గోదావరి జిల్లాల్లో చేతులు మారిన రూ. 700 కోట్లు !
సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించడం, జూదం ఆడటం చట్టరీత్యా నేరం. అందుకే కోర్టులు వీటిని నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి.;
సంక్రాంతి సందడికి ఉభయ గోదావరి జిల్లాల్లో కొదవ ఉండదు. కోడి పందాలు, జూదం లేకుండా సంక్రాంతి సందడి ఉండదు. ఏడాదికేడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రజలు సంక్రాంతి సంబరాల కోసం ప్రత్యేకంగా గోదావరి జిల్లాలకు వెళ్తారంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది కూడా కోడి పందాలకు, జూదానికి అనుమతి లేదు. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రం ఆగలేదు. గతానికంటే ఎక్కువగా కోడి పందాలు, జూదం నిర్వహించినట్టు తెలుస్తోంది.
చేతులు మారిన రూ. 700 కోట్లు !
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి మూడు రోజుల్లోనూ కోడిపందాలు, జూదంలో రూ. 700 కోట్లు చేతులు మారినట్టు ఒక అంచనా. తూర్పు గోదావరి జిల్లాలో రూ. 500 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 250 కోట్లు చేతులు మారాయట. ఇదొక రికార్డు అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. గతం కంటే ఎక్కువగా ఈ ఏడాది కోడిపందాలు, జూదం నిర్వహించారని చర్చించుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు గోదావరి జిల్లాలకు వెళ్లారు. కొందరు సరదాగా కోడి పందాలు చూడటానికి వెళ్తే.. ఇంకొందరు పందెం కోసమే వెళ్లారు. పందెం చూస్తు ఇంకొందరు పందెం కాశారు. ఇలా దాదాపు రూ. 700 కోట్ల లావాదేవీలు సంక్రాంతి సందర్భంగా జరిగినట్టు అంచనా ఉంది.
కోర్టు ఆదేశాలు.. పోలీసు ఆంక్షలు
సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించడం, జూదం ఆడటం చట్టరీత్యా నేరం. అందుకే కోర్టులు వీటిని నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. కోడిపందాలు నిర్వహించకూడదని,జూదం ఆడకూడదని పోలీసులు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఆగలేదు. కోర్టుల ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు పండగ పూట పని చేయలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న కారణంతో ప్రభుత్వం చూసిచూడనట్టు ఉండిపోయింది. ప్రభుత్వంలోని కొందరు పరోక్షంగా ప్రోత్సహించారు. దీంతో ప్రతి ఏడాదిలాగే సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాల్లో అంబరాన్ని తాకాయి.
కోడి పందాల చరిత్ర ..
ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పంట కోత పూర్తయి, ధాన్యం ఇంటికి చేరాక సంక్రాంతి ఆనవాయితిగా చేసుకుంటారు. ఆ సంక్రాంతి సందర్బంగా కోడి పందాలు నిర్వహించడం చాలాకాలంగా గోదావరి జిల్లాల్లో ఉంది. ఇది ఒక సంబరంలాగే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే వ్యవహరంలా మారింది. దీంతో అనుమతి లేకపోయినా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ప్రజల సెంటిమెంట్ తో ముడిపడిన అంశం కావడంతో ప్రభుత్వాలు కూడా మూడు రోజులు పట్టించుకోవడం లేదు.
ఏడాదికేడాది మార్పు ..
కోడి పందాల నిర్వహణలో రానురాను మార్పులు వస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్ తరహాలో గోదావరి జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులకు మంచి లాభదాయక వ్యాపారంగా మారింది. ఫ్లడ్ లైట్లు, గ్యాలరీలు, కుర్చీలు, వీక్షకుల కోసం తినుబండారాలు, ముగ్గుల పోటీలు, ప్రత్యేక బరిలు.. ఇలా ఓ చిన్నసైజు క్రికెట్ పండుగలా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు ఉంటున్నాయి. వీటికి స్థానికులు ఆధునిక హంగులు అద్దుతున్నారు. దీంతో తెలుగు ప్రజలను కోడి పందాలు బాగా ఆకర్షిస్తున్నాయి. స్థానిక వ్యాపారులకు సంక్రాంతి మంచి లాభాలను ఇస్తోంది.