నామినేటెడ్ కసరత్తు మొదలైందా ?
ప్రయారిటి బేసిస్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది;
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొందరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. పార్టీ గెలుపుకు బాగా కష్టపడిన నేతల పేర్లను జిల్లాల వారీగా రెడీ చేయమని రేవంత్ రెడ్డి నుండి పార్టీలోని ముఖ్య నేతలకు ఆదేశాలు అందినట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ పోస్టులతో పాటు జిల్లాల స్ధాయిలో భర్తీకి అవకాశమున్న కార్పొరేషన్లు, వాటిలో డైరెక్టర్ పోస్టులు చాలా ఉన్నాయి.
ప్రయారిటి బేసిస్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. ముందు రాష్ట్రస్ధాయి కార్పొరేషన్లను భర్తీచేసి తర్వాత జిల్లాల స్ధాయిలో నియామకాలను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ భర్తీ ప్రక్రియలో కూడా కాంగ్రెస్ కు అత్యధిక సీట్లను అందించిన జిల్లాల వారీగా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం చూస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని నేతలకే మెజారిటి పదవులు అందే అవకాశాలున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కు వచ్చిన 64 సీట్లలో పై మూడు జిల్లాలదే మేజర్ పాత్ర కాబట్టి.
పై మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పాలి. ఈ మూడు జిల్లాల నుండి గట్టి దెబ్బ పడటం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. అందుకనే మరే జిల్లాకు దక్కనట్లుగా ఖమ్మం జిల్లాకు మూడు మంత్రిపదవులు దక్కాయి. జిల్లాలో పదిసీట్లుంటే కాంగ్రెస్ తొమ్మిది నియోజకవర్గాల్లో గెలిచింది. పదో నియోజకవర్గంలో బీఆర్ఎస్ బొటాబొటిగా గెలిచింది. లేకపోతే పదికి పదీ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసుండేదే
తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ స్వీప్ చేయాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు. అది జరగాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడినట్లే నేతలంతా ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్, బీజేపీలపై పోరాటం చేయాల్సుంటుంది. ఎలాగూ అధికారంలోనే ఉన్నారు కాబట్టి, నెలరోజుల పాలనలో ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు అందుకుంటుందనే అనుకుంటున్నారు. అందుకనే పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకనే ఇపుడు జాబితాలు రెడీ చేయిస్తున్నారు.