విశాఖలో గూగుల్ పండుగకు కౌంట్ డౌన్

విశాఖలో భారీ పెట్టుబడితో వస్తున్న డేటా సెంటర్ తో దేశమంతానే కాదు ప్రపంచం అంతా విశాఖ వైపు చూసే అవకాశం ఉంది అని అంటున్నారు.;

Update: 2026-04-07 04:45 GMT

దేశంలోనే అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో తన తొలి అడుగు వేయబోతోంది. దానికి ముహూర్తం రెడీ అయింది. విశాఖ అంటేనే కేరాఫ్ ఐటీ క్యాపిటల్. అలాంటి చోట అతి పెద్ద డేటా సెంటర్ గా గూగుల్ సంస్థ నెలకొల్పడంతో అంతా హర్షం వ్యక్తం అవుతోంది. కొద్ది నెలల క్రితం దీనిని సంబంధించి ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఇక ఆ మీదట విశాఖ జిల్లాలో గూగుల్ డేటా సెంటర్ కి అవసరం అయిన భూ సేకరణ కూడా చేశారు. కీలకమైన మూడు ప్రాంతాలలో డేటా సెంటర్ కోసం భూమిని ప్రభుత్వం కేటాయించింది. దాంతో ప్రాధమికంగా అన్ని లాంచనాలను పూర్తి చేసుకుని ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖలో తన అద్భుతమైన జర్నీని మొదలెట్టబోతోంది.

భారీ ఉత్సవంగా :

విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన జరగనుంది. ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ కి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా హాజరు కావడం విశేషం. అంతే కాదు ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీకి చెందిన కూటమి మంత్రులు పాల్గొననున్నారు.

భారీ పెట్టుబడితో :

విశాఖలో భారీ పెట్టుబడితో వస్తున్న డేటా సెంటర్ తో దేశమంతానే కాదు ప్రపంచం అంతా విశాఖ వైపు చూసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసుకుంది. లక్షన్నర కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. ఇపుడు ఏకంగా ఒక లక్షా 27 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో రాబోంది. గూగుల్ కి అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్‌ఫ్రా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఈ డేటా సెంటర్ ని వేయి మెగావాట్ల సామర్థ్యం తో అభివృద్ధి చేయనున్నారని చెబుతున్నరు.

రెండేళ్ళలోనే :

ఇక 2026 ఏప్రిల్ లో శంకుస్థాపన చేసుకుంటున్న గూగుల్ డేటా సెంటర్ ని రెండేళ్ళ వ్యవధిలో అంటే 2028 జూలై నాటికి అందుబాటులోకి తెస్తారని అంటున్నారు. ఈ డేటా సెంటర్ కోసం విశాఖ జిల్లాలోని తర్లువాడ, అలాగే అడవి వరం, ఇక అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి లో ప్రభుత్వం 600 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. డేటా సెంటర్ కనుక తన ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే విశాఖలో ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఐటీ రంగంలో వస్తాయని అంటున్నారు. అంతే కాకుండా టెక్ సిటీగా రానున్న రోజులలో కీర్తిని అందుకుంటుందని అంటున్నారు. ఈ డేటా సెంటర్ తో విశాఖ దశ తిరగనుంది అని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ నెలాఖరులో విశాఖలో జరగబోయే కార్యక్రమంతో దేశమంతా ఇటు చూసేలా చేస్తారని అంటున్నారు.

Tags:    

Similar News