ప్రపంచానికి మరో ముప్పు

ప్రపంచాన్ని మరోసారి జాగృతం చేస్తున్న అంశం జూనాటిక్‌ వ్యాధులు. అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు.;

Update: 2025-07-26 13:30 GMT

ప్రపంచాన్ని మరోసారి జాగృతం చేస్తున్న అంశం జూనాటిక్‌ వ్యాధులు. అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు. ఇటీవల ఇటలీకి చెందిన యూరోపియన్ కమిషన్ యొక్క వైజ్ఞానిక అభివృద్ధి కార్యక్రమాల విభాగ పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ వ్యాధుల ప్రబలతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ అధ్యయనం పత్రం ప్రముఖ శాస్త్రీయ జర్నల్ “సైన్స్ అడ్వాన్సెస్”లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచ భూభాగంలో సుమారు 9 శాతం ప్రాంతాల్లో జూనాటిక్‌ వ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తేలింది. అంతేకాకుండా ప్రపంచ జనాభాలో 3 శాతం మంది ఇప్పటికే ఈ వ్యాధులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుండగా, మరో 5 శాతం జనాభా జూనాటిక్‌ వ్యాధుల ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్నారు. ఇది భవిష్యత్తులో ఈ వ్యాధుల వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉండవచ్చో సూచిస్తోంది.

జూనాటిక్‌ వ్యాధుల జాబితా

ఈ అధ్యయనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రూపొందించిన ప్రాధాన్య వ్యాధుల జాబితాను ఆధారంగా తీసుకున్నారు. అందులోని ముఖ్యమైన వ్యాధులు చూస్తే కోవిడ్-19, ఎబోలా,మెర్స్ (MERS),సార్స్ (SARS), నిపా వైరస్.. ఇవన్నీ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందే ప్రమాదకర వ్యాధుల జాబితాలో ఉన్నాయి.

వ్యాధుల వ్యాప్తికి కారణాలు

పరిశోధకులు జూనాటిక్‌ వ్యాధుల వ్యాప్తికి పలు అంశాలను ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో తేడాలు వ్యాధులు వ్యాప్తి చెందే పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కొన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి. అకాల వర్షాలు లేదా వర్షపాతం లేకపోవడం వంటివి జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేసి, వ్యాధుల వ్యాప్తికి కారణం కావచ్చు. నీటి ఎద్దడి వల్ల జంతువులు, మానవులు ఒకే చోట నీటి కోసం గుమిగూడటం, తద్వారా వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. అడవులను నరికివేయడం, పట్టణీకరణ పెరగడం వంటివి జంతువులు, మానవులు ఒకరికొకరు దగ్గరగా రావడానికి కారణమవుతాయి, ఇది వ్యాధి సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ అంశాలన్నీ జూనాటిక్‌ వ్యాధుల వ్యాప్తిని వేగంగా పెంచుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

-ఆరోగ్య విధానాల్లో మార్పులు అనివార్యం

ఈ అధ్యయనం వల్ల ఒక కీలకమైన విషయం స్పష్టమవుతోంది: ప్రజారోగ్య విధానాల్లో వాతావరణ మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్‌లో మానవులు ఎదురు చూడవలసిన సవాళ్లను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. కేవలం వైద్యపరమైన చర్యలే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నివారణకు సంబంధించిన విధానాలను కూడా ప్రజారోగ్య ప్రణాళికల్లో భాగం చేయాలి.

-భవిష్యత్తు సవాళ్లు

ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న జూనాటిక్‌ వ్యాధులు భవిష్యత్తులో మానవాళిని గంభీరంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఇవి కేవలం ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా, ఆర్థిక, సామాజిక దృష్ట్యా కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే భవిష్యత్‌ ప్రణాళికల్లో ప్రకృతి, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం పట్ల అవగాహన ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ మహమ్మారులను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News