పిల్లలు విదేశాల్లో.. పెద్దలు పల్లెల్లో.. ఒంటరితనాన్ని తరిమికొడుతున్న ఓ ఊరి కథ
| గుజరాత్లోని మెహసానా జిల్లా చందంకి గ్రామం వృద్ధుల కోసం సామూహిక వంటశాలను ఏర్పాటు చేసింది. గ్రామంలో ఉంటున్న సుమారు 500 మంది వృద్ధులకు రోజూ రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు రూ.2,000-2,500 చెల్లిస్తున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తూ ఆప్యాయతను పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలుస్తోంది.
పిల్లలు విదేశాల్లో.. పెద్దలు పల్లెల్లో.. చేతిలో డబ్బులున్నా పంచుకునే మనుషులు లేక వృద్ధాప్యం భారంగా మారుతున్న వేళ.. గుజరాత్లోని ఓ చిన్న గ్రామం సరికొత్త సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఊరంతా ఒకే వంటశాల.. అందరూ కలిసి భోజనం.. ఆప్యాయంగా నాలుగు మాటలు.. వృద్ధుల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపుతున్న ఈ ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, తల్లిదండ్రులు, పిల్లలు.. ఇలా మూడు నాలుగు తరాలవారు కలిసి జీవించేవారు. ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ తోడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవితం అంటూ యువత సొంత ఊళ్లను వదిలి నగరాలు, విదేశాల బాట పడుతోంది. దీంతో ఒకప్పుడు పిల్లాపాపలతో కళకళలాడిన ఇళ్లు ఇప్పుడు వృద్ధులతో నిశ్శబ్దంగా మారుతున్నాయి.
పిల్లలు సంపాదిస్తున్నారు.. తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నారు. అవసరమైన మందులు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ రోజూ పలకరించే మనిషి ఉండటం లేదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఓదార్చే వారు కనిపించడం లేదు. కనీసం కలిసి భోజనం చేసే తోడు కూడా కరువవుతోంది. ఈ సమస్యకు గుజరాత్లోని చందంకి గ్రామం చూపించిన పరిష్కారం నిజంగా ఆలోచింపజేస్తోంది.
గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఉన్న చందంకి గ్రామం ఒకప్పుడు వెయ్యి మందికి పైగా జనాభాతో సందడిగా ఉండేది. అయితే కాలక్రమంలో యువత చదువులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 500 మంది వృద్ధులు నివసిస్తున్నారు. వయసు మీద పడటంతో వంట చేసుకోవడం.. కూరగాయలు తెచ్చుకోవడం.. ఇంటి పనులు చేసుకోవడం వారికి భారంగా మారింది. అంతకంటే పెద్ద సమస్య ఒంటరితనం. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్.. ప్రతి ఇంట్లో విడివిడిగా వంట చేసుకోవడం కంటే.. గ్రామమంతటికీ ఒకే సామూహిక వంటశాల ఉంటే బాగుంటుందని భావించి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఈ సామూహిక వంటశాలలో ప్రత్యేకంగా వంటవాళ్లను నియమించి.. ప్రతిరోజూ రెండు పూటలా భోజనం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు నెలకు సుమారు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు చెల్లిస్తున్నారు. ఇక్కడ అసలైన విశేషం వంటకాల మెనూలో కాదు.. అందరూ ఒకేచోట చేరి.. ఒకే కుటుంబంలా కూర్చుని భోజనం చేయడంలో ఉంది. భోజనం చేస్తూ పాత జ్ఞాపకాలను పంచుకోవడం, ఒకరి ఆరోగ్య పరిస్థితిని మరొకరు తెలుసుకోవడం జరుగుతోంది. ఎవరైనా కనిపించకపోతే ఆరా తీయడం.. అనారోగ్యంతో ఉన్నవారికి భోజనం అందించడంతో ఈ వంటశాల కాస్తా వృద్ధుల ఆత్మీయ సమావేశ కేంద్రంగా మారిపోయింది.
పిల్లలు ఎంత డబ్బు పంపించినా వృద్ధులకు కావాల్సిన ప్రతిదీ అందించినట్లు కాదు. వృద్ధాప్యంలో మనిషికి అవసరమయ్యేది ఆర్థిక భరోసాతో పాటు తన మాట వినే వ్యక్తి.. తనతో కలిసి నవ్వే మనిషి. చందంకి గ్రామం చేస్తున్న ప్రయత్నం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. దేశంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నందున.. గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇలాంటి కార్యక్రమాలను చేపడితే వృద్ధుల చివరి గడియలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.. నిజానికి చందంకి గ్రామం మనకు నేర్పిస్తున్న పాఠం ఒక్కటే.. వృద్ధులను పోషించడం అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు.. వారితో కలిసి భోజనం చేయడం కూడా...