర్వంగా ముగిసింది. అయితే.. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 25మంది ఎంపీల ప‌నితీరు ఎలా ఉంది? ముఖ్యంగా టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ ఎంపీల దూకుడు.. ఈ స‌భ‌లో ఎలా క‌నిపించింది? అనేది ఇంపార్టెంట్‌. ఎందుకంటే.. రాష్ట్రంలో పార్టీ పుంజుకుందా? లేదా? గ్రాఫ్ ఎలా ఉంది? అని చెప్ప‌డానికి పార్ల‌మెంటులో అనుస‌రించే వ్యూహాలే కీల‌కంగా మారుతున్నాయి. దీంతో తాము పుంజుకుంటున్నామ‌ని చెబుతున్న వైసీపీ పార్ల‌మెంటులో ఎలా వ్య‌వ‌హరించింద‌న్న‌ది ముఖ్యం.

అలానే.. కూట‌మికి నేతృత్వం వ‌హిస్తున్న టీడీపీ కూడా పార్ల‌మెంటులో పైచేయి కోసం ప్ర‌య‌త్నిస్తోంది. స‌క్సెస్ కూడా అవుతోంది. అలానే.. ఈ సారి వ‌ర్షాకాల స‌మావేశాల్లో వైసీపీ స‌భ్యులు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. కానీ, అవి పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని అంటున్నారు. రాష్ట్రంలో వ‌స్తున్న పెట్టుబ‌డుల‌పై సంధించిన ప్ర‌శ్న‌కు.. కేంద్రం వాస్తవాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో వైసీపీకి టీడీపీని విమ‌ర్శించే అవ‌కాశం లేకుండా పోయింది. అస‌లు పెట్టుబడులే రావ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తూ.. వ‌చ్చిన వైసీపీకి పార్ల‌మెంటు వేదిక‌గా స‌మాధానం వ‌చ్చేసింది.

ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హారం కూడా వైసీపీకి ఇబ్బంది పెట్టింది. అమ‌రావ‌తిని ఎప్ప‌టికి పూర్తి చేస్తారు? అ న్న విష‌యంపై కేంద్ర‌మే స‌మాధానం ఇచ్చింది. 2028 నాటికి తొలిద‌శ పూర్తి అవుతుంద‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నా ర్హం. ఇక‌, పంట‌లకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను కూడా ప్ర‌శ్నించిన వైసీపీ.. ఈ విష‌యంలోనూ ఇర‌కాటంలో చిక్కుకుంది. పంట‌ల‌కు దేశవ్యాప్తంగా అమ‌ల‌వుతున్న విధానాలే ఉన్నాయ‌ని పేర్కొంది. దీంతో వైసీపీ వేసిన ఎత్తుగ‌డ పార‌లేదు.

ఇదేస‌మ‌యంలో వైసీపీకి రాజ్య‌స‌భ‌లో షాకుల‌పై షాకులు త‌గులుతున్నాయ‌న్న‌ది వాస్త‌వం. యువ ఎంపీ, ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్టిన విజ‌య్‌.. త‌న ప‌దునైన వ్యాఖ్య‌లు, ప్ర‌శ్న‌ల‌తో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఆయ‌న చేసిన కామెంట్లు జ‌గ‌న్‌కు బాగానే త‌గిలాయ‌ని చెప్పాలి. జ‌గ‌న్ కేసులు స‌హా.. అమ‌రావ‌తి, మావిగ‌న్‌ అంశాల‌ను ప్ర‌స్తావించిన విజ‌య్ వైసీపీకి వాయిస్ లేకుండా చేశారు. మ‌రోవైపు.. గ‌తంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ ఎంపీలు ఈద‌ఫా వెనుక‌బ‌డ్డార‌నే చెప్పాలి. టీడీపీ కూట‌మి ఎంపీలు చాలావ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో వైసీపీ ఈ సారి పైచేయిసాధించ‌లేక పోయింది.

Tags:    

Similar News