ఆర్టీసీ డ్రైవర్లను కబళిస్తున్న గుండెపోటు! ప్రమాదకర సంఖ్యలో అంకెలు

ఆర్టీసీలో డ్రైవర్ల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడేళ్ల వ్యవధిలో ఒక్క ఏపీలోనే సుమారు 900 మంది డ్రైవర్లు ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.;

Update: 2026-02-16 14:30 GMT

ఆర్టీసీలో డ్రైవర్ల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడేళ్ల వ్యవధిలో ఒక్క ఏపీలోనే సుమారు 900 మంది డ్రైవర్లు ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఈ అంకెలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయని అంటున్నారు. అంతేకాకుండా గుండెపోటుకు గురైన వారిలో ఎక్కువ మంది విధి నిర్వహణలో ఉంటూ స్టీరింగుపైనే వాలిపోతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలు ప్రయాణికులను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు గుండెపోటుకు గురైన డ్రైవర్ల కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. అదే జరగరానిది జరిగితే ఆ ఊహే భయపెట్టేదిగా ఉంటోందని అంటున్నారు.

ఆర్టీసీలో డ్రైవర్ల మరణాలు సంస్థను కూడా తీవ్ర కుదుపునకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో గుండెపోట్లు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోవడంపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. డ్రైవర్ల సంక్షేమం, ఆరోగ్యంపై ఉదాసీనంగా వ్యవహరిస్తే సంస్థకు తీవ్ర నష్టమని హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ రథసారథులుగా కీర్తి పొందిన డ్రైవర్లు ఆకస్మిక మరణాలకు ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. పని ఒత్తిడి, నిద్ర లేమి, కాలం చెల్లిన బస్సులు, సరైన వైద్య పరీక్షలు లేకపోవడం డ్రైవర్లకు పెను సవాల్ గా మారింది. ఈ కారణాలతో డ్రైవర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతూ గుండెపోటు బారిన పడుతున్నట్లు కార్మిక నేతలు చెబుతున్నారు.

ఏటా 250 నుంచి 350 మంది వరకు డ్రైవర్లు గుండెపోటుతో మరణిస్తున్నట్లు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పని ఒత్తిడి, నిద్రలేమి, విధి నిర్వహణలో తీసుకుంటున్న ఆహారమే అంటున్నారు. ఆర్టీసీలో డ్రైవర్ల నియామకం లేకపోవడంతో ఉన్నవారితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. డ్రైవర్ల కొరత వల్ల బ్యాక్ టు బ్యాక్ డ్యూటీలు చేయడం, అవిశ్రాంతంగా విధులకు హాజరుకావడం, స్రీశక్తి వంటి పథకాలతో రద్దీ పెరిగిపోవడం డ్రైవర్లకు భారంగా మారుతోందని అంటున్నారు. ఇదే సమయంలో సమయపాలన పక్కాగా పాటించాల్సిన రావడం కూడా డ్రైవర్లకు నరకప్రాయంగా మారిందని అంటున్నారు.

ఆర్టీసీలో క్షేత్రస్థాయిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్ల పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. ఆక్యుపెన్సీ పెంచాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో క్షేత్రస్థాయిలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు సతమతమవుతున్నారని అంటున్నారు. ఇకదూర ప్రాంత సర్వీసులు నడిపే డ్రైవర్లకు గమ్యస్థానాల్లో విశ్రాంతి తీసుకోడానికి కూడా సమయం ఇవ్వడం లేదని, సమయం ఉన్నచోట సరైన వసతులు ఉండటం లేదని చెబుతున్నారు. దీనితో డ్రైవర్లు శారీరకంగా బాగా అలసటకు గురై ఆరోగ్యం పాడుచేసుకుంటున్నట్లు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు ఏపీలో ప్రస్తుతం ఉన్న బస్సుల్లో సగానికి పైగా కాలం చెల్లిన బస్సుల వల్ల డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్యూటీకి వెళ్లిన తర్వాత బస్సు ఎక్కడ ఆగిపోతుందో? గమ్యస్థానానికి క్షేమంగా చేరుకుంటామో లేదో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎక్కువ మంది డ్రైవర్లు రిటైర్మెంట్ వయసుకు దగ్గర పడటం, ఇప్పటికే రెండు సార్లు రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల కూడా ఒత్తిడి ఎక్కువగా ఉందని అంటున్నారు. వయోభారంతో చాలా మంది గుండెపోటుకు గురవుతున్నట్లు చెబుతున్నారు. 2011 తర్వాత డ్రైవర్ల రిక్య్రూట్మెంట్ నిలిపివేయడంతో ఉన్నవారిపైనే ఎక్కువ భారం పడుతోందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది డ్రైవర్లు విధి నిర్వహణలో ఉంటుండగానే స్టీరింగ్ పై వాలిపోతున్నట్లు చెబుతున్నారు. రవాణా, కార్మిక నిబంధనల ప్రకారం ప్రయాణికుల బస్సులను నడిపే డ్రైవర్లకు నిర్దిష్య వ్యవధిలో వైద్య పరీక్షలు నిర్వహించాల్సివుంటుంది. కంటిచూపు, వినికిడి, శారీరక, మానసిక సమస్యలతోపాటు గుండె ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షించాల్సివుంటుంది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం 45 ఏళ్లలోపు వారికి రెండేళ్లకు ఒకసారి, ఆపై వయసు వారికి ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ డ్రైవర్ల మరణాలను అరికట్టలేకపోవడం ఆందోళనకు కారణమవుతోంది.

Tags:    

Similar News