మంత్రులకు చంద్రబాబు బిగ్ టాస్క్.. అసెంబ్లీ సమావేశాలకు పక్కా ప్లానింగ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు పకడ్బందీ వ్యూహరచన చేయాలని, విపక్షం వైసీపీని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Update: 2026-08-14 19:30 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు పకడ్బందీ వ్యూహరచన చేయాలని, విపక్షం వైసీపీని సమర్థంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు జరగనుండగా మెగా డీఎస్సీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షం నిర్ణయించుకుంది. దీంతో ప్రభుత్వం కూడా దీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను ఆదేశించినట్లు చెబుతున్నారు. మెగా డీఎస్సీ పారదర్శకంగా జరిగిందని చెబుతున్నా, విపక్షం రాజకీయంగా యాగీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఉందని సీఎం భావిస్తున్నారని అంటున్నారు.

విపక్షం వ్యూహాన్ని అసెంబ్లీ, మండలిలో చిత్తుచేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం గతంలో చోటుచేసుకున్నాయని చెబుతున్న గ్రూప్-1 అక్రమాలను చర్చకు తీసుకురావాలని భావిస్తోందని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు మూడుసార్లు మూల్యాంకనం జరిగిందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. దీనిపై సిట్ విచారణ పూర్తికావడం, పది వేల పేజీలతో కోర్టుకు నివేదిక సమర్పించిందని చెబుతున్నారు.

డీఎస్సీలో అక్రమాలు అంటూ రచ్చ చేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలంటే, గ్రూప్-1 పరీక్షలను చర్చకు తీసుకురావాలని ముఖ్యమంత్రితో సహా మంత్రులు అంతా భావిస్తున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరయ్యే పరిస్థితి లేనందున మండలి సమావేశాల్లో వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మంత్రులు ఎదురుదాడి చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. ప్రధానంగా రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న కథనాలు ఆధారంగా గ్రూప్-1 అక్రమాలపై సమాచారం తెప్పించుకోవాలని సీఎం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని రెండు రోజులుగా పత్రికల్లో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రూప్-4 ఉద్యోగులు, గృహిణులతో మూల్యాంకనం చేయించారని, అనుమతి లేకుండా వాల్యుయేషన్ జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయని అంటున్నారు. ఈ అంశాలపై మంత్రులతో చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభ జరిగిన అన్నిరోజులు ఈ అంశంపైనే ఎక్కువ ఫోకస్ చేయాలని, వైసీపీ సమాధానం కోసం పట్టుబట్టాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే అసెంబ్లీకి అధికార, విపక్షాలు సకల అస్త్రాలతో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News