శ‌ర్మ‌గారి 'కోట‌'లో బీజేపీ 'మూడోసారి'!?

అంతేకాదు.. ప‌క్కా హిందూత్వ‌ను పుణికిపుచ్చుకున్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు అనేక మార్లు వివాదాల‌కు కేంద్రంగా మారాయి.;

Update: 2026-03-20 05:30 GMT

కొంత‌మంది నాయ‌కుల‌కు పార్టీల‌తో ప‌నిలేదు.. వారి పేరే బ్రండ్. వారి మాటే బ్రాండ్‌. ఇలాంటి నాయ‌కుల్లో ఒక‌రు అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ‌. పూర్వాశ్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కుడిగా ఎదిగిన శ‌ర్మ‌.. త‌ర్వాత కాలంలో బీజేపీ పంచ‌న చేరారు. ఈ క్ర‌మంలోనే ప‌దేళ్ల కింద‌ట ఆయ‌న ఈశాన్య రాష్ట్రం అస్సాంకు ముఖ్య‌మంత్రి అయ్యారు. నిజానికి ఆర్ ఎస్ ఎస్‌, బీజేపీల నుంచి పుట్టిన నాయ‌కుల‌కంటే కూడా.. ఎక్కువ‌గా కాంగ్రెస్‌పై యుద్ధం చేయ‌డంలో శ‌ర్మ‌కు మంచి పేరుంది.

అంతేకాదు.. ప‌క్కా హిందూత్వ‌ను పుణికిపుచ్చుకున్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు అనేక మార్లు వివాదాల‌కు కేంద్రంగా మారాయి. ఇక‌, కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఒక‌ప్ప‌టి మిత్రుడు రాహుల్‌గాంధీని కార్న‌ర్ చేయ‌డంలోనేకాదు.. ఆయ‌న‌ను తూర్పార బ‌ట్టడంలోనూ .. శ‌ర్మ‌కు శ‌ర్మే సాటి అని అనిపించుకున్నారు. ఈ ఫైరే.. రాష్ట్రంలో రెండోసారి కూడా (ఐదేళ్ల కింద‌ట‌) బీజేపీని అధికారంలోకి తీసుకువ‌చ్చింది. అంతే కాదు.. స‌హ‌జంగా అస్సాంలో ఉన్న అనేక ఉద్య‌మాల‌ను కూడా ఆయ‌న త‌న‌దైన శైలిలో అణిచేశారు.

ఇక‌, ఇప్పుడు మూడోసారి ముచ్చ‌ట‌గా.. శ‌ర్మ‌గారి నాయ‌క‌త్వంలో అస్సాంలో బీజేపీ ఎన్నిక‌ల‌కు వెళ్తోంది. ఆయ‌న‌పై క‌మ‌ల నాథులు చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఇత‌ర రాష్ట్రాల్లో ఉచితాలు ఇచ్చి.. గెలుపు గుర్రం ఎక్కేందుకు పాల‌క పార్టీలు ప్ర‌య‌త్నిస్తుంటే.. శ‌ర్మ‌గారు దీనికి భిన్నంగా రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో అభివృద్ధి+సంక్షేమాన్ని క‌మ‌ల నాథులు క‌ల‌వ‌రిస్తున్నారు. కానీ, ఇక్క‌డ మాత్రం అభివృద్ధి మాటే త‌ప్ప‌.. సంక్షేమానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌రు.

అంతేకాదు.. ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న‌ట్టే పెట్టుబ‌డులకు ప్రాధాన్యం ఇస్తారు. మ‌రీ ముఖ్యంగా అభివృద్ధే మంత్రంగా హిమంత బిశ్వశర్మ నేతృత్వంలో బీజేపీ మూడోసారి కూడా అధికారంలో కి వ‌చ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు.. ప్ర‌తిప‌క్షాలకు మింగుడు ప‌డ‌డం లేదు. ఎందుకంటే.. అస్సాంలో ముఖ్య‌మంత్రి ఎవ‌రు? అని ఎవ‌రిని అడిగినా.. శ‌ర్మ పేరే వినిపిస్తోంది. తాజాగా చేసిన స‌ర్వేలోనూ.. శ‌ర్మ 79 శాతం మార్కులు సంపాయించుకున్నారు. ఇదిలావుంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మ‌కంగానే అడుగులు వేస్తోంది.

మాజీ సీఎం గౌరవ్‌ గొగోయ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా.. ఉచితాల‌కు కాకుండా.. క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌ల‌పై ఎక్కువగా దృష్టి పెడుతోంది. నిరుద్యోగం, సీఏఏ వంటి అంశాలతో ప్రజల మద్దతు కోరుతోంది. 126 స్థానాలు ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే పెద్ద‌ది. ఇక్క‌డ ఏప్రిల్‌ 9న పోలింగ్‌ జరగనుంది. అయితే.. ఈ సారి కూడా శ‌ర్మ మంత్రాంగ‌మే ఫ‌లిస్తుంద‌ని స‌ర్వేలు చాటుతున్నాయి. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News