విజయ్ గూటికి.. నటి గౌతమి..!
తమిళనాట రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలలో ఉన్న ముఖ్య నాయకులు.. ఆయా పార్టీలను వీడుతున్నారు.
తమిళనాట రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలలో ఉన్న ముఖ్య నాయకులు.. ఆయా పార్టీలను వీడుతున్నారు. వీరిలో కొందరు ముఖ్య నాయకులు.. సీఎం విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇక, ఇదే సమయంలో బీజేపీ లో కూడా ముసలం పుట్టింది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్.. అన్నామలై.. కమల నాథులకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చిన దరిమిలా.. బీజేపీ నుంచి నాయకులు వరుసగా బయటకు వచ్చి.. అన్నామలైకి మద్దతు చెబుతున్నారు.
తాజాగా అన్నాడీఎంకేలో కీలక ఐకాన్ లీడర్‌గా ఉన్న ప్రముఖ నటి గౌతమి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అన్నాడీఎంకేలో .. గత ఎన్నికల సమయంలో ఆమె పలు జిల్లాల్లో ప్రచారం చేశారు. సొంత డబ్బులు కూడా ఖర్చు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మహిళలను ఏకం చేసేందుకు ఆమె ఎన్నికల సమయంలో విస్తృత ప్రచారం చేశారు. కానీ.. పార్టీ ఘోరం గా ఓడిపోయింది. తాజాగా ఆమె అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు.
తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌతమి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ రాజీనామా లేఖను అన్నాడీఎంకే కార్యదర్శి పళనిస్వామికి పంపిన గౌతమి... ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పార్టీలో కొనసా గలేదనని.. అందుకే వీడుతున్నానని పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చిన పళని స్వామికి ఆమె ధన్యవా దాలు తెలిపారు. కాగా.. ఇప్పటికే 24 మంది ఎమ్మెల్యేలు.. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన పరిణామం మరింత ఇబ్బందికి గురి చేసింది.
విజయ్ గూటికే!
నటి గౌతమి తాజా పరిణామాన్ని ఊహించేందనని అధికార టీవీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి ఆమె చేరే అవకాశం ఉందన్నారు. మహిళల అభ్యున్నతికి, వారి సాధికారతకు.. ప్రబుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. కాగా.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని నటి గౌతమికి రిజర్వ్ చేశారని.. అందుకే ఆమె అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చారని స్థానిక మీడియా పేర్కొనడం గమనార్హం.