'ప్రేమ వివాహంపై పెద్దలకు సమాచారం..' ప్రభుత్వం నిర్ణయం కొత్త చర్చకు దారి!

సనాతన ధర్మం ఉన్న భారత్ లో ప్రేమ వివాహాలు అనేవి చాలా తక్కువ. పెద్దల కుదిర్చిన వివాహంతోనే జంట ప్రేమలో పడడం ఆనవాయితీ.;

Update: 2026-02-21 11:56 GMT

సనాతన ధర్మం ఉన్న భారత్ లో ప్రేమ వివాహాలు అనేవి చాలా తక్కువ. పెద్దల కుదిర్చిన వివాహంతోనే జంట ప్రేమలో పడడం ఆనవాయితీ. కానీ కాలం మరుతున్నా కొద్దీ యువతీ యువకుల మధ్య ఆకర్షణ పెరగడం ఇది ప్రేమకు దారి తీయడం పెద్దలు ఒప్పుకోకుంటే రిజిస్ట్రర్ మ్యారేజ్ తీసుకోవడం ఇదంతా కామన్ గా జరుగుతుంది. ప్రేమ వివాహాలు ఇప్పుడు భారత సమాజంలో అరుదైన విషయం కాదు. యువత తమ జీవిత భాగస్వామిని స్వయంగా ఎంపిక చేసుకోవడం సాధారణ ప్రక్రియగా మారుతోంది. అయితే ఈ స్వేచ్ఛకు సమాంతరంగా కుటుంబాల ఆందోళనలు, అపార్థాలు, తప్పుడు సమాచారం ఆధారంగా జరిగే వివాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

రిజిస్ట్రర్ మ్యారేజ్ లో కొత్త రూల్స్..

గుజరాత్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో మార్పులు చేస్తూ, ప్రేమ వివాహం చేసుకునే జంట తమ పెద్దలకు సమాచారం ఇచ్చినట్టు డిక్లరేషన్ తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెళ్లికి దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా అమ్మాయి తల్లిదండ్రులకు అప్లికేషన్ ప్రతిని అధికారులు స్వయంగా షేర్ చేయాలనే నియమం కూడా చేసింది. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘ్వీ తెలిపారు. తప్పుడు సమాచారం, మోసపూరిత వివరాలతో వివాహాలు జరగకుండా ఉండేందుకే ఈ మార్పులు చేసినట్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో యువతీ యువకులు తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబ వివాదాలు, చట్టపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముందుగానే సమాచారం ఉంటే అనవసర అపోహలు తగ్గుతాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

భిన్నాభిప్రాయాలు..

అయితే ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వర్గం దీనిని కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే చర్యగా చూస్తోంది. పెళ్లి అనేది కేవలం ఇద్దరి మధ్య ఒప్పందం కాదు.. రెండు కుటుంబాల కలయిక అనే భావన భారతీయ సమాజంలో ఆది నుంచి బలంగా ఉంది. పెద్దలకు ముందుగానే సమాచారం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చని వారు అంటున్నారు. మరోవైపు, వ్యక్తిగత స్వేచ్ఛపై ఇది ప్రభావం చూపుతుందనే విమర్శలు లేకపోలేదు. వయోజనులైన వ్యక్తులు తమ జీవిత నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందేనదే. అలాంటి సందర్భంలో పెద్దలకు సమాచారం తప్పనిసరి చేయడం వ్యక్తి గత గోప్యతకు విరుద్ధమని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ వ్యతిరేకత, హానర్ క్రైమ్ భయం ఉన్న సందర్భాల్లో ఈ నిబంధన యువజంటల భద్రతపై ప్రభావం చూపుతుందా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ప్రేమ, కుటుంబం, చట్టం ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించడం సవాలే. గుజరాత్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత వాటి ప్రభావం స్పష్టం అవుతుంది. తప్పుడు సమాచారంతో జరిగే వివాహాలను అడ్డుకోవడం అవసరమే. కానీ అదే సమయంలో వయోజనుల స్వేచ్ఛ, భద్రత కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.

దేశంలో మరోసారి చర్చ..

మొత్తానికి, ఈ నిర్ణయం ప్రేమ వివాహాల చుట్టూ మరోసారి దేశవ్యాప్త చర్చను రేకెత్తించింది. సంప్రదాయం-ఆధునికత మధ్య సాగే ఈ చర్చలో సమాజం ఎటువైపు మలుపు తిరుగుతుందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రేమ వివాహాల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందా..? లేక యువతలో భయాందోళనలు పెరుగుతాయా..? అన్నది పరిశీలించాల్సిన అంశం. కుటుంబాల అనుమతి లేకుండా జరిగే వివాహాలపై తరచూ చట్టపరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. ముందుగానే సమాచారం ఇవ్వడం ద్వారా ఈ వివాదాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి కుటుంబ పరిస్థితి ఒకేలా ఉండదు. కొన్ని సందర్భాల్లో పెద్దల వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కూడా ఉంటుంది.

ప్రేమ, విశ్వాసం, స్వేచ్ఛ ఇవి ఆధునిక సమాజం విలువలు. అదే సమయంలో కుటుంబ బంధాలు, పరస్పర గౌరవం కూడా భారతీయ సమాజంలో అంతర్భాగం. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే అసలు సవాల్. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక ప్రయోగంగా చూడవచ్చు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం.. ప్రేమ వివాహాలపై చట్టపరమైన చర్చ ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది.

Tags:    

Similar News