వైసీపీ త్రీ కాపిటల్స్ బాబు త్రీ కారిడార్స్ ఒకటేనా ?
వైసీపీ విధానాన్నే బాబు ఇప్పుడు అనుసరించే పనిలో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.;
వైసీపీ విధానాన్నే బాబు ఇప్పుడు అనుసరించే పనిలో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మా పాలసీలనే బాబు ఇపుడు చేస్తామని చెబుతున్నారు. మొదటి నుంచి వైసీపీ అంటున్నది ఒక్కటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని. అదే విషయం ప్రభుత్వంలో ఉన్నపుడు త్రీ కాపిటల్స్ పేరుతో చెబితే వైసీపీని తప్పుపట్టిన చంద్రబాబు ఇపుడు త్రీ కారిడార్స్ అంటున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు కారిడార్స్ అని బాబు అనడం వెనక వైసీపీ పాలసీల ప్రభావం ఉందని గుడివాడ విశ్లేషించారు.
మావిగన్ అనగానే :
నిజానికి అమరావతిలోనే సర్వం ఖర్చు చేస్తూ అక్కడే అన్నీ అన్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని గుడివాడ దుయ్యబెట్టారు. యాభై వేల కోట్ల దాకా అప్పులు తెచ్చిన చంద్రబాబు అవి అన్నీ అమరావతి కోర్ కేపిటల్ అని చెప్పే 29 గ్రామాల మధ్యనే ఖర్చు చేస్తున్నారు తప్పించి రాష్ట్రమంతా ఎక్కడైనా కేటాయించారా అని గుడివాడ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో అయితే మచిలీపట్నం పోర్టుకు 5,500 కోట్ల రూపాయలతో కేటాయింపులు చేశామని పనులు ప్రారంభించి చాలా వరకూ వచ్చేలా చూశామని చెప్పారు. అలాగే భోరాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి అయిదు వేల కోట్ల రూపాయలతో కోస్టల్ కారిడార్ ని అనుమతులు తెచ్చి డీపీఆర్ ని తెస్తే దానిని సముద్రంలో కూటమి నేతలు కలిపేశారని గుడివాడ విమర్శించారు. అనాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రప్పించి మరీ దాని పనులు వేగంగా సాగేలా ప్రణాళికలు రచించామని చెప్పారు. కానీ కూటమి వచ్చాక కోస్టల్ కారిడార్ అన్నదే లేకుండా చేసిందని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి మరో పుత్రజయ :
బాబు మాదిరిగానే తెలివితేటలు ఎక్కువగా ఉన్న ఒకాయన కౌలాలంపూర్ వద్దు పుత్రజయ అని ఒక నగరం కట్టారని అయితే అక్కడ జనాలు లేక దెయ్యాలు తిరుగుతున్నాయని అది ఘోస్ట్ క్యాపిటల్ అయింది అని గుడివాడ గుర్తు చేశారు. అమరావతికి కూడా అదే రకమైన పరిస్థితి తీసుకుని రావాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. నగరాలను ఎవరూ నిర్మించరు అని కూడా ఆయన అన్నారు. కేవలం మౌలిక సదుపాయాలు కల్పించడం వరకే ప్రభుత్వాలు పరిమితం కావాలని గుడివాడ సూచించారు.
ఆ మూడూ ఈ మూడూ :
ఇదిలా ఉంటే జగన్ చెప్పిన మూడు రాజధానులు బాబు చెబుతున్న మూడు కారిడార్లు ఒక్కటే అని గుడివాడ అంటున్నారు. అవి రెండూ ఒక్కటేనా అన్నది చర్చగా ఉంది. అమరావతి రాజధానిగా ఉంచుతూ ఎకనామిక్ కారిడార్లుగా మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూంటే విశాఖలో అన్నీ పెట్టాలని జగన్ నాడు చూశాడు కదా అని ప్రత్యర్ధులు అంటున్నారు. మొత్తం మీద గుడివాడ కామెంట్స్ మీద చర్చ అయితే సాగుతోంది.