అమర్ నాథ్ పై మహిళా కమిషన్ సీరియస్

అమర్ నాథ్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు లేఖ రాయబోతున్నామని తెలిపారు.

Update: 2026-06-17 09:23 GMT

ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద కామెంట్లు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమర్ నాథ్ పై విశాఖపట్నంలో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా అమర్ నాథ్ కామెంట్లపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. అమర్ నాథ్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మహిళా మంత్రి అనితను ‘మేకప్ మంత్రి’ అని సంబోధిస్తూ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను శైలజ తీవ్రంగా తప్పుబట్టారు.

అమర్ నాథ్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు లేఖ రాయబోతున్నామని తెలిపారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై అమర్ నాథ్ కు మహిళా కమిషన్ తరఫున సమన్లు జారీ చేస్తామని చెప్పారు. రాజకీయాల్లో విధానాలపై విమర్శలు ఉండొచ్చని, కానీ, ఒక మహిళా ప్రజా ప్రతినిధి రూపం, దుస్తులు, మేకప్ గురించి మాట్లాడటం సమర్థనీయం కాదని శైలజ స్పష్టం చేశారు. అమర్ నాథ్ వ్యాఖ్యలు ఒక్క హోంమంత్రిని మాత్రమే కాకుండా మొత్తం మహిళా సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు.

ఓ పక్క దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతోందని, కానీ, అమర్ నాథ్ వంటి నేతలు ఇలా బాధ్యతారాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి మహిళలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఈ తరహా కామెంట్లతో వారు నిరుత్సాహపడి వెనకడుగు వేసే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. నైతిక విలువలు లేనివారు నాయకులు కాలేరని అమర్ నాథ్ కు శైలజ హితవు పలికారు.

Tags:    

Similar News