దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. భారత్ చేతికి రహస్యాలు!

అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తొలగించాలన్న భారత్ ప్రయత్నాల్లో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది.;

Update: 2026-04-28 09:28 GMT

అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తొలగించాలన్న భారత్ ప్రయత్నాల్లో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడిభుజంగా పిలవబడే సలీమ్ డోలాను తుర్కియే నుండి భారత్‌కు రప్పించడం అనేది సామాన్య విషయం కాదు. ఇది భారత గూఢచారి సంస్థల దౌత్యనీతికి మరియు పట్టుదలకు నిదర్శనం.

దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తాజాగా ఒక భారీ విజయాన్ని అందుకుంది. దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డి-కంపెనీ’ విదేశాల్లో నిర్వహించే మాదకద్రవ్యాల వ్యాపారానికి గుండెకాయ వంటి సలీమ్ డోలాను ఇస్తాంబుల్‌లో అదుపులోకి తీసుకొని, భారత్‌కు తీసుకురావడం అంతర్జాతీయ నేర ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. మంగళవారం (ఏప్రిల్ 28, 2026) తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న డోలాను చూస్తుంటే, డ్రగ్ మాఫియా పతనం మొదలైందని అర్థం చేసుకోవచ్చు.

సలీమ్ డోలా ఎవరు? ‘డీ’లో పాత్ర..

సలీమ్ డోలా కేవలం స్మగ్లర్ మాత్రమే కాదు.., ఒక వ్యూహకర్త. ఏడాదికి సుమారు రూ. 5,000 కోట్ల విలువైన డ్రగ్స్ వ్యాపారాన్ని డోలా పర్యవేక్షిస్తున్నాడని అధికారుల అంచనా. ఈ సొమ్మును డీ-కంపెనీ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా వాడుతున్నట్లు సమాచారం. దుబాయ్, పాకిస్తాన్, తుర్కియే, ఐరోపా దేశాల మధ్య డ్రగ్స్ రవాణా చేసే సిండికేట్‌ను ఇతను నడిపిస్తున్నాడు. సింథటిక్ డ్రగ్స్ నుంచి హెరాయిన్ వరకు అన్ని రకాల మాదకద్రవ్యాలను భారత్‌లోకి పంపడంలో ఇతను కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

ఆపరేషన్ ఇస్తాంబుల్

డోలాను పట్టుకోవడం కోసం భారత్ దర్యాప్తు సంస్థలు కొన్ని నెలలుగా స్కెచ్ వేస్తున్నాయి. దుబాయ్‌లో సలీమ్ సోహైల్ షేక్ అరెస్ట్ అవ్వడం ఈ నెట్‌వర్క్ గుట్టు విప్పడానికి మొదటి మెట్టు అయ్యింది. గతేడాది జూన్‌లో డోలా కుమారుడు తాహెర్ యూఏఈలో దొరకడం మరో మలుపు. తాహెర్‌ను భారత్‌కు రప్పించి విచారించడంతో, సలీమ్ డోలా తుర్కియేలో తలదాచుకున్నాడనే పక్కా సమాచారం లభించింది. భారత ప్రభుత్వం తుర్కియే అధికారులతో దౌత్యపరంగా చర్చలు జరిపి, రెడ్ కార్నర్ నోటీస్ ఆధారంగా అతడిని అప్పగించేలా ఒప్పించింది.

భారత్‌కు ప్రయోజనాలు..

సలీమ్ డోలా కస్టడీలోకి రావడం వల్ల దర్యాప్తు సంస్థలకు అనేక విషయాలు తెలియనున్నాయి. పాకిస్తాన్‌లో దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉంటున్నాడు? అతడికి సహకరిస్తున్న స్థానిక శక్తులు ఏంటి? అనే అంశాలపై డోలా నోరు విప్పే అవకాశం ఉంది. సముద్ర మార్గం, వాయు మార్గం ద్వారా భారత్‌లోకి డ్రగ్స్ ఏయే పాయింట్ల నుంచి వస్తుందో తెలిస్తే, సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయవచ్చు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన సొమ్మును ఎలా మనీ లాండరింగ్ చేస్తున్నారో కనిపెట్టడం ద్వారా డీ-కంపెనీ ఆర్థిక మూలాలను దెబ్బతీయవచ్చు.

విదేశాల్లో దాక్కుంటే తమను ఎవరూ ఏమీ చేయలేరని భావించే నేరగాళ్లకు సలీమ్ డోలాను అదుపులోకి తీసుకోవడం బలమైన హెచ్చరిక అనే చెప్పాలి. ముంబయి పోలీసులు, ఎన్సీబీ సంయుక్తంగా చేసే విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మాదకద్రవ్యాల నుంచి దేశాన్ని రక్షించడంలో మైలురాయిగా నిలుస్తుంది.

Tags:    

Similar News